"ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది" అని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ వ్యక్తి గురించి తప్పక తెలుసుకోవాలి.

12 గంటలకి రెడీ అయ్యి బద్దకంగా మెట్ల మీద కూర్చుని ఫోన్లో న్యూస్ చూస్తున్నా.. నమస్తే సార్ అంటూ వెనకనించి సుబ్రహ్మణ్యం..! వెలిసిపోయిన టీ షర్ట్ చీగిపోయిన షార్ట్ వేసుకుని చేతిలో కవరుతో యుద్దానికి బయల్దేరే పేద సైనికుడిలా కనబడ్డాడు.
హాయ్ అంటూ ఫార్మల్గా నవ్వి మళ్ళీసెల్లోకి తలకాయ పెట్టేసాను. భోజనం చేసారా సార్ అనడిగాడు. ఇక తప్పేట్టు లేదనుకుని లేదండీ.. బయటికెళదామా లేక ఇక్కడే చేసేద్దామా అని ఆలోచిస్తున్నా అన్నాను. ఎందుకు సార్ నా దగ్గర రొయ్యల పచ్చడి ఉంది.. ఇంటినించి మా తమ్ముడొస్తూ తెచ్చాడు, ఒక్క నిమిషం ఉండండి పైకెళ్ళి ఇద్దరికీ సరిపడా తెచ్చేస్తాను.. దాంతో కానిచ్చేద్దాం అని నా అంగీకారం కోసం ఎదురుచూడకుండానే రయ్యిన పైకి పరిగెత్తాడు.

సుబ్రమణ్యంది నర్సాపురం దగ్గర అని మొన్న వారం క్రితం పరిచయం అయినపుడు తెల్సింది. బతుకుతెరువుకి దుబాయ్ వచ్చి లాజిస్టిక్స్ కంపెనీలో నెలకి 1500 Dirhams జీతానికి పనిచేస్తున్నాడని తనకి 11, 12 సంవత్సరాలున్న ఇద్దరు కూతుళ్ళని చెప్పాడు. ఇక అంతకుమించి నేనుకూడా తెలుసుకోడానికి ఆసక్తి చూపించలేదు.
సుబ్రహ్మణ్యం కిందకి వచ్చి కాంటీనుకి లాక్కెళ్లాడు. అక్కడంతా కోలాహలంగా ఉంది. ఇద్దరం భోజనంప్లేట్స్ తో కూర్చున్నాం. చారు, ఒక వెజ్ కర్రీ వేస్కుని వచ్చిన నన్ను చూసి చాలా నొచ్చుకున్నాడు.. అయ్యయ్యో.. పప్పు వేసుకుంటే అందులోకి రొయ్యల పచ్చడి కలుపుకుంటే బాగుండేది కదండీ.. చెప్పేను కదా మీకు అంటూ..!!
జనవరి 10వ తారీఖున ఇంటికెళ్తున్న అండి.. తన కళ్ళల్లో ఒకరకమైన ఉద్వేగంతో చెప్పాడు.... 
మూడు నెలలకోసారి ఫ్లయిట్ ఎక్కి దిగే నాకు అదేమంత ఎక్సయిటింగా అనిపించలేదు.. కానీ వాళ్ళు చేసే పనికి 2 ఇయర్స్ కి ఒకసారి వెళ్లి రావడమే కష్టమని అని గుర్తొచ్చి..
"ఓహ్.. కంగ్రాట్స్.. మరి వెకేషన్ ఎలా ప్లాన్ చేశారు.. ఏమైనా టూర్స్ వెయ్యబోతున్నారా" అనడిగాను..

"అబ్బేబ్బె అలాంటివేమీ ఉండవండీ" అన్నాడు.. మరింకేంటి హడావిడి అన్నాను... తాను చెప్పడం ప్రారంభించాడు..
