ఇల్లు, స్థలాలు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే చిక్కుల్లో పడతారు..

ఒక వ్యక్తి రూ.65 లక్షలతో హైదరాబాద్‌లో ఒక ఇండిపెండెంట్‌ హౌజ్‌ కొన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే.. కోర్టు నోటీసులతో కుదేలై పోయాడు.ఉమ్మడి ఆస్తి అయిన ఇంటిని తన సోదరుడు తనకు చెప్పకుండా విక్రయించాడని, తన వాటా డబ్బులు తనకివ్వాలని, లేదా ఇల్లు ఖాళీ చేయాలని రవికి ఇల్లు అమ్మిన వ్యక్తి సోదరుడి నుంచి కోర్టు నోటీసులు అందాయి.ఇలాంటి ఊహించని పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే ఇల్లు లేదా స్థలాలు కొనే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అవేంటో చూద్దాం..
టైటిల్‌ డీడ్‌.. 
మీరు కొనాలనుకుంటున్న ఇల్లు లేదా స్థలం, ఎవరి పేరున ఉందో తెలుసుకోవాలి. టైటిల్‌ డీడ్‌ (యాజమాన్య పత్రం) చూస్తే ఈ విషయం తెలిసి పోతుంది.
ఆస్తి అమ్మడానికి సిద్ధపడిన వ్యక్తి పేరు మీదే ఆ ఆస్తి ఉందా? అతడికి దానిపై హక్కు ఉందా లేదా ధ్రువీకరించుకోవాలి. టైటిల్‌ డీల్‌ పత్రం తీసుకుని ప్రాపర్టీ కేసులు చూసే అనుభవజ్ఞుడైన న్యాయవాది చేత చెక్‌ చేయుంచుకోవడం మరీ మంచిది.
ఒకవేళ ఆస్తి ఇద్దరు లేదా ఎక్కువ మంది పేర ఉంటే, ప్రతి ఒక్కరి నుంచి రిలీజ్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాతే కొనుగోలుకు సిద్ధపడాలి. లేకపోతే మున్ముందు న్యాయపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
టాక్స్‌ రసీదులు, బిల్లులు.. 
ఆస్తి కొనే ముందే ఆ ఆస్తి యజమాని, దానికి సంబంధించి ప్రభుత్వానికి హౌజ్‌ టాక్స్‌ వంటి పన్నులు, కరెంట్‌, వాటర్‌ వంటి బిల్లులు సరిగా చెల్లిస్తున్నాడా? లేదా చెక్‌ చేసుకోవాలి.
ఇందుకోసం ఆస్తి యజమాని నుంచి ఒరిజినల్‌ రసీదులు తీసుకుని పరిశీలించాలి. లేకపోతే ఆ ఆస్తిపై మొదటి హక్కు ప్రభుత్వానికే ఉంటుంది. ఆ ఆస్తి కొనే నాటి వరకు ఉన్న ఒరిజినల్‌ బిల్లులు పరిశీలించడం మంచిది. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, తర్వాత న్యాయపరమైన సమస్యలతో ఆ ఆస్తి కొనుగోలు ఖర్చులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌.. 
కొనే ఆస్తిపై ఏమైనా న్యాయపరమైన వివాదాలున్నాయో లేదో తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఆ ఆస్తి ఉన్న ప్రాంత సబ్‌ రిజిసా్ట్రర్‌ ఆఫీసు నుంచి ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడం ద్వారా ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవచ్చు.
ఆ ఆస్తి యాజమాన్యంపై ఎలాంటి న్యాయపరమైన సమస్యలుగానీ, ఫిర్యాదులుగానీ లేవని ఆ సర్టిఫికెట్‌లో ఉంటేనే, ఆ ఆస్తి కొనుగోలు విషయంలో ముందుకెళ్లాలి. లేకపోతే కోరి కోరి తలగొరుక్కున్నట్టవుతుంది.
