"శకుని"- ఇతడొక సంచలనం

ఆ పేరే ఒక సంచలనం ఆ పాత్రే అత్యంత విలక్షణం భారత ఇతిహాస పుటలపై తనపేరు ను సువర్ణాక్షరాలతో లిఖించుకున్న ఒకే ఒక్కడు. పరమ శివభక్తుడు. 
తన చతురత తో కురువంశాన్ని కూకటివేళ్లతో పెకలించాలనే లక్ష్యంగా ఎత్తులు పై ఎత్తులు వేసి కధ నడిపిన శకుని గాంధార రాజ్యం లోని సుభల దేశాధీశుడైన సౌబలుడికి గల వందమంది కుమారులలో చిట్టచివరి వాడు. వందమంది సోదరులకు ఒకే ఒక్క సోదరి గాంధారి. అయినా అమిత తేజోవంతమైన అందమైన అమ్మాయి అయినా ఆమెకు కుజ దోషం ఉండడం తో మొదట ఒక జంతువు తో వివాహం జరిపించి ఆ జంతువు ని బలి ఇచ్చి ఉత్తమ వరుని కోసం అన్వేషణ చేస్తున్నాడు సౌభలుడు... అక్కడ పరిస్థితి అలా ఉంటే
గాంధారి అందమైన అమ్మాయి కావడంతో ధృతరాష్ట్రుని తల్లి గాంధారి యెక్క అందచందాలు చూసి ముచ్చట పడి తన కోడలు ని చేసుకుంటానని సౌబలుడికి వర్తమానం పంపింది. తనకు గల ఒకేఒక్క కుమార్తె ను ముద్దులు మూటగట్టే మెరుపు తీగెను అంధుడైన దృతరాష్ట్రునికి ఇవ్వడానికి నిరాకరిస్తారు సులభుడు. అతని శత కుమారులు...
దీనితో తన అహం దెబ్బతిన్న ధృతరాష్ట్రుని తల్లి తక్షణమే గాంధారదేశం పై దండెత్తి సుభలుడ్ని బంధించి తెమ్మని భీష్ముడుని కోరుతుంది. ధర్మం తప్పని వాడు అయిన భీష్ముడు ఆమెని వారించి హితవు చెప్తాడు అయినప్పటికీ పట్టు వీడని ఆమె ఎప్పుడో తనకిస్తానని చెప్పిన వరాలని గుర్తుచేసి మరీ భీష్ముడుని యుద్ధం చేసి రమ్మని గాంధారదేశం పైకి ఉసిగొల్పుతుంది ఇచ్చిన మాట కు కట్టుబడేవాడైన భీష్ముడు చిట్టచివరికి సమ్మతించి యుద్ధం చేసి సౌబలుడిని అతని వందమంది కుమారులను బంధించి తేవడానికి వెళ్లి యుద్ధం చేస్తున్న సమయంలో శకుని తన వ్యూహం తో తన సోదరి అయిన గాంధారిని దృతరాష్ట్రునికి ఇచ్చి పరిణయం చేస్తానని ఒప్పందం కుదుర్చుకోవడంతో యుద్ధం ఆగిపోయింది. వివాహం జరిగింది. వివాహమైతే జరిగింది గానీ శకుని తంత్రం ఏమిటంటే దృతరాష్ట్రుణ్ణి తన వైపు తిప్పుకొని భీష్ముణ్ని కనుక పడగొడితే అఖండ భరత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాజు గా తను వెలుగొందవచ్చునని. కానీ ఈ విషయం వేగుల ద్వారా పసిగట్టిన దృతరాష్ట్రుడు వెంటనే సుభలుడ్ని అతని నూరుగురు పుత్రులను చెరసాల లో ఖైదు చేస్తాడు.
ఆ చెరసాల లో వారికి ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు అన్నాన్ని మాత్రమే ఇచ్చేవారు రోజుకి అప్పుడు ఆ సులభుడు అతని కుమారులందరూ కలిసి తమలో చిన్నవాడైన శకుని కి తమ ఆహారాన్ని పెట్టి వారందరూ పస్తుండి తమ ప్రాణాలను పణంగా పెట్టి శకుని మదిలో తమ ఆవేదనను నింపి అతడ్ని తయారు చేస్తారు చివరకు సౌభలుడు చనిపోతూ తన వెన్నెముక ను శకుని కి ఇచ్చి దీనితో చేసిన పాచికలను వాడడం ద్వారా నీకు విజయం తధ్యమని ఒక్క వాసుదేవ స్వరూపం అయిన శ్రీ కృష్ణ పరమాత్మ తప్ప తక్కిన వారందరూ నీ అమిత బుద్ధిబలం ముందు దిగదుడుపేని వరమిచ్చి తన ఆత్మ పాచికలు రూపంలో సదా శకుని వెంటే ఉంటుందని కూడా చెప్పిన సౌభలుడు శకుని రెండు కాళ్లు విరగగొట్టి మరీ ప్రాణం విడుస్తాడు.
తమ వంశ నాశనానికి కారణమైన కురువంశాన్ని తుదముట్టించు వరకూ ఆ పగ శకుని కి గుర్తుండటం కోసం అవిటి వాడిగా చేసి మరీ ప్రాణం వదిలినాడు సౌభలుడు. తన శత సోదరులను తండ్రి ని పోగొట్టుకున్న శకుని సమయం కోసం వేచి చూస్తున్నాడు. తన సోదరుడు అయిన శకుని ని చూచి హృదయం ద్రవించిన గాంధారి దేవి ధృతరాష్ట్రుని బ్రతిమిలాడి తన సోదరుడైన శకునిని విడుదల చేయించి గాంధార రాజ్యానికి రాజు గా నియమించేలా అవకాశం వచ్చినప్పటికీ శకుని అందుకు సమ్మతించలేదు. అక్కడితో తన పగ చల్లారితే తన సోదరులకు తండ్రి కి ఇచ్చిన మాట వ్యర్థమని భావించిన శకుని ఆ రాజ్యానికి పోకుండా దుర్యోధనుడి పంచనే ఉన్నాడు.
తన పగ చల్లారడం కోసం ధుర్యోధనుడి పక్కన ఉంటే భీష్ముడి వంశాన్ని పతనం చేయడం కోసం అహర్నిశలు శ్రమించాడు. తప్పుగా పడిన పాచిక ను కూడా అనుకూలంగా మార్చుకుని చెలరేగిపోగల వీరుడైన చెప్పాలి
తన పగ కోసం ధుర్యోధనుడిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసి లక్క ఇళ్లలో ఉన్న పాండవులను చంపే వ్యూహరచన చేసి పురోచనుణ్ణి నియమింపజేసినది శకునే. పాండవుల బాల్యం లోనే విషం కలిపిన ఆహారాన్ని పెట్టమని సలహ ఇచ్చిన వాడూ శకునే.
అపార నరమేధానికి కారణమైన కుతంత్రము అతనికి వెన్న తో పెట్టిన విద్య. అతడు సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు మూర్ఛిల్లగా అది చూసి భీముడు శకుని ముందున్న గాంధార సైన్యమును సర్వ నాశనం చేసేస్తాడు. అది చూసి కౌరవసేనలు పారిపోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు. సహదేవుడు మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండిస్తాడు.
శకుని వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపిస్తాడు. శకుని కుమారుడైన ఉలూకుడు.. సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా సహదేవుడు కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండిస్తాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు ఆ మూడు బాణములను ఖండించి శకుని విల్లు విరిచి వేస్తాడు.
శకుని మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గధను, బల్లెమును ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే ఖండించగా అది చూసి శకుని తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారిపోతాడు. సహదేవుడు అతడిని నిలువరించి "ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారిపోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది.
నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. సుయోధనుడిలా నీ తల తెగి నేలను ముద్దాడేలా చేస్తానని సహాదేవుడు శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు.

