“........ఇక మనం వెళ్ళవచ్చు”

పరమాచార్య స్వామివారు కాంచీపురం దగ్గర్లోని తేనంబాక్కంలో మకాం చేస్తున్నారు. ఒకరోజు రాత్రి స్వామి వారు దర్భాసనాన్ని చాపలాగా పరచుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వారితో పాటు కొంత మంది ఉన్నారు. అప్పుడు వారికి టపాసులు పేల్చిన శబ్ధం వినపడింది.
మహాస్వామి వారు ఏమి తెలియనట్టు “ఎందుకు ఇప్పుడు టపాసులు పేలుస్తున్నారు?” అని అడిగారు. “రథంలో కామాక్షి అమ్మవారు ఊరేగింపుగా వస్తున్నారు. అందుకే టపాసులు పేలుస్తున్నారు” అని చెప్పారు.
వెంటనే స్వామి వారు ”అమ్మవారు రథంలో ఊరేగింపుగా వస్తున్నారా? మరి మనం వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఎలా?” అని లేచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు.
అక్కడున్నవారు, “ఇప్పుడు సమయం పది గంటలు అయ్యింది. స్వామివారి ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఇక్కడి నుండి పెద్దకంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఇప్పటికి అమ్మవారు కచ్ఛపేశ్వర దేవస్తానం దగ్గరకు వచ్చి ఉంటుంది. అక్కడే పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వేడుక చేసుకుంటారు. అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది” అని చెప్పారు.
మహాస్వామి వారు వాళ్ళు చెప్తున్నదేమి పట్టించుకోలేదు. అక్కడి నుండి వెళ్ళే ముందు తేనంబాక్కంలో శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. ఒకచేతిని కళ్ళకు అడ్డంగా పెట్టుకుని ఏదో రహస్యంగా చెప్పారు. అక్కడినుండి బయలుదేరారు.
పరమాచార్య స్వామి వారు మౌనంగా నడుస్తున్నారు. ఒకరు అన్నారు “అది మనకు మంచి నడక వ్యాయామం” అని. ఇంకొకరు నవ్వుతూ, “మనం మూసిన దేవాలయాన్ని దర్శించుకునే తిరిగి వస్తాము” అని అన్నారు.
పెద్ద కాంచీపురం చేరుకోగానే, స్వామి వారితో వచ్చినవారికి ఆశ్చర్యం కలిగింది. కామాక్షి అమ్మవారి రథం కొన్ని గంటలుగా కచ్ఛపేశ్వర దేవాలాయం దగ్గర ఆగిపోయింది.
అక్కడున్న వారు మహాస్వామి వారిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామివారికి సాష్టాంగం చేసి ఇలా చెప్పారు. “ఎందుకో తెలియదు. ఇక్కడిదాకా ప్రశాంతంగా వచ్చిన ఏనుగు ఇక్కడీ నుండి కదలడానికి మొండికేస్తోంది. అమ్మవారి రథాన్ని లాగబోతే పెద్దగా అరుస్తోంది. రథాన్ని వదిలేస్తే అది కూడా ఊరకే ఉంటోంది.”
అమ్మవారి దర్శనం చేసుకుని మహాస్వామి వారు ఏనుగు దగ్గరికి వచ్చారు. దాని శరీరంపై ఒక చేయ్యివేసి, ఏనుగుతో “మనం వెళ్ళవచ్చు” అని అన్నారు. అంతే ఒక్కసారిగా తన పెద్ద చెవులని అల్లార్చుతూ కదిలింది. దీన్ని చూసినవారందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
మహాస్వామి వారు శివస్థానంలో ఉన్న చిన్న వినాకుడి దగ్గర రహస్యంగా ఏమి చెప్పారో ఇప్పుడు అర్థమైంది వారందరికి.

Source

Comments

Popular Posts