ఆస్తుల తనఖా పరిశీలన.. 
చాలా మంది తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఆస్తులు బ్యాంకుల దగ్గర, వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటుంటారు. అలాంటి ఆస్తిని కొనేటపుడు, అప్పు పూర్తిగా తీర్చారో లేదో ధ్రువీకరించుకోవాలి. అప్పులన్నీ తీరిపోయాయని యజమాని చెప్పినా అందుకు సంబంధించిన సాక్ష్యాల పత్రాలు పరిశీలించండి.
బ్యాంకులైతే ఏదైనా ఆస్తిని హామీగా పెట్టుకుని అప్పులిస్తే, ఆ అప్పులు తీర్చిన వెంటనే రిలీజ్‌ సర్టిఫికెట్‌ ఇస్తాయి. ఆ సర్టిఫికెట్‌ చూశాకే కొనుగోలు విషయంలో ముందుకెళ్లాలి.
భూమి కొలతలు.. 
రిజిసే్ట్రషన్‌కు ముందే మీరు కొనే ఇల్లు లేదా స్థలం, అమ్మకందారుడు చెప్పిన కొలతల ప్రకారం ఉన్నాయో లేదో చెక్‌ చేసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వ గుర్తింపు పొందిన ఎవరైనా సర్వేయర్‌ ద్వారా ఆ ఆస్తుల విస్తీర్ణాన్ని, సరిహద్దులను కొలిపించుకోవాలి.
ఒప్పందం.. 
న్యాయపరమైన సమస్యలు లేవని నిర్ధారించుకున్నాక, ధరపైనా బేరం కుదిరితే ఇక న్యాయపరంగా చెల్లుబాటయ్యేలా రూ.200 స్టాంప్‌ పేపర్‌పై లిఖిత పూర్వక ఒప్పందం చేసుకోవాలి. ఈ ఒప్పందంలో ఆస్తి అమ్మకం ధర, బయానా కింద ముందుగా ఏమైనా చెల్లిస్తుంటే ఆ వివరాలు, ఎప్పటిలోగా ఆస్తికి సంబంధించిన కొనుగోలు ధర మొత్తం చెల్లించాలివంటి వివరాలు ఉండాలి.
ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా ఒప్పందాన్ని పూర్తి చేయడంలో విఫలమైతే, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు అనుసరించాల్సిన పద్ధతిని కూడా ఒప్పందంలో పేర్కొనాలి. ఈ లిఖిత పూర్వక ఒప్పందాన్ని ఎవరైనా లాయర్‌ చేత రాయించి, దానిపై అమ్మకందారు, కొనుగోలుదారుడితోపాటు ఇద్దరు సాక్షుల సంతకాలు చేయించాలి. అలా చేయడం వల్ల ఆస్తి అమ్మకందారు అధిక ధర వస్తోందని, ఆ ఆస్తిని మరొకరికి అమ్మేం దుకుగానీ, ఆస్తి ధర పెంచేందుకుగానీ అవకాశం ఉండదు. చెల్లింపుల్లో ఆస్తి కొనుగోలు దారుడు విఫలమైనా అమ్మకందారుడు కోర్టు ద్వారా ఒప్పందాన్ని అమలు చేయించుకోవచ్చు.
స్టాంప్‌ డ్యూటీ.. 
రిజిస్ర్టేషన్‌కు వెళ్లే ముందు స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలి. ఒకసారి స్టాంప్‌ డ్యూటీ చెల్లిస్తే ఇక ఆ ఒప్పందానికి చట్టబద్దమైన గుర్తింపు లభించినట్టవుతుంది. కోర్టులు కూడా దాన్ని సాక్ష్యంగా పరిగణిస్తాయి.
రిజిస్ట్రేషన్‌.. 
ఆస్తి హక్కుల బదిలీలో జరిగే ఆఖరి ప్రక్రియ రిజిస్ట్రేషన్‌. ఇందుకోసం ముందుగానే ఒక ముసాయిదా ఒప్పందం రాసుకోవాలి. తర్వాత చెల్లుబాటయ్యే ఒక స్టాంప్‌పేపర్‌పై ఒప్పందం రాసుకుని, ఆ ఆస్తి ఉన్న రిజిస్ట్రార్‌ లేదా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌ చేయించాలి.

Comments

Popular Posts