"నాకో సోడాకొట్టు ఉండేదండీ.. సోడాకొట్టు సుబ్రహ్మణ్యం అంటే తెలీనోడు ఎవరు లేరండీ మా వూళ్ళో.. మూడేళ్లు మాంచి గట్టిగ రన్నయ్యిందండీ బిజినెస్సు.. నాకంటూ అన్ని స్థిరపరుచుకుని, కడుపులో నీళ్లు కదలకుండా నా బతుకేదో నేను బతికేస్తున్న టైములో దిగేడండీ మా పార్ట్నరు.. నా 10th ఐపోయాకా ఆడు నేను కలిసి కొన్నాళ్ళు ఉషాకిరణ్ మూవీస్లో కెమెరా అసిస్టెంట్స్ గా పనిచేసేంలెండి.. మంచి స్నేహంగా ఉండేవోళ్ళం.. ఆ చనువు మీద ఇద్దరు కల్సి ఏవైనా చేద్దాం అనుకుని షాపోకటి అద్దెకి తీస్కుని, రెస్టారెంట్ బిజినెస్సులోకి దిగేమండీ.. డబ్బులు అందరికి ఉంటాయండీ.. కానీ పెట్టె మనసు అందరికి ఉండొద్దూ.. అందుకే హోటలేట్టేమండీ. హైవే పక్కనే.. పెట్టుబడి ఎక్కువే పెట్టి సరైన వంట మేష్టారని పురమాయించి, లైటింగు, మైకుసెట్లుతో దండిగానే మోపు చేసేమండి.. వంటమాష్టరు మంచోడవ్వడం వల్ల, చేసిన ఐటమ్సుకి మంచి పేరు రావడం వల్ల హోటలు బాగానే పేరెల్తంది జనాల్లోకి.. అన్నిటికి మించి అతను చేసే రకరకాల బిర్యానీ వంటల గురించి.. ఆ దెబ్బతో హోటల్కి పేరు, డబ్బు నాకు కూడా ఊళ్ళో, గౌరవం పరపతి పెరిగాయ్..
కానీ ఈ డబ్బనేది ఉన్నోడిని నిద్రపోనివ్వదు, లేనోడిని బతకనివ్వదు కదండీ.. పదిరూపాయలొచ్చేటపుడే పలురకాల వాళ్ళు పరిచయమవుతారు.. మాకు డబ్బులు రావడం చూసిన అలాంటి బ్యాచ్చే కొంతమంది మా చుట్టూ చేరి "మేముంటాం మీ వెనక మేం చూసుకుంటాం కదా మీకెందుకు చెప్పు" అంటా ఓ నాలుగెకరాల్లో రొయ్యల చెరువులుకి పెట్టుబడులు పెట్టించారు.. మనకి వూళ్ళో ఉన్న పలుకుబడి మీద, హోటలు మీద వస్తున్న ఆదాయం చూసి మాకు అప్పు ఇవ్వడానికి చాలామంది ముందుకి వొచ్చేరు.. వాళ్ళందరి ఉత్సాహం చూసి అన్ని కలుపుకుని 20 లక్షల దాకా లోన్లు అప్పులు చేసి ఏమి తెలికపోయినా సరే చెరువుల వ్యాపారం కూడా స్టార్ట్ చేశామండీ.. ఓ పక్క సోడాకొట్టు, ఇంకోపక్క రెస్టారెంటు, రాత్రుళ్ళు రొయ్యలచెరువులుతో తీరిక లేకుండా బిజీ బిజీ అయిపోయేను..నేను సోడాకొట్టు, చెరువులతో బిజీగా ఉంటే మా పార్ట్నరు, వంటమాష్టరు కల్సి హోటల్ని చూస్కుంటా ఉండేవోరు.
