వారసులు లేని వారికి మరణానంతరం ఉత్తమగతులు సంప్రాప్తించవని అంటారు. ఇది నిజమా?

అపుత్రస్యగతిర్నాస్తి: అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని సాధారణంగా నిస్సంతువులు నిరంతరం దుఖిఃస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్రమంలో నిరంతరం దుఖిఃంచడం వ్యర్థం. సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనంతరం వారసులు ఉండాలని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు. చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్యగతిర్నాస్తిః యొక్క వాస్తవిక అర్థం. 

అది ఎలా అంటే… ఒక కళాకారుడు తనకున్న ప్రతిభతో సమస్త ప్రేక్షకులను రంజింపజేస్తుంటాడు. అదే విధంగా తన తదనంతరం ఎవరైనా తన వారసుడు రంగప్రవేశం చేసి ప్రేక్షకులను రంజింపజేయాలని నిత్యం తపిస్తుంటాడు. ఈ క్రమంలోనే అనేకమంది నూతన కళాకారులకు చేయూతనిస్తాడు. అతడి ముద్రపడిన ఏ కళాకా రుడైనా అతడి వారసుడిగా భవిష్యత్తులో చెలామణీ అవుతుంటాడు. చరమదశకు చేరుకున్న కళాకారుడు ఆ విధంగా ఎవరినైనా తన వారసుడిగా తీర్చిదిద్దక పోయినట్లయితే అప్పటి వరకు కళామతల్లికి ఒక కళాకారుడిగా చేసిన కృషి అంతా వృధా అవుతుంది. అదేవిధంగా ఒక రాజకీయనాయకుడు తాను జీవించినంత కాలం ఏదో ఒక పార్టీకి నిత్యం సేవలందిస్తుంటాడు. అతడి తరఫున ప్రాతినిథ్యం వహించే ఒక రాజకీయనాయకుడిని ఒక వారసుడిగా పొందాలని కోరుకుంటాడు. అదే క్రమంలో తన చరమదశలో ఎవరినో ఒకరిని తన వారసుడిగా రంగంలోకి దింపుతాడు. అతడి సాఫల్యం కోసం తన మేథస్సును వినియోగిస్తాడు. ఎవరినైతే తన వారసుడిగా భావిస్తాడో అతడి అభ్యున్నతికి పాటుపడతాడు. అతడికి సాఫల్యాన్ని అందిస్తాడు. అలా వ్యవహరించకపోయినట్లయితే అప్పటివరకు అతడి శ్రమ వ్యర్ధమవడమే కాక, అతడి ఆశయాలు నీరుగారిపోతాయి. 

చిన్నగా మొదలుపెట్టినా చివరికి వటవృక్షంలా మారిన పారిశ్రామికుడు జీవించినంత కాలం తన ఆశయసిద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటాడు. కొన్ని దశాబ్దాలు గడి చేటప్పటికి అతడికీ పదవీవిరమణ చేసే సమయం ఆసన్నమవుతుంది. మరికొద్ది కాలంలో తాను పదవీవిరమణ చేయాల్సి ఉండగా తన వారసుడి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. అప్పటివరకు తాను గడించిన వ్యాపారానుభ వంతో తనకు దీటైన వారసుడిని ఎన్నుకొంటాడు, తుదకు తాను సంతృప్తి చెందిన మనసుతో పదవీవిరమణ చేస్తాడు. ఆ విధంగా తాను సరైన వారసుడిని ఎన్నుకోకపోయినా లేదా తగిన వారసుడు లభించకపోయిన అప్పటి వరకు అతడి శ్రమ అంతా బూడిద పాలవుతుంది.

గురుస్థానంలో ఉండే స్వామీజీ భగవదనుగ్రహం వల్ల తాను కనుగొన్న ఆధ్యాత్మిక సత్యాలను ప్రజలకు నిరంతరం బోధిస్తుంటాడు. కొంతకాలానికి గొప్ప పీఠాదిపతి కూడా అవుతాడు. అయితే ఆ స్వామీజీ కూడా మానవుడి జీవన సరళికి విభిన్నమైన వాడు కాడు. అతడికీ వృద్ధాప్యం సమీపిస్తుంది. అప్పటివరకు తాను చేసిన జ్ఞానబోధ అక్కడితో ఆగిపోకూడదంటే ఆయన సైతం తన తరువాత తన వారసుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే క్రమంలోనే తగిన శిష్యుడి కోసం అన్వేషిస్తాడు. తన అన్వేషణ సాఫల్యం పొందిన తరువాత తాను ఎన్నుకున్న వారసుడిని పీఠాదిపతిని చేస్తాడు. అలా పీఠాదిపతి అయినవాడు సైతం తనను పీఠాదిపతిగా ఎన్నుకున్న స్వామీజీ అడుగుజాడల్లో నడుస్తాడు. స్వామీజీ జ్ఞాన బోధల్ని నిరంతరం కొనసాగించేందుకు పాటుపడుతుంటాడు. అలా పాటుపడని వారసుడిని ఎన్నుకున్నా, జ్ఞానశూన్యుడైన శిష్యుడిని తన తదనంతర పీఠాధిపతిగా చేసినా అటు వంటి స్వామీజీ జ్ఞానబోధలు నిర్వీర్యమవుతాయి.

వాస్తవానికి రంగం ఏదైనా తన తదనంతర వారసుడు సరైనవాడు లేకపోయినట్లయితే అ ప్పటివరకు అతడు చేసిన కృషి అంతా వృధా అవుతుంది. కనుక తన కృషి వృధా కాకుండా ఉండేందుకు, తన ఆశయాలు నిరంతరం సజీవంగా ఉండేందుకు కోరుకోవడమే వారసుడిని కోరుకోవడంలో పరమార్ధం. అలా వారసులు లేకపోయిన ట్లయితే ఉత్తమ గతి సంప్రాప్తించదని పెద్దలు వచించిన దానికి అర్ధం అప్పటి వరకు అతడు చేసిన కృషి వ్యర్ధమవుతుందని చెప్పడమే ఆ మాటల్లోని అసలైన అర్ధం. అప్పటివరకు అతడు చేసిన కృషి ఫలించాలనీ, తన ఆశయాలు, కన్న కలలు నిజం కావాలని ఆశించి ఆ క్రమంలో తగిన కృషిచేస్తూ వారసుడిని పొందడం ద్వారా, అలా పొందిన వారసుడి ద్వారా తన ఆశయాలను, కన్న కలల్ని నిజం చేయడం ద్వారా తన తదనంతరం కూడా సుదీర్ఘకాలం అందరి జ్ఞాపకాల్లో మిగిలిపోవడమే సద్గతికి లేదా ఉత్తమగతికి అసలైన అర్ధం అని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం. అలా పొందిన వారసుడే పుత్రుడవుతాడు. అలాంటి వారసుడు లేని ఏ ఒక్కరైనా గతిని తప్పి నిర్వీర్యుడవుతాడనేది అక్షర సత్యం.

Comments

Popular Posts