అష్టలక్ష్మీ స్తుతి

ధ్యాయేద్దేవీం మహాలక్ష్మీం దారిద్ర్యోచ్చాట కారిణీం!
పంకజాసన మధ్యేతు సుఖాసీనాం శుచిస్మితామ్!!
హేమాంబరధరాం హేమ పద్మపీఠోపరిస్థితాం!
ముక్తామాణిక్య వైఢూర్యోపేత క్వణితనూపురామ్!!

రత్నబద్ధస్రజాం చైవ రత్నకుండలమండితాం!
విచిత్ర రత్నవద్భూషాం విచిత్రావయవైర్యుతామ్!!
పద్మద్వయధరాం చైవ వరదాభయ ధారిణీమ్!
చామరాభ్యాం వీజ్యమానాం సితఛత్రోపశోభితామ్!!
శంఖ పద్మనిధిభ్యాం చ సేవితాం పాదమూలతః!
జ్యేష్ఠాప్రహరణోద్యుక్తాం అసమృద్ధి వినాశినీమ్!!
అభూతి హరణాం దేవీం ధ్యాయేత్సంపత్ప్రదాయినీమ్!!

 
దారిద్ర్యాన్ని పూర్తిగా తొలగించే మహాలక్ష్మీ దివ్య రూప ధ్యానమిది. పద్మాసనంలో సుఖాసీనయై, నిర్మల మందహాసంతో, భాసిస్తున్న తల్లి బంగారు వస్త్రాన్ని ధరించి బంగారు పద్మపీఠంపై కూర్చొని, ముత్యాల మాణిక్యాల వైఢూర్యాలతో అలంకృతయై మోగుతున్న నూపురాలను ధరించినది. రత్నాలమాలను దాల్చి, రత్న కుండలాలను ధరించి, విచిత్ర రత్నాలను అలంకరించుకొని, విచిత్రమైన అవయవాలతో రాజిల్లుతున్నది. నాలుగు చేతులతో రెండు పద్మాలను, వరద, అభయ ముద్రలను ధరించిన దేవి.
ఇరువైపులా దివ్యాంగనలు చామరాలతో వీచుచుండగా, తెల్లని గొడుగుపట్టి కొలుచుకొనుచుండగా పేరోలగమున్న జనని. శంఖనిధి, పద్మనిధులు ఆ తల్లి పాదమూలంలో సేవించుకుంటున్నారు.
జ్యేష్ఠను (దారిద్ర్యాన్ని) తొలగించుతూ, లేమిని లేకుండా చేస్తూ, లోపాలను పోగొట్టే సంపదలనిచ్చే మహాలక్ష్మిని ధ్యానించుచున్నాను. (మహాలక్ష్మీ రత్నకోశం)

Comments

Popular Posts