కాళీమాత మొల చుట్టూ మానవఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది.ఎందుకు ?


కాళీమాత మొల చుట్టూ మానవఖండిత కరములు చుట్టుకొని ఉంటుంది. మన దేవీదేవతల చిత్రాలు అన్నీ గూడార్ధసంకేతాలు.ఆచిత్రాల వెనుక రహస్యమైన అర్థాలు దాగి ఉంటాయి..
Image result for kalika mata statue
 
  • మనుషులు పని చేసేది చేతులతోనే.చెయ్యి లేనపుడు మానవుడు ఏపనీ చెయ్యలేడు.అనగా క్రియాశక్తికి సంకేతం మానవుని చెయ్యి. ప్రపంచంలోని అందరు మానవుల చేతుల ద్వారా పని చేయిస్తూ తాను మాత్రం కనపడకుండా దాగిఉన్న శక్తి కాళిమాత.
  • ఇంకొక గూడార్థం.మానవుడు పూర్తిగా క్రియాకలాపాలు మాని, అనగా తన స్వంత ప్రయత్నాలు మానేయడమే తెగిపోయిన చేతికి సూచన.అంటే రమణమహర్షివలె పూర్తిగా భగవంతుని పైన ఆధారపడి,కర్మను పూర్తిగా విసర్జించినవాడే జగన్మాత ఒడిలోకి చేరుకోగలడు.వేదం కూడా ఇదే చెబుతున్నది. నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకేనమృతత్వ మానశు-- మనిషి కర్మవల్ల కాదు, సంతానంవల్ల కాదు, ధనంవల్ల కాదు-- ఒక్క త్యాగంవల్ల మాత్రమె అమృతత్వాన్ని పొందగలడు.ఈవిధంగా,తెగిన చేతులు కర్మత్యాగాన్ని సూచిస్తున్నాయి.కర్మత్యాగియే మాత ఒడికి చేరుకోగలడు.ఇట్టి కర్మత్యాగం అందరికీ సాధ్యం కాదు అని అంటారా? సాధ్యంకాదు కనుకనే కాళీమాత దర్శనం కూడా అందరికీ సాధ్యం కాదు.
  • మాత మెడలో పుర్రెలదండ ఉంటుంది. దీని అర్థం తెలుసుకుందాం. ఈ పుర్రెలు తంత్రశాస్త్రం ప్రకారం ఏభై ఉండాలి. తంత్రవిజ్ఞానం ప్రకారం ఇవి సంసృతంలోని ఏభై అక్షరాలు. ఈ పుర్రెలదండను వర్ణమాల అంటారు. 16 అచ్చులు 34 హల్లులు కలిపి మొత్తం 50 అక్షరములే ఈ పుర్రెలు.అక్షరములు అనే మాటలో అద్భుత అర్థం ఉంది. క్షరము లేనివి అనగా నాశనము లేనివి అక్షరములు.మనుషులు పోవచ్చు. ప్రపంచం నాశనం కావచ్చు.కాని శబ్దం మిగిలే ఉంటుంది.అక్షరములు శబ్ద రూపములు.కనుక వాటికి నాశనం లేదు.ఈ సందర్భంలో వాగర్థా వివ సంపృక్తౌ శ్లోకం గుర్తుకు వస్తున్నది. వాక్కు దాని అర్థమువలె పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు అంటాడు కాళిదాసు.అనగా శబ్దం దాని అర్థంవలె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నారని అర్థం.
  • పుర్రెలు శాశ్వతత్వానికి సూచన.ఎందుకని?మనిషి పోయినా పుర్రెలు లక్షల సంవత్సరాలు అలాగే ఉంటాయి.మనిషి శరీరంలో పుర్రె ముఖ్య భాగం. ఆలోచనను ఇచ్చే మెదడు అందులోనే ఉంది. అలాగే శబ్దాలు పుర్రెలవలె శాశ్వతమైనవి, స్వచ్చమైనవి. మనుషుల తలరాతలన్నీ వాటిలో ఉన్నాయి.కనుక మాత వాటిని మెడలో ధరిస్తుంది.ఆమె అకారాది క్షకారాంతమయి.వర్ణమాల అనే తంత్రగ్రంధాన్ని చదివి ప్రేరితుడై Sir John Woodroffe(Arthur Avalon) ఒక అద్భుత గ్రంథం వ్రాసాడు. దాని పేరు The Garland of Letters. అందులో ఈ వివరాలన్నింటినీ తంత్ర శాస్త్రం నుంచి సేకరించి వ్రాశాడు.
