సోమనాథ్

 
ద్వాదశజ్యోతిర్లింగములలో సోమనాథ్ ఒకటి. దక్ష ప్రజాపతి అశ్వనీ మొదలుగా గల తన 27గురు కన్యల వివాహమును చంద్రునితో జరిపించెను. పత్నులందరిలో కూడ రోహిణి చంద్రునకు మిగుల ప్రియమైనది. మిగిలిన వారందరును అంతటి ప్రేమను పొందలేకపోయిరి. దీనివలన ఇతర స్త్రీలకు మిగుల దుఃఖము కలిగెను. వారందరు తమ తండ్రి శరణుజొచ్చిరి. ఆయనకు తమ దుఃఖమును నివేదించిరి. అదంతయు విని దక్షుడు కూడ దుఃఖభాజనుడయ్యెను. చంద్రుని దగ్గరకు వెళ్ళి భార్యలందరినీ సమానంగా ఏలుకోమని హితవొసగుతాడు. అయినా చంద్రుడు దక్ష వాక్యాన్ని తృణీకరించి రోహణియందు ఆసక్తి కలవాడవటం వల్ల దక్షుడు చంద్రుని క్షయరోగ పీడితుడై క్షీణింపగలడని శపిస్తాడు. దానితో అన్ని దిశలయందు గొప్ప హాహాకారములు వ్యాపించెను.ఓషధులు ఫలించలేదు. యజ్ఞయాగాదులు నెరవేరనందున దేవతలకు ఆహుతులు లేకుండా పోయాయి. అమరులక్ అమృతం కొరవడింది. వర్షములు కురియక పంటలు నశించి దుర్భిక్షంతో ప్రజలు అకాల మరణం చెందారు. చంద్రకాంతి హీనత వల్ల నష్టపోయిన వశిష్ఠాది మహర్షులు, ఇంద్రాది దేవతలు బ్రహ్మను ప్రార్థించగా ఆయన ఒక ఉపాయము చెప్పాడు.

చంద్రుడు దేవతలతో కూడి ప్రభాసతీర్థమునకు వెళ్ళి అచట మృత్యుంజయ మంత్రము విధిపూర్వకముగ అనుష్ఠానము చేయుచు భగవంతుడగు శివుని ఆరాధించవలెను. తన ఎదుట శివలింగమును స్థాపించుకొని చంద్ర్రుడు నిత్యము తపమాచరించవలెను. అందులకు సంతసించి శివుడు అతనిని క్షయరహితుని చేయును. ఈ విషయమును దేవతలు చంద్రునకు తెలుపగా బ్రహ్మ ఆజ్ఞానుసారము చంద్రుడు అచటకు వెళ్ళి ఆరునెలలు నిరంతరము తపస్సు చేసెను. ఆయన తపస్సు చూసి శంకరుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై చంద్రునికి శాపవిమోచనం గావించి ఒక పక్షము కాలము ప్రతిదినము కళ క్షీణించుచుండునని, రెండవ పక్షమున అది మరల నిరంతరము వృద్ధియగునట్లుగా వరమునిచ్చెను. చంద్రుడు భక్తిభావముతో శంకరుని స్తుతించెను. శంకరుడు ప్రసన్నుడై ఆ క్షేత్రమహాత్మ్యమును పెంపొందించుటకు, చంద్రుని యశస్సును విస్తరింపచేయుటకును భగవంతుడగు శంకరుడు అతని పేరుతో సోమేశ్వరుడని పిలువబడెను.
Source
సోమనాథుని పూజించుటవల్ల ఉపాసకులకు క్షయ, కుష్ఠు మొదలగు రోగములు నశించును. ఈ క్షేత్రమున సకల దేవతలు సోమకుండమును స్థాపించిరి. చంద్రకుండము పాపనాశన తీర్థముగ ప్రసిద్ధి చెందెను. ఈ తీర్థమున స్నానమొనరించిన మానవులు సకలపాపములనుండి విముక్తులగుదురు. క్షయ మొదలగు అసాధ్యమైన రోగములతో బాధపడువారు ఈ కుండమున ఆరునెలలు స్నానమాచరించిన రోగములు నశించును. ఈ ఉత్తమ తీర్థమ్ను సేవించువారి కోరికలు సఫలమగును. ఇందులో సంశయములేదు.
చంద్రుడు స్వస్థుడై తన మునుపటి కార్యములను నిర్వహించసాగెను. ఈ గాథను విన్నవాడు, ఇతరులకు వినిపించువాడు తన సంపూర్ణమైన కోరికలను సఫలము చేసుకొనును. సకల పాపములనుండి ముక్తుడగును. సోమనాథుని దర్శించుటకు కఠియవాడ ప్రదేశమున గల ప్రభాస క్షేత్రమునకు వెళ్ళవలెను. ఈ దేవాలయం ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని వీరావల్ మునిసిపల్ పరిధిలోని ప్రభాస పట్టణ ప్రాంతంలో వున్నది.

Comments

Popular Posts