భగవన్నామ సంకీర్తన మహత్యము


వైకుంఠనాథుడైన ఆ శ్రీమన్నారాయణుని నామాన్ని వారి పిల్లలకో లేక ఇంకెవరికో పెట్టిన పేరుగా పలికినా, లేక ఎవరినైనా వెక్కిరించడానికి పలికినా, ఏదో ఊత పదంగా పలికినా, అది వారి యొక్క సమస్త పాపాలను నసింపచేస్తుందట. ఇంతటి మహత్తరమైన ఆ నారాయణ నామాన్ని స్మరింపక, కీర్తింపక ఎంత నష్టపోతున్నాము. పరమాత్మకి గానమంటే ప్రాణమట. ఆ శ్రీహరి నామం ఎలా తలచినా ఇంత ఫలితమిస్తుందంటే………ఆయనకు ప్రాణమైన గానాన్నే మనం చేస్తే ఇంకెంత ఫలితమో తెలుసుకోవాలి. అది కోరికలు తీర్చటం కాదు…. స్వయంగా పరమాత్మనే ఇక్కడకు రప్పిస్తుందట. ఆ మాట ఆ పరమాత్మే స్వయంగా నారదునితో చెప్పాడంట.
నాహం నాసామి వైకుంఠె యోగినాం హృదయేనచ l
మద్భక్తా యత్రగాయన్నిత తత్ర తిష్టామి నారదా ll
నారదా ! నేను ఎక్కడ ఉంటానో తెలుసునా ? అంతా నేను వైకుంఠములో ఉంటాననుకుంటున్నారు… కానీ నేను వైకుంఠములో లేను, ఉండను…. కొంతమంది నేను తపశ్శక్తి సంపన్నులైన యోగుల హృదయాలలో కనబడుతుంటానని అనుకుంటుంటారు. అక్కడా నేను కనబడను. ఎక్కడైతే నా నామస్మరణ చేస్తూ, నా భక్తులు గానం చేస్తుంటారో, నేను అక్కడే ఉంటాను…అని చెప్పారంట. అందుకేనేమో నారద మహర్షుల వారు ఆ నారాయణ నామస్మరణ గానాన్ని వీడకుండా గానం చేస్తుంటాడు. ఈ హరినామ గానం చేస్తే ఆయన ప్రసన్నుడై, ముక్తిని ప్రసాదిస్తాడంట.
హరేర్నామ హరేర్నామ హరేర్నామ కేవలం l
కలే నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యధా ll
ఈ కలియుగంలో సులభంగా మోక్షాన్ని పొందాలి అంటే ఈ హరినామ సంకీర్తన కంటే సులభమైన మరోమార్గం లేనేలేదంట.
ఈరోజునుంచే భగవన్నామ సంకీర్తనం ప్రారంభించండి. ఒకవేళ మనం రేపే ప్రయాణమవ్వవలసి వస్తుందేమో. అప్పుడు మోక్షాన్ని పొందలేక…. మళ్ళీ జన్మమెత్తవలసి వస్తుంది.

Comments

Popular Posts