ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి చెప్పిన విషయాలు

ఆత్మజ్ఞానాన్ని పొందటం ఎలాగో యముడు నచికేతునికి వివరిస్తూ ...మనస్సును ఎలా నడిపించాలో వివరిస్తున్నాడు….నీ శరీరమే రథం. ఆత్మ రథికుడు. బుద్ధి సారథి. మనస్సు ఆ సారథి చేతిలో ఉండే కళ్లెం. ఆ రథానికి గుర్రాలు ఇంద్రియాలు. విషయాలు, కోరికలే దారులు. శరీరం, ఇంద్రియాలు, మనస్సుతో కూడిన ఆత్మనే జ్ఞానులు ‘భోక్త’ అని పిలుస్తున్నారు. అంటే ఆత్మ ఉనికికి ఈ మూడూ కారణమన్నమాట. అదుపులోలేని మనస్సుతో ఆత్మజ్ఞానం లేకుండా తిరిగేవాడి ఇంద్రియాలు సారథి అధీనంలో లేని అశ్వాల్లాగా విచ్చలవిడిగా యథేచ్ఛగా పరుగెత్తుతాయి. ఎవడు విజ్ఞానవంతుడై మనస్సును స్వాధీన పరచుకుంటాడో అతడి ఇంద్రియాలు సారథి అదుపులో ఉన్న గుర్రాల్లాగా సరైన దారిలో ప్రయాణిస్తాయి.

మనస్సును అదుపులో పెట్టుకోకుండా, విజ్ఞానం లేకుండా శారీరకంగా మానసికంగా అశుభ్రంగా ఉండేవాడు సంసారాన్ని దాటలేడు. పరమపదాన్ని పొందలేడు. చావుపుట్టుకల మధ్య తిరుగుతూ ఉంటాడు. ఎవడు విజ్ఞానవంతుడై, మనస్సును అధీనంలో ఉంచుకుంటాడో శుచిగా ఉంటాడో వాడు మాత్రమే మళ్లీ జన్మించనవసరం లేని పరమపదాన్ని చేరుకుంటాడు. ఎవడు విజ్ఞానాన్ని సారథిగా, మనస్సును కళ్లెంగా చేసుకుంటాడో ఆ మానవుడు సర్వవ్యాప్తమైన పరమపదానికి చేరుకుంటాడు. ఇంద్రియాల కంటే విషయాలు, విషయాలకంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధికంటే ఆత్మ బలమైనవి.

ఆత్మ కంటె అవతల ఉండేది అవ్యక్తం. అవ్యక్తానికి పైన ఉండేది పరమ పురుష స్థితి. దానికి మించినది ఏదీ లేదు. అదే మానవుడు చేరుకోవలసిన అత్యున్నత స్థితి. అన్ని ప్రాణుల్లోనూ ఆత్మ గూఢంగా కనపడకుండా ఉంటుంది. సూక్ష్మమూ, ఏకాగ్రమూ అయిన బుద్ధితో తపస్సుతో సాధన చేసేవారికి మాత్రమే అది గోచరిస్తుంది. సాధకుడైన మానవుడు జ్ఞానవంతుడై తన వాక్కును మనస్సులో, మనస్సును బుద్ధిలో, బుద్ధిని ఆత్మలో, ఆత్మను పరమశాంతమైన పరమాత్మలో లీనం చేసుకోవడం అభ్యాసం చెయ్యాలి.

Comments

Popular Posts