సేవే పరమార్థం


రాముల వారు అయోధ్యకు వెళ్లిన తరువాత హనుమంతుడు ఏ పదవిని, ...ఏ అధికారాన్నీ  కోరుకోకుండా ఉండిపోతాడు.
అధికారం కోసం అర్రులు చాచే రోజుల్లో సేవాభావం, దాసభావంతో  నమ్మిన రాముడి సేవలో మాత్రమే తపించి, తరిస్తాడు హనుమంతుడు. ఇవ్వక ఇవ్వక సీతమ్మవారు హారం ఇస్తే అందులో రాముడు లేడని తిరస్కరిస్తాడు. ఈ కైంకర్య భావనే వివేకానందుని ఎంతో ప్రభావితం చేసింది. ఆయన ఆంజనేయుని గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అంతటి వీరుడైనా ఆంజనేయుడు దాస భావనతో జీవించాడని, సేవా భావంతో చేయాలన్న భావన ఉండాలని వివేకానందులు పదేపదే చెప్పేవారు.
తన గురించి చెప్పుకునేటప్పుడు కూడా వివేకా నందుడు ఆంజనేయుని స్వభావంతో తనను తాను ఇలా పోల్చుకునేవారు.
కుర్మస్తారక చర్వణం
త్రిభువనం ఉత్పాటయామో బలాత్‌
కింభో న విజానాసి అస్మన్‌
రామకృష్ణ దాసావయం
అని ఆయన తన పరిచయాన్ని చెప్పుకునేవారు. ”నక్షత్రాలను గుప్పెడు దుమ్ముగా మార్చేస్తాం. ముల్లోకాలను పెకలించి విసిరివేస్తాం. మేమెవరో ఇంకా గుర్తించలేదా? మేము రామకృష్ణుల వారి దాసానుదాసులం” అంటారాయన.ఇది హనుమత్భావనతో చెప్పిన మాట అని సులువుగానే గుర్తించవచ్చు.
బుద్ధిర్బలం యశోధైర్యం
నిర్భయత్వ మరోగతాం
అజాడ్యం వాక్పటుత్వం
హనుమాన్‌ స్మరణాన్‌ భవేత్‌
హనుమంతుడిని తలచుకోవడం వల్ల బుద్ధి, బలం, కీర్తి, ఓరిమి, నిర్భీతి, ఆరోగ్యవంతమైన జీవితం, సోమరితనం-జడత్వం లేని జీవితం, మంచి వాక్పటిమ లభిస్తాయని మనవారు చెబుతారు. వివేకానందుడి మనస్సుతో ఆంజనేయుడిని చూస్తే సమాజం కోసం 'పతత్వేష కాయో నమస్తే నమస్తే' అనే సమర్పణా భావపు నిలువెత్తు ప్రతీక, సేవా భావపు జయపతాక కనిపిస్తాయి.

Comments

Popular Posts