కొసమెరుపు:
మహాభారత యుద్ధం జరిగే సమయంలో శకుని తన మేనళ్లళ్లు తో సహా దేశమంతా తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడట. ఈ ప్రాంతంలోనే కౌరవులు తమ ఆయుధాలను పంచుకున్నారట. అందుకే దీన్ని పాకుథేశ్వరం అనేవారనీ తర్వాత పవిత్రేశ్వరంగా మారిందని చెబుతుంటారు.
శకుని పరమ శివభక్తుడు. మహాభారత యుద్ధం తర్వాత ఇక్కడికే వచ్చి పరమశివుడ్ని ప్రార్థించి మోక్షం పొందాడని వీరి నమ్మకం. ఆ విధంగా భగవాన్ శివుని అనుగ్రహం పొందాడు కనుక కోలన్ అనే ఆదివాసీ తెగవారు ఇతగాడ్ని భగవాన్ శకుని అనే పిలుస్తారు. ఈ ప్రాంతంలో ఏటా కొన్ని ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి. మరో విశేషమేమంటే శకుని ఆలయానికి చేరువనే దుర్యోధన ఆలయం కూడా ఉండటం.

శకుని ఆలయం:
అది కేరళలోని కొల్లాం జిల్లాలోని పవిత్రేశ్వరం. అక్కడ ఒక పురాతనమైన కట్టడం వుంది.చాలా పాత కాలం నాటి కట్టడం ఇది. ఇదే శకుని ఆలయం.

-Vaidyanathan Parameswaram

Comments

Popular Posts