'సుమతీ శతకము' రచించినది ఎవరు? 'సుమతి శతకము' యొక్క విశిష్టత ఏమిటి ?


తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యలు తెలియని తెలుగువారు అరుదు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును.

శతకము అనగా వంద. శతక సాహితీ ప్రక్రియలో ఒకటే ముకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. శతకములో ప్రతి పద్యానికీ చివరలో ఒక పదము గానీ, పదాలుగానీ, పూర్తి చరణము గానీ ఉండటం ఆనవాయితీ. ఇది ఆ రచయిత సంతకం లాంటిది. దీనిని ముకుటము అంటారు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ అనునది వేమన శతకమునకు ముకుటము, అలాగే సుమతీ అనునది సుమతీ శతకమునకు ముకుటము, అలాగే వెంకటేశ్వరా, దాశరదీ అనునవి ఇతర ఉదాహరణములు. సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము అత్యధికం. సుమతీ శతకం 110 నీతి పద్యాల సమాహారం.

రచయిత:
సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. క్రీ.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు.
సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది. (పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వచ్చిన కాలంలోనిదే అవుతుంది.)
సుమతీ శతకమందు కొన్ని పద్యములు సంస్కృత శ్లోకములకాంధ్రీకరణములు. ఉదాహరణ:శ్లో: కార్యేషుదాసీ కరణేషు మంత్రీ
 రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ
 భోజ్యేషు మాతా శయనేషు రంభా
 షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ
 పని సేయునెడల దాసియు
 ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
 దనభుక్తియెడల దల్లియు
 నన దనకుల కాంత యుండ నగురా సుమతీ.
అదే విధంగా భర్తృహరి శ్లోకములకు భాషాంతీకరణములు కూడా ఉన్నాయి.

పాలను గలసిన జలమును
 బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవి జెరుచు, గావున
 తాలసుడగువానిపొందు వలదుర సుమతీ...!
పెట్టిన దినముల లోపల
 నట్టడవులకైన వచ్చు నానార్థములున్
 బెట్టని దినముల గనకపు
 గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ.
1840లో సి.పి.బ్రౌన్ సుమతీ శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.

సుమతీ శతకం విశిష్టత:
శతాబ్దాలుగా సుమతీ శతకం పద్యాలు పండితుల, పామరుల నోళ్ళలో నానుతున్నాయి. సుమతీ శతకం పద్యాలలోని పాదాలు చాలా తేలికగా గుర్తుంటాయి. అనేక సందర్భాలలో ఇందులోని పదాలను ఉదహరించడం జరుగుయి. సుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. పండితులకు మాత్రమయ్యే పరిమితమైన భాష కాదు. పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే చదవడం రానివాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా ఉదహరించగలిగారు.
సుమతి శతకమున పద్యములన్నియు అ కారాది క్రమమున ఉన్నాయి. ఈ విధానానికి సుమతి శతక కర్థ బద్దెన యే ప్రారంబకుడు. ఇతనిననుసరించి ఆ తర్వాతి కాలములలో భాస్కర శతకము, వేణుగోపాల శతక కర్థలు కూడా సుమతి శతకాన్ని అనుసరించారు.
పూర్తి పద్యం రానివారు కూడా ఒకటి రెండు పాదాలను ఉట్టంకించడం తరచు జరుగుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలుఅక్కరకు రాని చుట్టము
అప్పిచ్చువాడు వైద్యుడు
ఇత్తడి బంగారమగునె
తను వలచినదియె రంభ
ఖలునకు నిలువెల్లవిషము
బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ
కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి
ఎప్పుడు సంపదలు గలిగిన నప్పుడు బంధువులు వత్తురు
తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకూ, పంతుళ్ళు తమ శిష్యులకూ సుమతీ శతకంలోని నీతులను ఉపదేశిస్తున్నారు. 700 సంవత్సరాల తరువాత కూడా ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, కొద్ది పదాలలో చెప్పిన విధానం అత్యద్భుతం. మొదటి పద్యంలోనే కవి "ధారాళమైన నీతులు నోరూరగ జవులుపుట్ట, ఔరా యనగా, నుడివెద"నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు.

Source:Wikipedia

Comments

Popular Posts