సుగ్రీవుడు సీతని వెతకటానికి వెళుతున్న వానరములకి దిశానిర్దేశం చేసిన విధము .....

సుగ్రీవుడు వినతుడు అనే వానరాన్ని పిలిచి “వినతా! నువ్వు లక్షమంది వానరాలతో బయలుదేరి తూర్పు దిక్కుకి వెళ్ళు. నీకు నెల రోజుల సమయం ఇస్తున్నాను, నెల రోజులలో సీతమ్మ తల్లి జాడ కనిపెట్టాలి. మీరు ఇక్కడినుండి తూర్పు దిక్కుకి బయలుదేరి గంగ, సరయు, కౌశికి, యమున, సరస్వతి, సింధు మొదలైన నదులని, వాటి తీరములలో ఉన్న ప్రాంతాలని అన్వేషించండి. బ్రహ్మమాల, విదేహ, మాలవ, కాశి, కోసల, మాగధ, పుణ్డ్ర, అంగ దేశములలో ఉండే పట్టణాలని, జనపదాలని వెతకండి. వెండి గనులు కలిగిన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి, ఆ ప్రదేశాలన్నీ వెతకండి. సముద్రాలలో గల పర్వతాలు, వాటి మధ్యలో గల ద్వీపాలు, అందులో ఉన్న నగరాలు, మందరాచల శిఖరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్న జనుల యొక్క ఇళ్ళు, అక్కడ కొంతమందికి చెవులు ఉండవు, కొంతమందికి పెదవులు చెవుల వరకూ వ్యాపించి ఉంటాయి, కొంతమంది జుట్టు చెవుల వరకూ పడి ఉంటుంది. వాళ్ళందరూ చాలా భయంకరమైన నరభక్షకులు, వాళ్ళు నీళ్ళల్లో ఉంటారు. మీరందరూ ప్రతి చోట సీతమ్మని వెతకండి. అలా కొంతదూరం వెళితే యవద్వీపం కనపడుతుంది, అది రత్నములతో నిండి ఉంటుంది, మీరు అక్కడ వెతకండి. తరువాత సువర్ణ ద్వీపము, రూప్యక ద్వీపము ఉంటాయి. అవి బంగారము, వెండి గనులకు నిలయమైనటువంటివి. అది దాటితే శిశిరం అనే పర్వతం కనపడుతుంది, ఆ పర్వతం అంతా వెతకండి.కొంతదూరం వెళ్ళాక శోణానది కనపడుతుంది. ఆ నది చాలా లోతుగా, ఎర్రటి నీటితో ఉంటుంది. ఆ ప్రదేశంలో సిద్ధులు, చారులు విహరిస్తూ ఉంటారు. అక్కడున్న ఆశ్రమాలలో, తపోవనాలలో సీతమ్మని ఉంచాడేమో వెతకండి. తరువాత ఇక్షు సముద్రం వస్తుంది, అందులో మహాకాయులైన అసురులు ఉంటారు. వాళ్ళు ఆకలిని తీర్చుకోడానికి ప్రాణుల నీడని పట్టి బక్షిస్తుంటారు. అది దాటాక లోహితము అనే మధు సముద్ర తీరాన్ని చేరుకుంటారు. అక్కడ బూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి, అందుకని ఆ ద్వీపాన్ని శాల్మలీ ద్వీపం అంటారు. అక్కడున్న గిరి శిఖరాలకి మందేహులు అనే రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. వాళ్ళు సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు అక్కడున్న బ్రాహ్మణులు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే, ఆ జలముల యొక్క శక్తి చేత, సూర్యుడి శక్తి చేత ఆ మందేహులు అనే రాక్షసులు సముద్రంలో పడిపోతుంటారు. అప్పుడు వాళ్ళు మళ్ళి లేచి ఆ పర్వతానికి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు. ఆ సముద్ర మధ్యలో ఋషభము అనే పెద్ద పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద సుదర్శనము అనే పేరుగల గొప్ప సరోవరం వెండి కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది. దానిని దాటితే క్షీర సముద్రం వస్తుంది, దానిని కూడా దాటితే మధుర జలములు కలిగిన మహా సముద్రం వస్తుంది. అందులో ఔర్వుడు అనే మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది, దానికి హయముఖము అని పేరు.