ఈలోగా ఎలక్షన్లొచ్చాయండీ.. ఏ పార్టీకాపార్టీ పోటాపోటీగా ప్రచారం చేస్తన్నాయ్యి. ఊళ్ళో ఏ ఇద్దర్ని కదిలించినా ఏ పార్టీ గెలుస్తదా అనే డిస్కషన్లు, పందేలు.. ఆ వేడి మాక్కూడా తగిలింది.. ఓ రోజు మధ్యాహ్నం వైసీపీ తరపున ప్రచారం చేస్తున్న మా హోటలు షాపు ఓనరు కంగారు కంగారుగా వచ్చి నీతో మాట్లాడాలి అన్నాడు.. చెప్పండన్నాను.. ఎం లేదు.. అర్జెంటుగా మీ వంటమేష్టరుని పనిలోంచి తీసెయ్యాలి అన్నాడు.. కాళ్ళ కింద భూమి కదలినట్టనిపించిందండీ నిజంగా ఆ టైములో.. ఏమైందండీ అనడిగాను... నేనేమో వైసీపీ..మీ వంటమేష్టారేమో కమ్యూనిస్టు పార్టీ. ఎలా కుదురుద్దీ అసలా, ఎగస్ పార్టీవోళ్ళని నీ బిల్డింగ్లో ఎలా ఉంచావయ్యా అంటా పార్టీ ఆఫీసులో ఒకటే గొడవ సుబ్రహ్మణ్యం.. ఐతే వంటొడినన్నా మార్చేయ్యి లేదంటే హోటలైనా ఖాళీ చేసేయ్అంతే అని గట్టి వార్నింగ్ లాంటిది ఇచ్చేసి కలర్ సోడా తాగేసి ఎంత కంగారుగా వచ్చాడో అంతే స్థిరంగా వెళ్ళిపోయేడు ఆ పెద్దమనిషి... ఎం చెయ్యాలో తెలీక ఎలారా భగవంతుడా అనుకుంటా నేను మా పార్ట్నరు చాల తర్జనభర్జనలు పడిపోయేము.. ఒకడి కోసం మొత్తం వ్యాపారాన్ని మూసేసి అందర్నీ రోడ్డు మీదకి తెచ్చేయడం కరెక్టు కాదనిపించి ఆఖరికి వంటమాస్టార్ని తీసేసాం.. ఆ మర్నాడే వేరే ఏ పార్టీతో సంబంధం లేని కొత్తవంటోడిని పన్లో పెట్టుకున్నాం..
అదిగోనండీ.. అక్కడినించి మాకు తెలీకుండానే మా రాత మారిపోయింది.. వంటోడు ఎపుడు మారిపోయేడో అపుడే హోటల్లో వంటకాల దగ్గరనించి విధానాలు కూడా మారిపోడం మొదలెట్టాయి.. మాకవేమి తెలిసేవి కావండీ.. ఐటమ్సులో తేడాలొచ్చేయడంతో బిజినెస్సు డల్లయిపోడం మొదలెట్టింది.. ఈ చికాకుల్లో ఉన్న మాకు రొయ్యల చెరువుల కింద ఉన్న నాలుగెకరాల భూమికి బాక్టీరియా తెగులు పాకడం తెలీలేదు గురువుగారూ.. ఎంతదాకా అంటే లక్షలకి లక్షలు వడ్డీలకి తెచ్చి పోసిన డబ్బులు చచ్చిపోయిన రొయ్యల రూపంలో చెరువులమీద తేలేదాక.. చెరువుల్లో రొయ్యలన్నీ రెండు రాత్రుల్లో చచ్చిపోయి పైకి తేలిపోయేసరికి మాకు పిచ్చెక్కిపోయింది.. మనది కానిది వజ్రం అయినా సరే మనదగ్గర ఉంచుకుంటే రాయిలా మారిపోద్దంటండీ.. అదే అయిందనిపించింది.. ఒక్కసారిగా అంతా తలకిందులైపోయింది.. మా పార్ట్నరుకి ఫోన్ చేస్తే ఎంతకీ కలవడం లేదు.. ఆ నెంబర్ ఇప్పటికి కలవడం లేదనుకోండి... అది వేరే విషయం.. !!
