వీరభద్రేశ్వరాలయం , రాయచోటి.

రాయలేలిన రతనాల సీమే రాయచోటిగా నేడు వెలుగొందుతోంది. రాయల కాలంలో రాచోటి పక్కన ఉన్న మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం వెలసింది. ఈ దేవాలయం రాయల కాలం నుండి అత్యంత ప్రసిద్ది గాంచింది. పూర్వ కాలంలో సామంతరాజులు ఈ ప్రాంతానికి విచ్చేసిన సమయంలో మాండవ్య నది ఒడ్డున సేద తీరుతూ ఉండేవారని ప్రతీతి. ఆ కాలంలోనే భద్రకాళి సమేత వీరభ్రస్వామి దేవాలయాన్ని భక్తి ప్రపత్తులతో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు మాండవ్య నది ఒడ్డున వెలసిన వీరభద్రస్వామి దేవాలయం భక్తులతో కళకళలాడుతోంది. గతంలో రాచోటిగా పిలువబడే నేటి రాయచోటికి పేరు ప్రఖ్యాతలు రావడానికి వీరభద్రస్వామి దేవాలయమేనని పెద్దలు పేర్కొంటున్నారు. రాయచోటిలో వెలసిన భద్రకాళి సమేత వీరభద్రుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. వీరభద్ర ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. స్వయంగా వీరభద్రుడే విగ్రహ మూర్తిగా ఇక్కడ కొలువైనందున రాయచోటి వీరభద్ర ఆలయాన్ని దక్షణ భారత దేశ వీరభద్ర ఆలయానికి మూలవిరాట్‌గా పేర్కొంటుంటారు. చోళ సామ్రాజ్య విస్తరణలో భాగంగా యుద్దాలు చేసి ఆలసిపోయిన రాజాధిరాజ చోళుడు మానసిక ప్రశాంతత కోసం దేశ ఘటనకు బయలుదేరి ఇక్కడి మాండవ్య నది తీరానికి చేరుకున్నాడు. కొండల, గుట్టల నడుమ ప్రవహిస్తున్న మాండవ్య నది ఒడ్డున సాగైన పూల తోటలతో ఈ ప్రాంతం ఆయనకు విశేషంగా ఆకర్షించిందని, దీంతో ఆయన ఇక్కడే తన సపరివారంతో నిలిచిపోయి భద్రకాళి సమేత వీరభద్రుని కొలువు జీర్ణావస్థలో ఉన్న ఆలయాన్ని పునః నిర్మించాడని చరిత్ర చెబుతోంది. వీరభద్రునికి రాచరాయుడు అనే పేరు కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు నిర్వహణ అనంతరం మార్చి 21 నుండి 24వ తేదీల మధ్యలో ఎన్నో ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం విశేషం. ఆలయ వాస్తు నిర్మాణ చౌతుర్యానికి నిదర్శనమని చెప్పవచ్చు.


[Image1]