దానిని దాటి ముందుకి ఒక 13 యోజనముల దూరం వెళితే ఒక బంగారు పర్వతం కనపడుతుంది. దానికి జాతరూపశిలము అని పేరు. దానిమీద సర్పాకృతి కలిగిన అనంతుడు నల్లటి బట్టలు ధరించి కూర్చొని ఉంటాడు, ఆయనే ఆదిశేషుడు. ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ధ్వజం పెట్టబడి ఉంది. దాని పక్కనే ఒక వేదిక ఉంది, దానిని దేవతలు నిర్మించారు. మీరు ఆ ఆదిశేషుడిని దర్శించి ముందుకి వెళితే బంగారు పర్వతమైన ఉదయాద్రి కనపడుతుంది. ఆ పర్వతం 100 యోజనముల వరకూ విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది. దానిని దాటి వెళితే సౌమనసం అనే ధృడమైన బంగారు శిఖరము ఉంటుంది. అక్కడే బ్రహ్మగారు భూమండలానికి ద్వారాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే సూర్యుడి మొదటి కిరణ ప్రసారం ప్రారంభమవుతుంది. అది దాటి వెళితే కటిక చీకటి. ఇక్కడిదాక అంగుళం విడిచిపెట్టకుండా సీతమ్మ జాడ వెతకండి. కాబట్టి తూర్పు దిక్కుకి వెళ్ళే వానరాలు సిద్ధం కండి” అన్నాడు.
 
తరువాత సుగ్రీవుడు “నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహోత, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, మైందుడు, ద్వివిదుడు, గంధమాదనుడు, ఉల్కాముఖుడు, అనంగుడు, హుతాశరుడు మొదలైనవారందరికి నాయకుడిగా యువరాజైన అంగదుడు బయలుదేరి దక్షిణ దిక్కుకి వెళ్ళండి. మీతో పాటు కొన్ని లక్షల వానరాలని తీసుకువెళ్ళండి. వెయ్యి శిఖరములు కలిగిన వింధ్య పర్వతానికి వెళ్ళి ఆ పర్వతం అంతా వెతకండి. గోదావరి నది, కృష్ణవేణి నదిలలో వెతకండి, తరవాత వరదా నదిలో వెతకండి. తరువాత మేఖల దేశము, ఉత్కల దేశము, దశార్ణ నగరము, అబ్రవంతీ, అవంతీ నగరాలని వెతకండి.
నదీం గోదావరీం చైవ సర్వం ఏవ అనుపశ్యత |
తథైవ ఆంధ్రాన్ చ పుణ్డ్రాన్ చ చోలాన్ పాణ్డ్యాన్ కేరలాన్ ||
విదర్భ, ఋష్టిక, మాహి, కళింగ, కౌశిక, ఆంధ్ర, పుణ్డ్ర, చోళ, పాండ్య, కేరళ మొదలైన రాజ్యాలన్నీ వెతకండి. కావేరి నదిని దాటండి. మలయ పర్వత శిఖరం మీద అగస్త్యుడికి విశ్వకర్మ నిర్మించిన గృహం ఉంటుంది, ఆ ప్రాంతాన్ని వెతకండి. తరువాత మొసళ్ళతో ఉన్న తామ్రపర్ణీ నదిలో వెతకండి. ఆ తరువాత సముద్రం వస్తుంది, ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయిన శిఖరములతో మహేంద్రగిరి పర్వతం కనపడుతుంది. ఆ సముద్రానికి 100 యోజనముల అవతల ఒక ద్వీపం ఉంది, దానిని కాంచనలంక అంటారు. ఆ లంకా పట్టణాన్ని రావణాసురుడనే పది తలల రాక్షసుడు పరిపాలిస్తున్నాడు. అక్కడ మీరు చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆ తరువాత సముద్రాన్ని దాటితే పుష్పితము అనే పర్వతము కనపడుతుంది. అది దాటితే సూర్యవత్, వైద్యుతం