ఎం చేయాలా అని ఎంత ఆలోచించినా సరే ఎంతకూ తెమలట్లేదు.. కానీ మనిషి మంచితనం కన్నా ఆస్తిని బట్టే లెక్కేసే అప్పులోళ్లు ఊరుకోరు కదండీ.. నేను కూడా ఎక్కడికి పారిపోతానో అని మా బాకీలు ఎపుడు తీరుస్తావంటా ఇంటి మీదకి రావడం మొదలెట్టారు.. కొంతమందైతే అక్కడే మకాం.. నా దగ్గర పదిరూపాయలున్నపుడు నన్ను వ్యాపారంలోకి దింపిన బ్యాచ్ని హెల్పడిగితే నేనెవరో తెలీనట్టు పరాయివాడిలా చూసారు.. సిట్యుయేషన్ అర్ధమైపోయింది.. ఇంట్లో ఉన్న బంగారం అంతా అమ్మి 6 లక్షలు, నాకు అన్నం పెట్టి నన్ను నిలబెట్టిన సోడాకొట్టు అమ్మేసి 3 లక్షలు స్పాట్లో సరిపెట్టేసేనండీ.. ఇంకా పదిలక్షల అప్పు, ఆల్మోస్ట్ రోడ్ మీదకి వచ్చేసిన నా ఫామిలీ.. ఎం చేయాలి.. లక్కీగా అదేటైంలో దేవుడు ఈ దారి చూపెట్టేడండీ.. నేను హైద్రాబాద్లో ఖాళీగా ఉండే రోజుల్లో నేర్చుకున్న లేత్ టర్నింగ్ అపుడు పనికొచ్చిందండీ.. దుబాయిలో జాబ్ రెడీగా ఉందంటే సరే అని అందర్నీ వదులుకుని మా ఆవిడ కన్నీళ్ళని, పిల్లల అమాయకపు చూపులు తోడు తీస్కుని నేను ఒంటరిగా ఇక్కడికొచ్చేసాను.. 3500 Dirhams జీతం.. అన్ని పోను నెలకి 40000 పంపుతుంటే పాపం మా మావగారు అప్పులు సరిపెడతన్నాడు అక్కడ..
అలా 11 నెలలు గడిచేసరికి దేవుడు ఇంకోసారి చిన్నచూపు చూసేడు. బాగానే వెళ్తోంది అనుకున్న టైంలో కంపెనీలో జనాల్ని తగ్గించమని ఆర్డర్స్ వచ్చాయి.. అందులో నా పేరుంది.. మళ్ళీ మొదటికొచ్చాను.. ఇంటికెళ్లడానికి ఏ మాత్రం ఒప్పుకోలేదు.. 20 రోజుల పాటు రూంలోనే మొండిగా కూర్చుని, పక్కనే ఉన్న వేరే కంపెనీలో కాళ్ళా వేళ్ళా పడ్డాను.. వాళ్ళకి జాలేసి సరేగాని, ఇప్పుడంత జీతం ఇచ్చుకోలేం నెలకి 1500 మాత్రమే ఇస్తాము, సరే అంటే జాయినవ్వు లేదంటే నీ ఇష్టం అన్ని చెప్పేసేరండీ.. నాకు ఆ టైంలో నా ఇంటిచుట్టూ తిరుగుతున్న అప్పులోళ్లు, నన్నే నమ్ముకున్న భార్య, ఏమి తెలీని నా ఇద్దరు కూతుళ్లే.. ఇవే తప్ప ఈ జీతాలు, అంకెలు పట్టించుకోలేదండి.. పొజిషన్ అలాంటిది మరి.. సరే అని వెంటనే జాయిన్ అయిపోయా అండి. అన్నిపోను జాగ్రత్తగా నెలకి 20000 దాకా పంపుతున్నా అండి.. అన్ని తీర్చెయ్యగా ఇంకో 4 లక్షలదాకా బాకీ ఉంది ఇంకా.. ఈ కంపెనీలో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అవుతోంది .. కంపెనీ టిక్కెట్టు ఇస్తాం ఇంటికెళ్లి రా అంటోంది,.. నేను వద్దన్నా అండి.. మళ్ళీ అక్కడికెళ్తే ఖర్చు అని.. కానీ మా నాన్నేమో ఓ సారి రారా వెళ్లి చాల రోజులైంది కదా అని ఓ పక్క.. పాపం మా ఆవిడ కూడా పైకి చెప్పుకోలేకపోతోంది గాని పిల్లలకి నన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉందంట సార్.. అందుకే ఈ సంక్రాంతికి ఓ సారి వెళ్ళొద్దామనండి.. అయ్యో.. ఈ పచ్చడి ఇంకొంచెం వేసుకోండి హరిగారు... మీరేం తినట్లేదు అసలు అని ముగించాడు సుబ్రహ్మణ్యం..
