'పాలిష్ వాలా' -కధ!

కొన్ని సంవత్సరాల క్రితం,ఇదే వానాకాలం!
ఒకరోజు మద్యాహ్నం ఆదిలాబాదు బస్టాండ్ లో బస్సు దిగాను!
గోదావరిఖని నుంచి మంచిర్యాల మీదుగా వచ్చాను!
అప్పటికి సమయం రెండు గంటలు కావస్తోంది!
నేను సామల సదాశివ గారి ఇంటికి వెళ్లాలి!
వారెవరో మీలో కొందరికి తెలుసు!
పన్నెండు గంటలవరకు చేరుకుంటానని, వారికి బయలుదేరడానికి ముందు రోజు పోన్ చేసి చెప్పాను!
కానీ,
వర్షాలు.. రోడ్లు చెడిపోవడం మూలాన సకాలంలో చేరుకోలేకపొయ్యాను!
అనుకున్న సమయం కంటే, రెండు గంటలు ఆలస్యం!
ఆదిలాబాదు బస్టాండ్ వెనుక నుంచి నడుస్తూ వెళితే ,వారింటికి అయిదు ‌నిముషాల దారి!
విద్యానగర్లో!
కానీ,
నాకు అప్పుడు వెళ్లాలనిపించలేదు!
ఆయన అప్పుడు పగటి నిద్ర గాని పోతాడో ఏమో,
లేపడం బాగుండదు!
పెద్దాయన!
నిద్రపోయిన వారిని లేపడం, నాకు ఇష్టం ఉండదు!
మూడు మూడున్నరకు వెళ్తే బాగుంటుంది!
కనుక అప్పటి దాకా ,ఇక్కడే బస్టాండులో గడపాలనుకున్నాను!
ఆకలివేస్తోంది,కనుక ముందు అన్నం తినాలి!
బస్టాండు లోంచి వెలుపలికి వచ్చి, హోటల్ కోసం వెదికాను!
పెంకుటింటి హోటల్ కనిపించింది!
హోమ్లీగా బాగానే అనిపించి వెళ్లాను!
పరవాలేదు!
జొన్నరొట్టె కందిపప్పు కూరా!
బాగుంది!
ఒక పని అయింది!
అరగంట గడిచింది!
ఇంకా గంటైనా గడపాలి!
ఎలా?
బస్టాండులోపలికి తిరిగి వచ్చాను!
పత్రికల షాప్ కనిపిస్తే, వెళ్లి- నేను అప్పటిదాకా చూడని ,ఏవో నాలుగు కొత్త వార- పక్షపత్రికల్ని కొనుక్కున్నాను!
బస్టాండు వెనుకవైపు చెట్లకింద -వాటి చుట్టూ గద్దెలు కట్టించారు!
చెట్లు -మధ్య మధ్య ,పచ్చని గడ్డి మొలిచి , కళ్లకు అహ్లాదకరమైన వాతావరణం!
ఒక చెట్టుకింద, గద్దెమీద కూర్చున్నాను!
పత్రికల్ని తిరగేస్తూ చూస్తున్నాను!
కొద్దిసేపు గడిచింది!
ఎవరో నా కాళ్లదగ్గర కూర్చున్నట్టు అయ్యేసరికి కిందికి చూసాను!
చెప్పులకు పాలిష్ చేసే పిల్లవాడు!
పన్నెండో పదమూడో సంవత్సరాలు ఉండొచ్చు!
ఎర్రగా సన్నగా చురుకైన మొహంతో నవ్వుతూ..
'చెప్పులు పాలిష్ చేస్త సార్' అన్నాడు!
కాళ్లను దగ్గరకు తీసుకుంటూ నేను ' వద్దు బాబు' అన్నాను!
నాకు మరొకరితో చెప్పులు పాలిష్ చేయించుకోవడం నచ్చదు!
నా చెప్పులు నేనే పాలిష్ చేసుకుంటాను!
పైగా పిల్లవాడు!
మా పిల్లవానికంటే,ఒకటి రెండు సంవత్సరాలు ,వీడు చిన్నవాడిలా ఉన్నాడు!
పసితనం ఇంకా వీడని ముఖం!
అందుక్కూడా నాకు ఇష్టం అనిపించలేదు!
నిజానికి నా చెప్పులు బాగా మాసి ఉన్నాయి!
నేను బాగా అనీజీగా గడుపుతున్న రోజులు!
దాంట్లోంచి బయటపడటం కోసమే, సత్సాంగత్యం కోసం తిరుగుతున్నాను!
' బాగా చేస్త సార్ ' అని పాలిష్ పిల్లవాడు, నవ్వుతూ ,నా కాలి చెప్పును ముట్టుకున్నాడు!
నాకు ఇక బాగనిపించలేదు!
జాలి కలిగింది!
పని చేస్తా అంటున్నడు కద!
వాడికి అవసరం ఉన్నట్టుంది!
'సరే 'అని చెప్పుల్ని విడిచి, పిల్లవాడికి ఇచ్చాను!
నేను తిరిగి పత్రికల్ని తిరగేస్తూ చూస్తున్నాను!
