శ్రీరాముని తరువాత అయోధ్యను ఎవరు పాలించారు?

ఈ ప్రశ్నకు సమాధానం కాళిదాసు రఘువంశంలోనే దొరుకుతుంది. శ్రీ రాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారులైన కుశ లవులకు, తమ్ములకుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూచాము. వారంతా రాముడు జీవించియుండగానే ఆ యా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు. అందులో కుశునికి కుశావతి అనే నగరం కేంద్రముగా చిన్న రాజ్యం లభిస్తుంది. ముందు లక్ష్మణుడు తరువాత శ్రీరాముడు తమ మానవదేహాలను త్యజించి వైకుంఠవాసులౌతారు. అయోధ్యానగర పౌరులు అనేకులు కూడా శ్రీరామునితోబాటుగా సరయూనదిలో జలప్రవేశం చేస్తారు. అయోధ్య కళావిహీనమౌతుంది. కొంతకాలానికి కుశావతిలో రాజభవనంలో నిద్రిస్తున్న కుశునికి ఒక రాత్రి ఒక కల వస్తుంది. అయోధ్యానగర అధిదేవత దర్శనము ఇచ్చినది. అయోధ్యకు తిరిగివచ్చి పాలనను చేపట్టమని, పూర్వవైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది.

ఆమెకోరికను శిరసావహించి కుశుడు అయోధ్యకు తిరిగి వస్తాడు. సింహాసనం అధిష్ఠిస్తాడు. కొన్ని రోజులలోనే అయోధ్య తిరిగి కళకళలాడుతుంది. ప్రజలు ఆనందంగాఉంటారు. ఒక దినం కుశుడు సరయూనదిలో జలక్రీడలు సలుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది. వెదకినా దొరకదు. ఆనదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుశుడు అస్త్రప్రయోగం చేయబోతాడు. కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వాచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు. తరువాత తన సోదరి కుముద్వతిని వివాహంచేసుకొమ్మని అడుగుతాడు. కుశుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు. వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు. కుశుని తరువాత అతడు అయోధ్యను పాలిస్తాడు.. గొప్ప రాజనీతికోవిదుడు. కాని దుర్జయుడనే అసురునిచేతిలో మరణిస్తాడు.

తరువాత 21 రాజుల పేర్లు రఘువంశం చెబుతుంది. 21వ తరము రాజు సుదర్శనుడు. అతడికుమారుడు అగ్నివర్ణుడు. స్త్రీలోలుడు. క్షయ వ్యాధితో మరణిస్తాడు. తరువాత ఆవంశంలో గుర్తుంచుకోవలసిన వారులేరు. మహాభారత కాలంలో వారి వంశీయుడు కౌరవులతరఫున యుద్దంచేసి మరణిస్తాడు. అయోధ్య సప్త పుణ్యనగరాలలో ఒకటిగా కీర్తి పొందింది. 

Comments

Popular Posts