ఆలయ గాలిగోపురం ముందు భాగంలో 56 అడుగుల ఎత్తు గల ఏక శిలారాతి దీప స్తంభం ఉంది. ఇది ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంత పెద్ద ఏకశిల దీపాస్తంభం దక్షణ భారత దేశంలోనే మరెక్కడా లేదని చెప్పవచ్చు. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ స్తంభంపై భాగంలో దీపం వెలిగించి స్వామి వారిని ఆరాదించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ పురాతన ఆలయం వీరశైవుల పుణ్య క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. వీరికి వీరభద్రుడు ఇలవేల్పు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తాదులు విచ్చేస్తుంటారు.
వీరభద్రుడిని హిందువులే కాక ముస్లింలు కూడా కులదైవంగా ఆరాధించే సాంప్రదాయం వుంది. స్వామివారి బ్రహోత్సవాలలో కులమతాలకు అతీతంగా సర్వమతస్తులు పాల్గొంటారు. ముస్లీంలలో దేశ్‌ముఖ్‌ తెగకు చెందిన వారు ఉత్సవాలకు స్వామివారికి సాంప్రదాయ బద్దంగా పూజాసామాగ్రిని పంపితే ఆలయకమిటీ వాటిని స్వీకరించి వారి పేరుతో పూజలు నిర్వహించిన తీర్థప్రసాదాలను తిరిగి వారికి పంపడం ఆనవాయితీగా వుంది. ఈ సాంప్రదాయాలను పరమత సహసనానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. మాండవ్యనది పరీవాహక ప్రాంతంలో కొలువైన వీరభద్రాలయం భక్తుల కోర్కెలుతీర్చే వీరశైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. పది శతాబ్దాలపై బడిన చరిత్ర కలిగి ఈ వీరభద్రాలయ పేరు ప్రతిష్టలు దశదిశలు వ్యాపించాయి. ఆలయం మూడు గాలిగోపురాలతో అందమైన శిలాకళ సంపదతో విరాజిల్లుతూ చూపరులను ఆకట్టుకుంటోంది.
అర్చావిగ్రహమూర్తిగా ఆవిర్భవించిన వీరభద్రుడు
అలనాడు దక్షప్రజాపతి ఆత్మజ్ఞానహీనుడై శివద్వేశంతో తలపెట్టిన యజ్ఞానికి బ్రహ్మ, విష్ణువు తదితర దేవతలను ఆహ్వానించి నిరీశ్వర యాగం తలపెట్టారు.యజ్ఞవిషయాన్ని తెలుసుకున్న శంకరుని భార్య అయిన సతీదేవి పుట్టింటిపై మమకారంతో , తన తండ్రి చేస్తున్న తప్పును తెలియజేయడానికి పతిదేవుడు పిలువని పేరంటానికి వెళ్ళకూడదని చెప్పినా తన భర్త మాటమీరి విచ్చేసిన సతీదేవికి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక దేవతలందరి సమక్షంలో ఆత్మాహుతి గావించుకుంది. అది తెలిసిన మహోగ్రుడైన రుద్రుడు విలయతాండవం చేసి తన జటను పెరిగి నేలకు విసిరితే అందుండి ప్రళయభీకరాకర వీరభద్రుడు ఉద్భవించి రుద్రగణ సహిత ుడైన యజ్ఞశాలపై విరుచుకు పడ్డాడు. ఆ నిరీశ్వర యాగానికి విచ్చేసిన దేవతలందరినీ దండించారు. దక్షుని పట్టుకొని తన ఖడ్గంతో శిరస్సు ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు. అర్థాంతరంగా దక్షయజ్ఞం ఆగిపోయింది. వీరభద్రుడు సృష్టించిన భీభత్సానికి శివుడు సంతోషించాడు. వీరభద్రుని వీరత్వానికి మెచ్చుకొని వీరులకు వీరేశ్వరుడవై వర్థిల్లుదువుగాక అని దీవించాడు. అప్పటి నుంచి వీరభద్రుడు వీరేశ్వరుడని పిలువబడ్డాడు. పూర్ణవిరాగి అయిన శివుడు ఒక వటవృక్షమూలంలో ధ్యాన నిమగ్నుడై కూర్చుండి పోయాడు. ప్రజాపతులలో జ్యేష్టుడైన దక్షుడు ప్రాణాలు కోల్పోవడం , అర్థాంతరంగా యజ్ఞం ఆగిపోవడం లోకపద్రవాలకు దారి తీసింది. సృష్టి క్రమానికి ఆటంకం ఏర్పడింది. శివావరాధనికి గురైన దేవతలు దివ్వతేజోవిహునులై దేవలందరూ ఆలోచించి శివానుగ్రహం పొంది దక్షున్ని బ్రతికించి లోకకళ్యాణార్థం తిరిగి యాగం కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు. బ్రహ్మాదిదేవతలు విష్ణుమూర్తిని వెంట పెట్టుకొని కైలాసం వెళ్ళారు. అక్కడ దక్షణాభిముఖుడై వటవృక్ష మూలంలో చిన్ముద్ర ధరించి మౌనియై బ్రహ్మనిష్టలో ప్రకాశిస్తూ దక్షిణామూర్తియైన శివుడు దేవతలకు దర్శనమిచ్చాడు. ఏకాగ్రచిత్రులౖౖె దేవతలు భక్తితో దక్షిణామూర్తిని మనసారా ప్రార్థించారు. సర్వం గ్రహించిన గ ురుమూర్తి వారి తప్పును మున్నించాడు. దక్షుని అపరాధాన్ని బాలరాపరాధంగా భావించి క్షమించచాడు. ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన అంశీభూతుడైన వీరభద్రున్ని పిలిచి ఇలా అన్ని పుత్రా వీరభద్రా కాలదోషం పట్టి ప్రజాపతులను దేవతలకు ఆత్మజ్ఞానంతో వారు చేసిన పని వ ల్ల సతీదేవి ప్రాణత్యాగం వారి పాలిట స్త్రీహత్యాపాతకమైన చుట్టుకుంది. కారణావతారుడవైన నువ్వే వీరందరికీ జ్ఞానబిక్ష పెట్టగల సమర్థుడవు మూర్ఖుడైన దక్షునికి ప్రాణబిక్షపెడుతున్నాను. ఆయన తిరుగు ప్రయాణంలో రామేశ్వరానికి, శ్రీశైలానికి నడుమనున్న ఈ మాండవ్యనదీ తీరమందు వీరేశలింగము నిలిచి ప్రకాశించింది. అప్పటికే ఇచ్చోట మండవీమాత(యల్లమ్మ) ఆలయం నెలకొని వుండేది. వీరేశలింగం వెలయడంతో ఈ క్షేత్రం శివశక్తి పీఠమై తేజరిల్లింది. సర్వదేవతలంకు ఇచ్చట మనస్సు శాంతించింది. అంతా శివసంకల్పం అని భావించి వీరేశ్వరుడు తదేక భక్తితో పరమశివున్ని ధ్యానించాడు. తక్షణం పొడవాటి మీసములు, వాడియైన కోరలు, సహస్రభుజ, సహస్రాయుధాలతో విరాజితుడైన వీరభద్రుని ఉగ్రరూపం మటుమాయమైంది. మౌని చిన్ముద్రధారి , సర్వలోక గురుస్వరూపియైన శ్రీదక్షిణామూర్తి వీరేశ్వరనలో మూర్తీభవించాడు. సతీజగన్మాత ఆత్మ శాంతించింది. దక్షాధి అమరులకు పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రోపదేశ మయ్యింది. దక్షాధి దేవతలందరికీ తిరిగి దివ్వతేజస్సు ప్రకాశించింది. తమ జ్ఞానబిక్ష పెట్టిన ఈ పుణ్యక్షేత్రములో అమరగురు వీరేశ్వరుడునే పేరిట వెలసి నిత్యం దేవతల సేవలు అందుకోవలసినదిగా దక్షాధిదేవతలు వీరభద్రుని ప్రార్థించారు. అలనాడు దక్షాధి దేవతల ప్రార్థన మన్నించి గురుపాదపూజ నిమిత్తం ప్రతియోటా ఉత్తరాయణం మీనమాసం సూర్యోదయం ఉదయం 6 గంటలకు మీన ల గ్నమందు 5 రోజులు కేవలం అరగడియ కాలం సాత్విక దేవతలకు , మరియు దక్షీణయానం కన్యామాస కన్యాలగ్నమందు 5 రోజులు కేవలం అరఘడియకాలం ఉగ్రదేవతలకు సూర్యమండలం నుండి సూర్యరశ్మి మార్గాన గర్భాలయంలోకి ప్రవేశించి పాదార్చన చేసుకొమ్మని వీరేశ్వరుడు వరమిచ్చాడట. ఇప్పటికీ మనము ఈ విచిత్రం ప్రత్యక్షంగా చూడవచ్చును. ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర , తమిళనాడు రష్ట్రాల నుండి అశేష భక్త జనులు ఈ వీరేశ్వర క్షేత్రాన్ని నిత్యం దర్శిస్తూ వుంటారు.

Comments

Popular Posts