మధుమేహం - వ్యాధి లక్షణాలు

మధుమేహం యొక్క లక్షణాలలో సాంప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం) మరియు పాలీఫాజియా (అతిగా ఆకలి వేయడం) అను వాటిని చెప్పుతారు. మొదటి రకం డయాబెటిస్‌లో ఈ లక్షణాలు త్వరగా అగుపిస్తాయి (ముఖ్యంగా చిన్న పిల్లలలో). కానీ, రెండవ రకంలో మాత్రం వ్యాధి లక్షణాలు చాలా నెమ్మదిగా మొదలవుతాయి, ఒక్కోసారి ఈ లక్షణాలేమీ కనిపించకపోవచ్చు కూడా. మొదటి రకం డయాబెటిస్ వల్ల కొద్ది సమయంలోనే గుర్తించదగిన బరువు తగ్గడం (మామూలుగా తిన్నా, అతిగా తిన్నా కూడా) మరియు అలసట కలుగుతుంటాయి. ఒక్క బరువు తగ్గడం తప్ప మిగతా అన్ని లక్షణాలు, సరిగా నియంత్రణలలో లేని రెండవ రకం డయాబెటిస్ రోగులలో కూడా కనిపిస్తాయి. మూత్రపిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్ టుబ్యూల్ నుండి గ్లూకోస్ రీఅబ్సార్ప్షన్ సరిగా జరగదు, కొంత గ్లూకోస్ మూత్రంలో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క ద్రవాభిసరణ పీడనం పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది. ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్‌ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.
రోగుల్లో (ముఖ్యంగా టైప్ 1) డయాబెటిక్ కీటో అసిడోసిస్ కూడా ఉండే అవకాశాలున్నాయి. దీనివల్ల మెటబాలిసమ్ నియంత్రణ కోల్పోయి శ్వాసలో అసిటోన్ వాసన రావడం, శ్వాస వేగంగా పీల్చుకోవడం, కడుపులో నొప్పి మొదలగు లక్షణాలు అగుపిస్తాయి. ఈ పరిస్థితి తీవ్రమైతే కోమా తద్వారా మరణం సంభవించవచ్చు. అతి అరుదైనదైనా తీవ్రమైన టైప్ 2 లో కలిగే నాన్ కీటోటిక్ హైపర్ ఆస్మొలార్ కోమా,శరీరం లో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కలుగుతుంది.

Comments

Popular Posts