ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉన్న ఈ కలియుగంలో ఆధ్యాత్మిక ఆనందం తో తరించాలంటే ఏమి చేయాలి?

ప్రతికూల వాతావరణాల మధ్య తరించాలనుకునే వారికి ఏమిటి దిక్కు? అని మహర్షులందరూ ప్రశ్నించారు.
“మనసా శంకరం స్మృత్వా సూతః ప్రోవాచ తాన్మునీన్!” – సూతులవారు పరమేశ్వరుని ధ్యానం చేసుకొని సమాధానం చెప్పారు.
“సాధు పృష్టం సాధవో వస్త్రైలోక్యహితకారకమ్” – సత్పురుషులు అడిగే ప్రశ్నలు ముల్లోకాలకు హితం కలిగించుతాయి. లోకహితం పాటుపడేవాడు మహర్షి. తన హితంకోసం సాధన చేసేవాడు మనిషి.
“గురుం స్మృత్వా” – ముందుగా గురువైన శంకరుని ధ్యానించి ఇలా అన్నాడు. మీకు నేను చెప్తున్నాను. ఆదరంగా వినండి.
“వేదాంత సార సర్వస్వం” – సమస్త వేదాంత సారమంతా ఒకచోట పెట్టిన విషయాన్ని మీకు చెప్తాను.
“పురాణం శైవముత్తమమ్” – అది సర్వవేదాంత సారం లేదా వేదాంత సార సర్వస్వం. అటువంటి ఉత్తమ పురాణాన్ని మీకు తెలియజేస్తున్నాను. “సర్వాఘౌఘోద్ధారకరం పరత్ర పరమార్థదమ్” – ఇది సర్వపాపములనూ నాశనం చేయడమే కాకుండా పరమార్థాన్ని ప్రసాదిస్తుంది.
“కలికల్మష విధ్వంసి” – కలికల్మష నాశనం చేస్తుంది. వినడం వల్ల పాపం పోతుంది.
వినగా వినగా వినగా చేసే బుద్ధి తప్పకుండా పుడుతుంది. చేసేబుద్ధి పుడితే చెయ్యగలిగే అవకాశం పరమేశ్వరుడు ఇస్తాడు. శ్రవణం తరువాత ఆచరణకు బోధకం అవుతుంది. పైగా జ్ఞానం పూర్వం చేసుకోవడానికి యోగాలు, తపస్సులు, వేదకర్మలు ఉండేవి. కలియుగంలో అవన్నీ లుప్తమౌతున్నాయి. అటువంటి సమయంలో ఎలా జ్ఞానం మళ్ళీ వస్తుంది? పురాణమనే అద్భుత ప్రక్రియను వ్యాసదేవుడు మనకు ఆవిష్కరించాడు.
ప్రతిపురాణం ఇలాగే ప్రారంభం అవుతున్నట్లుందే అని అనిపించవచ్చు ఎవరైనా ఇతర పురాణములు పొరపాటున చదివి ఉంటే. పురాణం పుట్టిందే కలి కల్మషనాశనం కోసం. పైగా పురాణం అగమ్యమైన, మన బుద్ధిని ఎలా అన్వయించుకోవాలో తెలియని, లోతైన అర్థాలతో ఉన్న వేదములు, వేదాంతములలోని సారమును సామాన్య జనులకు అందుబాటులోనికి తీసుకువచ్చాయి. అందుకు పురాణాలు అంత గొప్ప విద్యలు అయ్యాయి.వేదములను నిగమములు అంటారు. ఇవే కాక ఆగమములు కూడా ఉన్నాయి. ఉపాసనలు, మంత్రాలు, ఆరాధనలు అన్నీ ఆగమాలలోనే విస్తరిల్లాయి. నిగమాగమములు కలిస్తేనే హిందూమతం, భారతీయ సంస్కృతి. నిగమాలలో చెప్పబడిన వేదవిషయములన్నీ ఒకవైపు ఉంటూ ఉండగా ఆగమాలలో ఉపాసనా నియమములు, మంత్ర యంత్ర శాస్త్ర విషయములు ఉన్నాయి. ఈ రెండూ మనకు ముఖ్యం. నిగమాగమ సమన్వయం పురాణాలలో కనపడుతుంది. ఇది పురాణాలకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. దానివల్ల సామాన్య జనులకు అందుబాటులో ఉంటాయి. పైగా ఒక్క పురాణం గట్టిగా చదివితే ఇంచుమించు సర్వజ్ఞులైపోవచ్చు. అలా రచించారు వ్యాసదేవులు. ఆయన ఋణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. దానికి ఉన్న జన్మలోనే క్షణం వృధా చేయకుండా రోజుకు కొంతైనా చదువుకొని జీవితంలో అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడైనా ఋషిఋణం కొంత తీర్చుకోగలమేమో. రోజూ ఉదయాన్నే లేచి వాల్మీకిని, వ్యాసునీ నమస్కరించుకోకపోతే మనకి కృతఘ్నత అనే దోషం కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఈ శివుణ్ణి, విష్ణువుని, ఈ క్షేత్రాలను పట్టుకొని తిరుగుతున్నాం అంటే వారి గ్రంథాలవల్లనే కదా! శివపురాణం కూడా ఆమహానుభావుడు అందిస్తున్నదే. దీనికి ఉన్న లక్షణములు