  • ఈ పుర్రెలదండలో ఇంకొక అద్భుత అర్థం దాగి ఉంది.ఈ ఏభై అక్షరాలు షట్ చక్రాలలోని ఏభైదళాలలో ఉంటాయి.కుండలినీ సాధన చేసేవారికి ఇవి సుపరిచితాలు.మూలాధార పద్మం=4 దళములు. స్వాదిష్టాన పద్మం=6 దళములు. మణిపూరక పద్మం= 10 దళములు, అనాహత పద్మం=12 దళములు, విశుద్ధ పద్మం= 16 దళములు చివరిదైన ఆజ్ఞాపద్మం=2 దళములు అన్నీ కలిపి 50 దళములలో ఈ ఏభై అక్షరాలు వైబ్రేషన్లుగా ఉంటాయి.సమస్త మంత్రాలు ఈ ఏభై అక్షరాల వివిధ సమాహారములే.కనుక మాత సర్వ మంత్రాత్మిక. సర్వ మంత్రమయి. సర్వ మంత్ర స్వరూపిణి.
  • ఈ అక్షరబీజముల మంత్రజపంతో కుండలినీ సాధన చెయ్యటాన్ని రహొయాగం అంటారు.ఇది శ్రీ విద్యోపాసనలో అంతర్యాగ విధానం. అంటే బాహ్యంగా చేసే యాగంవంటిదే లోపల్లోపల చేసే అంతర్యాగ క్రమం.దీనిని చేసేవారిని గుప్తయోగులు/యోగినులు అంటారు.అంటే వీరు సాధనచేసే విధానం బయటకు కనిపించదు.దీనిని వివరిస్తూ లలితాసహస్రనామం"రహో యాగ క్రమారాద్యా రహస్తర్పణ తర్పితా" రహోయాగక్రమంలో ఆరాధించబడేదానవు,రహస్సు అనబడే తర్పణముతో తడిసిన దానవు అయిన నీకు ప్రణామము- అంటూ మాతను ప్రార్ధిస్తుంది. గురువుల వద్ద ఇటువంటి రహస్యాలు అనేకం నేర్చుకునే అదృష్టం మాత.
  • మనిషికి ఏదైనా పని చేయాలంటే మనస్సులో భయం మరియు సంశయం ఎక్కువ,ఆ భయాన్ని పోగొట్టి మనిషిని సన్మార్గంలో నడిపే మాత శ్రీ కాళీ మాత.
  • కాళీ అంటే నలుపు అని అర్థం. ఆమె ఆవాసం శ్మశానం. కాళీ అంటే మరణం, కాలం అని కూడా అర్థం. దశమహావిద్యలలో ఈమె ప్రధాన దేవత. నిర్యాణ తంత్రంలో త్రిమూర్తులను కాళీ మాతయే సృష్టించిందని చెప్పబడివుండి. బాహ్యంగా ఈమె భయంకరంగా కనిపించినా ఈమె కారుణ్యమూర్తి. ఎందరో మహా సాధువులు,సన్యాసులు కాళీ మాతను సేవించి కైవల్య ప్రాప్తినొందారు. వారిలో శ్రీ రామకృష్ణ పరమహంస ప్రముఖులు.
  • ఒకనాడు భూమిపైన పాపసంచయం బాగా పెరిగిపోయింది. భగవన్నామస్మరణ, యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయాయి, ప్రజలు అరిషడ్వర్గాలకులోనై స్వేచ్ఛగా సంచరించసాగారు. భూమిపైన ధర్మమే లేకుండాపోయింది. దీంతో ఆగ్రహించిన కాళీ మాత ఉగ్రంగా నాట్యం చేయనారభించింది. దీంతో లోకాలన్ని కంపించసాగాయి. సృష్టి రక్షణకై పరమేశ్వరుడైన మహాశివుడు కాళీ మాతను తనపై నాట్యం చేయమని కోరాడు. అలా మహాదేవుణ్ణి చూసి మాత శాంతించింది. అందుకే సాధారణంగా కాళీ మాత మహాదేవుడిపై తన పాదాలను ఉంచినట్టు కనిపిస్తూంటుంది. మనమూ ఆ కారుణ్యమూర్తిని స్మరిద్దాం...
కొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల యొక్క వర్ణన ఉన్నది. ఇవే ఆ కాళీ మాత యొక్క ఎనమిది రూపాలు..
1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8. మహాకాళిక.
కాళీ మాత సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరించింది. అందుకే కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి.
 
-శ్రీనివాస్ -సూరి

Comments

Popular Posts