నారదుని వీణ

అహో దేవర్షిర్ధన్యోఽయం యత్కీర్తిం శార్‌ఙ్గధన్వనః ।
గాయన్మాద్యన్నిదం తన్త్ర్యా రమయత్యాతురం జగత్ ॥
తాత్పర్యం: దేవర్షి నారదుడు బహుధన్యుడు. ఏలయన్న అతడు వీణ మ్రోగించుచు, హరిగుణగానము చేయుచు, పారవశ్యము నందుచు ఈ యాతురమైన జగత్తునంతయు ఆనందింపజేయుచున్నాడు.


సుఖదుఃఖములు, కలిమిలేములు ఎప్పుడు ఏవి ప్రాప్తించినా కలతనొందక అనుభవించాలన్నది సూక్తి. కలతవీడాలన్న సంకల్ప బలము మాత్రం భగవన్నాక స్మరణలోనే ఉందని నారదుని వీణచెప్తోంది. సర్వదా తన వీణను శ్రుతి చేసుకున్న నారదుడు. నారాయణ స్మరణతో చెవులకు విందుచేస్తూ ఉంటాడు. ముకుంద గీతములు పాడి పరవశించి పరవశింపచేయగలడు నారదుడు. మహతి అనే వీణని సాధించడానికి ‘బలీయసి కేవల మీశ్వరేచ్ఛా’ అని ఈశ్వర సంకల్పముముందు బలహీనుడయ్యాడు. జగన్మాయాతీతుని అనుగ్రహము పొందాడు.
సుఖదుఃఖాలు రమ్మంటే రావు. వద్దంటే పోవు. దైవాధీనము జీవిత సాఫల్యము అనేది నిత్య సత్యము. ఈసత్య నిరూపణ ఉద్దేశంతో శ్రీకృష్ణుడు తన రథంలో కూర్చోబెట్టుకున్న నారదుడితో విహారయాత్రకు బయలుదేరాడు. రథము ఒక అందమైన వనము చేరుకుంది. ఆ వనంలో ఒక అందమైన సరస్సు వద్ద రథము ఆపాడు.
రథము దిగిన నారదునికి సరస్సు చూడగానే దాహం వేసింది. ఆత్రుతగా కొలను చేరుకుని నీటిని దోసిళ్ళలోనికి తీసుకున్నాడు. స్నానం చేయకుండా నీటిని త్రాగడం ప్రమాదకరమని కృష్ణుడు వారిస్తున్నా వినలేదు. దాహార్తి తీర్చుకున్నాడు. అంతే తానెవరైనదీ మరచిపోయాడు. అంతేకాదు స్ర్తి రూపము సిద్ధించింది. పురుషత్వము పోయి యవ్వన వికారములు గల సోయగముతో యువతిగా వనమంతా తిరిగాడు. ఒక ఋషి ఆశ్రమం చేరుకున్నాడు. శ్రీకృష్ణమాయా ప్రభావంవలన ఋషి కోరికను మన్నించి ఋషిపత్నిగా స్థిరపడ్డాడు. అరవైమంది సంతానం కలిగారు.
కృష్ణమాయ అంతటితో ఆగలేదు. ఋషిభర్త కన్న అరవైమంది సంతానం కళ్ళముందు విగతజీవులై పడిపోయారు. స్ర్తి నారదుడు ఖిన్నుడయ్యాడు. దుఃఖ భారంతో కుమిలిపోయి అమిత నీరసానికి లోనయ్యాడు. విపరీతమైన ఆకలి వేయసాగింది. ఎదురుగా ఒక మామిడిచెట్టు కనిపించింది. దానికి ఒక పండు ఉంది. కోసుకు తిందామంటే అందలేదు. శవాల్ని ఒక్క క్షణం బాధగా చూశాడు. ఋషి భర్తతో కలిపి అరవైమంది సంతానాన్ని శవాల్ని గుట్టగా ఒకనిపై ఒకటి పేర్చాడు. ఆ శవాల గుట్టనెక్కి పండును కోసి స్ర్తి అయన నారదుడు దిగాడు.
పండు తినబోతున్న స్ర్తి రూప నారదునికి ఎదురుగా ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శవాల గుట్టని చూసి విషయమర్థం చేసుకున్నాడు. ‘నువ్విప్పుడు అశౌచములో ఉన్నావు. అంత్యక్రియలమాట దేవుడెరుగు. కనీసం స్నానం చేసి పండు తిను. మృతులకు కృతజ్ఞత అవుతుంది’ అన్నాడు.
నారదుడు అక్కడే వున్న కొలనులోకి దిగాడు. మామిడి పండు ఉన్న చేతిని మాత్రం పైకెత్తి పట్టుకుని మొత్తము శరీరంతో నీట మునకవేసి పైకి లేచాడు. నారదునికి యథారూపం వచ్చింది. పురుషుడిగా మారినప్పటికీ మామిడిపండు ఉన్న హస్తం ఆడుదాని చేతిలాగే ఉంది.దీనితో నారదుడు దిగాలు పడ్డాడు. అప్పుడక్కడ శ్రీకృష్ణుడు, తనను నీటిలో దిగమన్న బ్రాహ్మణుడు ఎదురుగా కనిపించగానే బావురుమన్నాడు. కృష్ణుడు నవ్వి ఈసారి నీటిలో మొత్తం శరీరంగా తలమునక వేయమన్నాడు. నారదుడు పండుతో సహా కొలను నీటిలో మునిగి పైకి తేలాడు. యథారూపంతో పైకి వచ్చిన నారదుడు తన చేతిలోని ‘వీణగా’ మామిడిపండు మారిపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు. నారదునితో సంసారము చేసిన ఋషి, అశౌచము తొలగడానికి స్నానము చేయమని చెప్పిన బ్రాహ్మణుడు ఎవరో కాదు కాలపురుషుడు. శ్రీకృష్ణుని జగన్మాయలో కాలపురుష, నారద సంతానము అరవై మంది ప్రభవ మొదలుకొని అక్షయ వరకు గల సంవత్సరాల పేర్లతో కాలచక్రభ్రమణములో కనిపిస్తున్నారు. నారదుడు రుచి చూడాలనుకున్న మామిడి పండు మహతి పేరుతో వీణగా మారింది. సతత నారాయణ స్మరణ తృప్తిగా మహతిపై మహత్తర గానము చేస్తున్నాడు నారదుడు. మాయ చేస్తూనే మాయాతీతుడు హరినామ సంకీర్తనకు వెంట ఉంటాడని నారాయణ మహత్త్వాన్ని సంసార ప్రియులకు ‘మహతి’ చాటి చెప్పింది

Comments

Popular Posts