“సర్వాఘౌఘోద్ధారకరం” – సర్వపాపములనుంచి ఉద్ధరిస్తుంది. అంతే కాదు
“పరత్ర పరమార్థదమ్” – పరమార్థజ్ఞానం ఇస్తుంది. దానిని ప్రసాదించడమే కాకుండా
“కలికల్మష విధ్వంసీ” – కలికల్మషములు పోగొడుతుంది. కలికల్మషం పోగొట్టేటంత వస్తువు ఏముంది ఇందులో? అంటే
“శివ యశః పరమ్” – ఇందులో ఉన్నది శివుని యశస్సు. యశస్సు అంటే కీర్తి. యశస్సు అనే మాట పరమాత్మకు వాడారు.
“యస్య నామ మహద్యశః” అని యజుర్వేదంలో మంత్రం ఉన్నది. పరమాత్మకి యశస్స్వరూపుడు అన్నారు. యశస్సు అంటే ఎవరి గురించి నిరంతరం స్థిరంగా పొగుడుతూ ఉంటామో వారిది యశస్సు. వేదములు మొదలుకొని దేవతలు, ఋషులు స్థిరంగా కీర్తించేది పరమాత్మ గురించే. అలాంటి శివుని యశస్సు ఇందులో చెప్పబడుతోంది. శివుని యశస్సు చెవిలో పడితే కల్మషనాశనం. శివయశస్సునే పరమంగా చెప్తున్నటువంటి గ్రంథం ఇది.
“విజృంభతే సదా విప్రాః చతుర్వర్గ ఫలప్రదమ్” – ధర్మార్థకామమోక్షములు నాలుగింటినీ ఇస్తుంది.
“తస్యాధ్యయన మాత్రేణ పురాణస్య ద్విజోత్తమాః!” పఠనం వేరు, అధ్యయనం వేరు. అధ్యయనం – అదే పనిగా కూర్చొని మనం ఆలంబన చేసుకుంటే “సర్వోత్తమస్య శైవస్య తే యాస్యంతి సుసద్గతిమ్” – శైవగతిని పొందుతారు అన్నారు. శివప్రాప్తిని దీని అధ్యయనం వల్ల పొందుతారు సుమా!
శివపురాణం వినేవరకు మాత్రమే యమ కింకరుల భయం ఉంటుంది. అది దొరికితే వాళ్ళ భయం అక్కరలేదు. ఇతర చిన్న చిన్న శాస్త్రములన్నీ ఎంతవరకూ గర్జిస్తాయి అంటే శివపురాణం అనే సింహం గర్జించేవరకూ. సర్వ తీర్థములు సేవించిన ఫలం, సర్వ దాన ఫలం, శివపురాణ శ్రవణం వల్ల లభిస్తుంది. సర్వ సిద్ధాంత సారము శివపురాణంలో ఉన్నది.ఆ దివ్యమైన మహాత్మ్యాన్ని, ఫలాన్ని చెప్పడం నావల్ల కూడా కాదు అన్నాడు సూతపౌరాణికులు.
“ఫలం వక్తుం న శక్నోమి కార్త్ స్న్యేన మునిసత్తమాః” – దానియొక్క ఫలాన్ని నేను వర్ణించలేను.
శివపురాణంలో ఒక్క శ్లోకం గానీ, శ్లోకంలో సగం గానీ భక్తిగా చదివే వాని పాపం ఆ క్షణంలోనే నశిస్తుంది. భక్తి అనగా శ్రద్ధతో కూడినది. శ్రద్ధ అంటే ఇది సత్యము అనే విశ్వాసమే శ్రద్ధ. అలా భక్తితో ఒక్క శ్లోకంగానీ, శ్లోకార్థం గానీ చదివ్తే పాపములు నశిస్తాయి. ఈ శివపురాణాన్ని ఎల్లవేళలా, భక్తితో, అతంద్రితః – కునుకుపాటు లేకుండా చదివితే జీవన్ముక్తులౌతారు. కునుకుపాటు అంటే ఏమరుపాటు, అజాగ్రత్త. శివపురాణమును రోజూ అర్చించినా అశ్వమేధయాగ ఫలం లభిస్తుంది. ఏదైనా ఒక లౌకికమైన ఉన్నతిని కోరి శివపురాణం చదివినట్లైతే అది కూడా తప్పక లభిస్తుంది. పాపనాశనం జరుగుతుంది. పుస్తక సమీపానికి వచ్చి నమస్కరించిన వారికి దేవతలందరినీ పూజించిన ఫలం కలుగుతుంది. దీనిని రచించి యోగ్యులైన వానికి, శివభక్తులకు దానం చేస్తే సర్వ వేదాధ్యయనం చేసిన ఫలితం లభిస్తుంది. దీనిని చతుర్దశినాడు శివభక్తుల సభలలో అర్థం వివరిస్తూ చెప్పినట్లైతే చెప్పిన వారికి గాయత్రీ పునశ్చరణ ఫలం లభిస్తుంది.

Comments

Popular Posts