సూర్యుడు ఉదయించేటప్పుడు తూర్పు దిక్కునే అయినా కొంతకాలం కొంచెం ఎడమ వైపు నుంచి మరికొంత కాలం కొంచెం కుడివైపు నుండి ఉదయించినట్టు ఉంటుంది. ఎందుకిలా వుంటుంది?


తూర్పునకు కొంచెం ఎడమవైపు ఉండడం అంటే కొంచెం ఉత్తరం వైపునకు ఉండడం అన్నమాట. అలాగే తూర్పునుంచి కొంచెం కుడివైపు ఉండడమంటే కొంచెం దక్షిణ దిక్కుగా ఉండడమన్నమాట. సూర్యుడు కేవలం సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఖచ్చితమైన తూర్పు దిక్కు నుంచి ఉదయిస్తాడు. ఆ రోజుల్ని ఈక్వినాక్స్...‌ (Equinox) లు అంటారు. మన సాధారణ గ్రెగెరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఒక ఈక్వినాక్స్‌ మార్చి 19 - 21 మధ్య సంభవిస్తుంది. మరో ఈక్వినాక్స్‌ సెప్టెంబర్‌ 22, 23 తేదీల మధ్య సంభవిస్తుంది. ఈక్వినాక్స్‌ దినాల్లో ఖచ్చితమైన తూర్పు దిక్కునే సూర్యుడు ఉదయించడమే కాకుండా ఖచ్చితమైన పడమర దిక్కున అస్తమిస్తాడు. అంతేకాదు. ఆ ఈక్వినాక్స్‌ రోజుల్లో పగటిపూట సమయం, రాత్రిపూట సమయం దాదాపు సమానంగా (చెరి 12 గంటలు) వుంటుంది. మిగిలిన రోజుల్లో అంటే మార్చి 19 నుండి సెప్టెంబర్‌ 21 వరకు సూర్యుడు ఆయా ప్రాంతాల్లో సూర్యోదయం ఉత్తరం వైపునకు జరుగుతున్నట్టుగా అన్పిస్తుంది. ఈ కాలాన్ని ఉత్తరాయణం (Northward Equinox) అంటారు. అలా జరుగుతూ జరుగుతూ జూన్‌ 20, 21 తేదీలలో ఉన్నంతలో గరిష్టంగా ఉత్తరంవైపు సూర్యోదయం వుంటుంది. అలాగే సెప్టెంబరు 20, 21 నుండి సూర్యోదయం క్రమేపీ దక్షిణ దిక్కులో సంభవిస్తుంటుంది. అలా జరుగుతూ జరుగుతూ డిసెంబర్‌ 20, 21 ప్రాంతాలో గరిష్టంగా ఉన్నంతలో దక్షిణంవైపు వెళ్లి తిరిగి మార్చి 19, 20 ప్రాంతానికి యథాస్థితికి వస్తుంది. ఈ జూన్‌ 20, 21 తేదీల్ని సాలిస్టైస్‌(ఉత్తర), డిసెంబర్‌ 21, 12 తేదీల్ని దక్షిణ సాలిస్టైస్‌ (Solstice) అంటారు. ఉత్తరాయణ కాలంలో భూమధ్య రేఖకు పైభాగాన ఉన్నవారికి వేసవి కాలం అవుతుంది. వారికి పగటి సమయం రాత్రి సమయంకన్నా ఎక్కువ వుంటుంది. ఈ తేడా ఉత్తర సాలిస్టైస్‌ నాడు గరిష్టం అవుతుంది. అదే సమయంలో భూమధ్యరేఖకు కింద వున్న దేశాల్లో చలికాలం వుంటుంది. అందుకే భారతదేశం వంటి ఉత్తర అర్ధ భాగంలో వున్న దేశాల్లో వేసవి ఉండగా, దక్షిణ అర్ధ భాగంలో వున్న ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చలి వుంటుంది.
ఇక దక్షిణాయన కాలంలో దక్షిణ అర్ధ గోళ దేశాల్లో పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా వుండగా, భారతదేశం లాంటి దేశాల్లో (ఉత్తర అర్ధ గోళంలో వున్న దేశాల్లో) రాత్రిపూట సమయం పగటి సమయంకంటే అధికంగా వుంటుంది. పైగా చలిగా వుంటుంది. ఇలా ఉత్తరాయణం, దక్షిణాయనం, వేసవి, చలి వంటి ఘటనలు జరగడానికి కారణం భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణాక్షం (Spinning axis), భూమి సూర్యుని చుట్టూ తిరిగే పరిభ్రమణాక్షం (Orbital axis) సమాంతరంగా లేకపోవడమే. ఈ రెండు అక్షాల మధ్య సుమారు 23 డిగ్రీల కోణం వుంటుంది. మరో విధంగా చెప్పాలంటే భూపరిభ్రమణ కక్ష్యోపరితలానికి భూభ్రమణ కక్ష్య సుమారు 67 డిగ్రీల కోణంలో వంగి వున్నట్టు అర్థం (లంబంగా 90 డిగ్రీల కోణంలో కాకుండా). దాదాపు 10 వేల సంవత్సరాల పాటు ఇలా భ్రమణాక్షం మార్చి, సెప్టెంబరు నెలల మధ్య (ఉత్తరాయణ) కాలంలో సూర్యుడి వైపు మిగిలిన కాలంలో సూర్యుడికి వ్యతిరేకంగా వంగి వుంటుంది. అంటే ప్రతి 20వేల సంవత్సరాల కోమారు చలి, వేసవి కాలాల్లో పూర్తి విరుద్ధ సందర్భాలు సంభవిస్తాయి. లేదా ఇప్పట్నించి సుమారు 8వేల సంవత్సరాల తర్వాత భారతదేశంలో మే నెలలో ఎముకలు కొరికే చలి, డిసెంబరులో 50 డిగ్రీల సెల్సియస్‌ దాటే ఉక్కపోత వేసవిలో వుంటాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక

Comments

Popular Posts