అప్పటికే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్న నేను చాలాసేపు మాట పెగల్చలేకపోయాను.. తర్వాత ఎప్పటికో మెల్లగా అడిగాను.. మీ పార్ట్నర్ని ఎందుకు వదిలేసారు సుబ్రహ్మణ్యంగారు అని.. నా గొంతులో మర్యాద నాకే కొత్తగా ఉంది.. ఈలోకం ఎపుడు మంచోడిని మంచోడు ఆనదండీ.. మంచోడిలా నటించేవాడినే వీడు చాలా మంచోడు అంటుంది..ఐనా ఆడి మొకం.. ఏవిచ్చి ఏడుస్తాడండీ.. ఆరోజునించీ ఈరోజు దాక ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదండీ.. హైదరాబాద్లో ఆడి పని ఆడు చేస్కుంటా ఇపుడు బాగానే ఉన్నాడని విన్నాను. ఒక్క ఫోన్ కూడా చేసుకోలేదు ఇప్పటిదాకా.. కానీ నేను తీర్చాలి కదండీ.. అందుకే ఇలా వొచ్చేసెను..
మరి మీకు ఎపుడు భయం వెయ్యలేదా? ఎదుగుతున్న కూతుళ్లు, ఇంకోపక్క ఇబ్బందిపెడుతున్న అప్పులు..
సుబ్రహ్మణ్యం: నాకు ధైర్నం ఎక్కువండీ గురువుగారూ.. ఎపుడు దేనికి భయపడలేదు.. ఈ బాధలన్నీ గాలి లాంటివండీ.. అన్నిచోట్లా ఉన్నాయ్ అందరికి ఉన్నాయ్.. నాకొక్కడికే కాదు కదా సార్..

ఆ మాటలకి ఒక చల్లగాలి నా మొహాన్ని రివ్వున స్పృశించింది.. "మీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్నడగండి పర్లేదు.. మొహమాటపడకండి.. పదండి జ్యుస్ తాగొద్దాం.."
సుబ్రహ్మణ్యం:అయ్యబాబోయ్.. లేదండీ.. ఫుల్లుగా తినేసాను.. మళ్ళీ రాత్రికే ఇంక.. ఐన నాకేం ఖర్చులేముంటాయండి.. పెద్దగా బయట ఎం తీసుకోను.. ఇంటికి అప్పుడప్పుడు ఫోన్.. టీ కూడా కంపెనీలోని తాగుతా అండీ.. సెలవొచ్చినరోజు మాత్రం వారానికి ఒక్కసారి బయట తాగుతా.. సరే అండి ఐతే.. షిఫ్టుకి టైమవుతోంది అంటూ కవరు తీసుకుని హుందాగా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసుకుంటూ వెళ్తున్న సుబ్రహ్మణ్యాన్ని వెనక నుండి తదేకంగా చూస్తూ ఉండిపోయాను.. నాకు ప్రతిరోజూ జీవితంతో తలపడుతూ విజయాన్ని సాధించబోతున్న వీరుడు కనబడ్డాడు..
ఇపుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, భార్యాపిల్లలే కాదు.. నేను కూడా అతను ఇంటికెళ్లే రోజు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను.
-Sai Naidu (FB:ChandamamaKathalu)

Comments

Popular Posts