ప్రపంచ కాలమే భోజన పాత్రగా కలిగినటువంటి వాడు ఆ పరమేశ్వరుడు

శ్రీకృష్ణపరమాత్మ ధర్మరాజాదులకు ఉపదేశిస్తున్న శివ సహస్రనామాలలో 683వ నామం జగత్కాల స్థాలః. ఇది నమస్కారంలో జగత్కాల స్థాలాయ నమః అని చెప్పబడుతున్నది. స్థాలః అంటే పాత్ర అని అర్థం. భోజనపాత్రను స్థాల అని అంటాం. ఇప్పటికీ మనం స్థాళీపాకం అంటూంటాం. స్థాలః అంటే భోజనపాత్ర అని అర్థం.
పరమేశ్వరునికి ఒక భోజనపాత్ర ఉందిట. ఆ భోజనపాత్ర యేమిటంటే జగత్కాలమే ఆయనకు భోజనపాత్ర అన్నారు. చాలా గొప్ప విశేషం ఇది. జగత్-కాల-స్థాలః – ఈ కూర్పే చాలా చిత్రం. కాల స్థాలః అంటే అయిపోయేది కదా! కానీ జగత్కాల స్థాలః అని ఎందుకు అన్నారు అంటే జగతిని మింగేది యేదో అది కాలము. అలాంటి కాలము ఆయనకు భోజనపాత్రగా ఉందిట. కాలమే భోజనపాత్రగా ఉన్నది. ఈకాలంలో ఉన్న భోజనం జగత్తు. జగత్తు అనే భోజనం కాలంలో ఉంటే ఆ కాలాన్ని పాత్రగా పట్టుకున్నాడట. ఇది చెప్పేటప్పుడు మనకి ఒక అపురూపమైన భావన కనపడుతోంది. శాస్త్రప్రకారం సృష్టిస్థితిలయకారకుడు పరమాత్మ. ఈ లయం చేయడమే భోజనం చేయడం. అందుకే పరమేశ్వరుని ఆ భోజన లక్షణాన్ని శాస్త్రం అనేక రకాలుగా వర్ణించింది. మహాప్రపంచాన్నంతటినీ మ్రింగివేస్తాడట ప్రళయకాలంలో. ఎలాగైతే ఒక రైతు పండించి, పెంచి, తిరిగి మింగుతాడో అలా అది ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేస్తాడు. లయం చేసేటప్పుడు ప్రపంచం ఆయనకు భోజనం అయిపోయింది. ఆ సమయంలో ప్రపంచం ఉండే పాత్ర కాలము. చాలా చక్కటి మాట చెప్పారు. ప్రపంచం అందరికీ కనపడుతుంది. కానీ కాలం మాత్రం కనపడదు. కనపడదు కానీ లేదు అని మాత్రం ఎవరూ అనలేరు. కాలం స్థూలవస్తువా? కనపడుతోందా? లేదు అని అనగలమా? ఇక్కడ మనం పరిశీలిస్తే జగత్తంగా కాలమునందే ఉన్నది. కాలంలో లోకం ఉంటే కాలం ఆయన చేతిలో ఉన్నదిట. కాలాన్ని ఆయన శాసిస్తున్నాడు. కాలం ప్రకారం భోజనం చేస్తాడు. అంతేగానీ అడ్డదిడ్డంగా ఈ సృష్టిని ఎప్పుడుపడితే అప్పుడు నశింపచేయడం కాదు. దానికొక కాలం ఉంది. కనుక ఆ కాలాన్ని ఆధారం చేసుకొని ఈ ప్రపంచాన్ని పట్టాడాయన. అది భోజనపాత్రగా కలిగినటువంటివాడు. జగతిని మ్రింగే కాలమే భోజనపాత్రగా కలిగినవాడు. ఇది జగత్కాల స్థాలాయనమః అనే విషయం చెప్తుంది.

Comments

Popular Posts