కార్తీక మాసం - కార్తీక దీపం


కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. భక్తజనమంతా మహాశివుడి అనుగ్రహం కోసం పూజల్లో మునిగితేలుతుంటారు. తెల్లవారు జామునే తలారా స్నానం చేసి తదితర కార్యక్రమాలు ముగించి.. శివాలయాలకు తరలివెళ్లి…శివ కరుణకోసం నిష్టగా పూజలు చేస్తారు.

ప్రస్తుతం ఏ శివాలయం చూసినా భక్తజనంతో కళకళలాడుతోంది. దీపాల వెలుగుతో శోభిల్లుతోంది. పరమేశ్వరాన్రుగహం పొందడానికి దక్షిణాయన పుణ్యకాలం ఎంతో మంచిది. ఇది ఉపాసనా కాలం. పరమేశ్వరుని ఆరాధనకు యోగ్యమైన కాలం. ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి, శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రతం, ఇలా ప్రఖ్యాత తిథులన్నీ దక్షిణాయనంలోనే ఉన్నాయి. దక్షిణాయనంలో కార్తీకమాసం చాలా విశేషమైంది.
కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం అవుతున్నందునదీనికి కార్తీకమాసమని పేరొచ్చింది. కార్తీకంలోఎటు చూసినా దీపమే కనబడుతుంది. కార్తీకమాసంలో శివాలయంలో, విష్ణాలయంలో, అంబికాలయంలో, మఠప్రాంగణంలో ఇలా నాలుగు చోట్లా దీపాన్ని పెడతారు. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు ఉంది.

పూజలో ఒక ప్రారంభంగా దీపం వెలిగిస్తాం. దీనికి ఒక పరమార్థముంది. పరమేశ్వరుడు అయిదు జ్ఞానేంద్రియాలనిచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. సమస్త సుఖాలు ఈ అయిదింటిపైనే ఆధారపడ్డాయి. బ్రహ్మాండంలో ఉన్న ఏ భోగస్థానమూ సుఖస్థానం కాదు. కార్తీక మాసంలో సూర్యుడు భూమండలానికి దూరంగా వెళతాడు.
రాత్రులు బాగా ఎక్కువవుతాయి. పగళ్ళు తక్కువవుతాయి. అందుకే దక్షిణాయనం ఉపాసకులకు ఇష్టమైన కాలం. అందుకే కార్తీక మాసంలో పూజలు భక్తి శ్రద్ధలతో..సాగుతాయి. దీపాలు వెలిగించి..పుణ్యఫలం కావాలని పరమేశ్వరుడిని వేడుకుంటారు. కార్తీక సోమవారం మరీ ప్రాశస్థమైనది. అందుకే ఆరోజుల్లో ఆలయాలు కిక్కిరిసిపోతాయి. అంతా భక్తి కార్తీకం.

Comments

Popular Posts