పది నిముషాలు గడిచాయో లేదో,
' ఎట్లున్నయ్ సార్?'అన్న పిల్లవాడి మాటతో చెప్పుల్ని చూసాను!
'బాగున్నాయి బాబు! ఎంతివ్వాలె?'అన్నాను!
'అయిదు రూపాయలు సార్' అన్నాడు!
నేను పదిరూపాయల నోట్ ఇచ్చాను!
'చిల్లర లేదు సార్' అన్నాడు!
నా దగ్గరా అయిదు రూపాయలు విడిగా లేకనే, పది రూపాయల నోట్ ఇచ్చాను!
'సరే బాబు , ఉంచుకో!' అన్నాను!
పిల్లవాడు నమ్మలేనట్టుగా ,కళ్లు విప్పార్చి చూసాడు!
'పరవాలేదు! తీసుకో! పాలిష్ బాగా చేసినవు!
ఉంచుకో ' అన్నాను నేను!
పిల్లవాడి ముఖంలో బోలెడు అనుమానం!
వాడి ముఖంలో ఏవో ప్రశ్నలు!
వాడు అలాగే వినయంగా లేచి , వెనక్కు వెనక్కు అడుగులు వేస్తూ, నన్ను ఎలా అర్థం చేసుకోవాలో సంశయిస్తూనే..ఏదో అభిప్రాయానికి వచ్చిన వాడి
వలే ..చిన్నగా నవ్వుతూ' నమస్తే సార్'అని తిరిగి వెళ్లాడు!
కొద్ది దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసి ,చెయ్యి పైకెత్తి టాటా చెపుతున్నట్టు ఊపాడు!
నేనూ చెయ్యి ఊపాను!
క్రమంగా మందిలో కలిసాడు!
అక్కడితో కధ అవ్వాలి !
కాని అవలేదు!
నేను మూడున్నర దాకా బస్టాండులో గడిపి, సదాశివ గారింటికి నడిచి వెళ్లాను!
వారు నిద్రపోకుండా నా కోసం ఎదురు చూస్తున్నారు!
అయ్యో అనుకున్నాను!
' రావద్దా!బస్టాండ్ల కూసుంటవా?'
సదాశివ గారు కోపం వ్యక్తం చేసారు!
'రోడ్లు బాగాలెవ్వు! రావడం లేట్ అవుతుందని, ఇల్లు దొరుకుతుందో లేదోనని మద్యాహ్నం నుంచి ఎదురుచూస్తున్నా' వారు అంటున్నరు!
నేను నసిగాను!
వారిది ప్రేమానురాగాలు నిండిన కోపం!
మరునాడు మద్యాహ్నం అన్నం తిని ,ఒంటిగంట సుమారు తిరిగి బస్టాండుకు వచ్చాను!
నన్ను బస్సు ఎక్కించడానికి సదాశివ గారి కొడుకు, రాజవర్ధన్ గారు వచ్చారు!
మంచిర్యాల వెళ్లే బస్సు ,మరో అరగంటకు ఉందన్నారు!
మంచిర్యాల నుంచి గోదావరిఖనికి నేను వెళ్లాలి!
అదో గంట ప్రయాణం!
రాజవర్ధన్ గారూ నేనూ, బస్టాండులోనే ఒక సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నాం!
ఏవో కుటుంబం సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నాం!
నా పాదాలను ఎవరో తాకినట్టు అనిపించింది!
కిందికి చూసాను!
పాలిష్ పిల్లవాడు!
నిన్నటి వాడే!
' సార్ మల్లొక్కసారి పాలిష్ చేస్త సార్ 'అన్నాడు!
నిన్నటి అయిదు రూపాయల బాకీ తీర్చుకోవడానికి అన్నమాట!
వాడి ముఖం చూసాను!
వాడి ముఖంలో అదే భావం!
అభ్యర్ధన!
చెయ్యనివ్వమని అర్ధింపు!
లోకంలో జనం ఎట్లున్నారు!
వీడు ఎట్లున్నడు?
నా కళ్లలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి!
బస్టాండు అంతా అలుక్కుపోయినట్టు.. గుడ్డిగా అనిపించింది!
ఒక్క పాలిష్ పిల్లవాడే కనిపిస్తున్నడు!
నేను వాడి బుజాలు పట్టి లేపి, 'వద్దు బాబు ' అన్నాను!
వాడి బాకీ అయితే తీరినట్టు ,వాడికి అనిపించి ఉండాలి!
వాడు లేచి నిలబడ్డాడు!
నవ్విండు!
నమస్తే అన్నాడు!
వెనుతిరిగి మందిలో కలిసిండు!

-తుమ్మేటి రఘోత్తమరెడ్డి

Comments

Popular Posts