అష్టాదశ శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి? శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?


శక్తి పీఠములకు సంభందించి ఒక పురాణ గాధ ప్రాచుర్యంలో ఉన్నది.
శివుని మీద ఆక్రోశంతో నిరీశ్వర యాగం తలపెట్టిన దక్షుని ఇంటికి పుట్టింట జరిగే శుభకార్యానికి ఆహ్వానం అవసరం లేదని ప్రమద గణాలతో వెళ్ళిన సతిని దక్షుడు శివ నిందచేసి అవమాన పరుస్తాడు.అవమానాన్ని భరించలేని సతి దేవి యోగాగ్నిని సృష్టించి అందులో దూకి తనువుని వదిలిపెట్టింది. కోపోద్రిక్తుడైన రుద్రుడు నిరీశ్వర యాగాన్ని వీరభద్ర రూపంలో ధ్వంసం చేస్తాడు.కాని సతీ వియోగ దుఖం తీరని రుద్రుడు ఆమె శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండటం వలన సృష్టి ప్రక్రియ అంతరాయానికి గురి అవ్వటం గమనించిన దేవతలు మహా విష్ణువును వేడుకున్నారు.అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ముక్కలు చేసి భూమి మీద పడేలా చేసి రుద్రుడిని కార్యోన్ముక్తుడిని చేశాడు.అలా భూమి మీద పడిన సతీ దేవి అవయవ భాగాలే ఈనాటి శక్తి పీఠాలు.

శక్తిపీఠాలు తంత్రికులకు సాధనా స్థలాలు:
సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది. ముఖ్యంగా ఇవి అష్ఠాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి.

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే.ప్రార్ధనా శ్లోకం:
లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్.


అష్టాదశ శక్తి పీఠాల వివరాలు.:
(1.)శాంకరి;-*ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును-శ్రీ లంక (ఈ ఆలయ ఆనవాలులు పోర్చగీసుల దాడి కారణంగా కనిపించుటలేదు.)
(2.)కామాక్షి- కాంచీపురం, తమిళనాడు.
(3.)శృంఖల- ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్.
(4.)చాముండి- క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక .
(5.)జోగులాంబ- ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు .
(6.)భ్రమరాంబిక- శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ .
(7.)మహాలక్ష్మి- కొల్హాపూర్, మహారాష్ట్ర .
(8.)ఏకవీరిక- మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర .
(9.)మహాకాళి- ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ .
(10.)పురుహూతిక- పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ .
(11.)గిరిజ- ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా.
(12.)మాణిక్యాంబ-  దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ .
(13.)కామరూప-  హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో.
(14.)మాధవేశ్వరి- ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో.
(15.)వైష్ణవి:  జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
(16.)మంగళ గౌరి- గయ, బీహారు.
(17.)విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్..
(18.)సరస్వతి-  జమ్ము, కాష్మీరు.
అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉన్నది.
ఇవే కాక ఇంకా 51 శక్తిపీఠాలు "శాక్తేయం"ను భారత దేశంలో నిలబడేలా చేస్తున్నాయి.

Comments

Popular Posts