అనే పర్వతాలు కనపడతాయి. ఆ పర్వతాల మీద ఉండే చెట్లకి కాచిన పళ్ళు చాలా బాగుంటాయి, అవి తినండి. ఆ తరువాత కుంజరం అనే పర్వతం కనపడుతుంది, దాని మీద విశ్వకర్మ అగస్త్యుడికి బ్రహ్మాండమైన భవనం నిర్మించాడు. అలా ముందుకి వెళితే భోగవతి అనే నగరం వస్తుంది, అందులో విషంతో కూడుకున్న పాములు ఉంటాయి. అక్కడే సర్పాలకి రాజైన వాసుకి ఉంటాడు. ఆ తరువాత ఎద్దు ఆకారంలో ఉన్న వృషభ పర్వతం కనబడుతుంది. దానిమీద గోశీర్షకము, పద్మకము, హరిశ్యామము అనే మూడు రకాల చందనం కనపడుతుంది. ఇవి కాకుండా అగ్నితుల్యము అనే చందనం కూడా ఉంటుంది, కాని మీరు పొరపాటున కూడా ఆ చందనాన్ని ముట్టుకోకండి. అక్కడ శైలూషుడు, గ్రామణి, శిక్షుడు, శకుడు, బభ్రువు అనే 5 గంధర్వ రాజులు పరిపాలన చేస్తుంటారు. మీరు వారికి నమస్కారం చేసి ముందుకి వెళితే, పృద్వికి చివరన పుణ్యం చేసుకున్నవారు స్వర్గానికి వెళ్ళేవారు కనపడతారు. అదికూడా దాటిపోతే పితృలోకం వస్తుంది. ఇక అది దాటితే యమధర్మరాజు యొక్క సామ్రాజ్యం ఉంటుంది, అక్కడ పాపులు ఉంటారు. మీరు అది దాటి వెళ్ళలేరు. దక్షిణ దిక్కున అక్కడిదాకా వెళ్ళి వెతికిరండి ” అన్నాడు.
 
తరువాత సుగ్రీవుడు సుషేణుడిని పిలిచి, ఆయనకి నమస్కరించి “మీతో పాటు మరీచి మహర్షి యొక్క కుమారుడైన అర్చిష్మంతుడు, అర్చిర్మాల్యుడు మొదలైన వానరాలని తీసుకొని పడమర దిక్కుకి వెళ్ళండి. అప్పుడు మీరు సౌరాష్ట్ర, బాహ్లిక, చంద్ర, చిత్ర, కురు, పాంచాల, కోసల, అంగ, మగధ, అవంతి, గాంధార, కాంభోజ మొదలైన రాజ్యాలు, పట్టణాలు, గ్రామాలు వెతకండి. అలాగే మురచిపురం, జటాపురం కనపడతాయి, వాటిని కూడా వెతకండి. సిందు-సాగర సంగమ స్థానంలో, 100 శిఖరాలతో, పెద్ద చెట్లతో సోమగిరి అనే పర్వతం కనపడుతుంది. మీకు ఆ పర్వతం మీద రెక్కలున్న సింహాలు కనపడతాయి, అవి ఏనుగుల్ని ఎత్తుకుపోతుంటాయి, సముద్రంలోని తిమింగలాలని ఎత్తుకుపోతుంటాయి. అక్కడ సముద్రంలో పారియాత్రం అనే పర్వతం ఉంది, అది 100 యోజనాల విస్తీర్ణంలో ఉంటుంది. దానిమీద 24 కోట్ల గంధర్వులు ఉంటారు, వాళ్ళకి నమస్కారం చేసి ముందుకి వెళ్ళండి. అప్పుడు మీకు 100 యోజనాల ఎత్తయిన వజ్ర పర్వతం కనపడుతుంది. సముద్రంలో నాలుగోవంతు భాగంలో చక్రవంతం అనే పర్వతం ఉంటుంది, దానిమీద విశ్వకర్మ వెయ్యి అంచుల చక్రాన్ని నిర్మించాడు. ఆ చక్రాన్ని ఎవరూ తీసుకోకుండా చేస్తున్న హయగ్రీవుడు అనే రాక్షసుడిని శ్రీ మహావిష్ణువు చంపి ఆ చక్రాన్ని తీసుకున్నారు, అలాగే పంచజనుడు అనే మరొక రాక్షసుడిని చంపి శంఖాన్ని తీసుకున్నారు.
అక్కడినుంచి ముందుకి వెళితే మీకు ప్రాక్ జ్యోతిషపురం అనే ప్రాంత కనపడుతుంది, దానిని నరకాసురుడు పరిపాలిస్తున్నాడు. దాని తరువాత సర్వ సౌవర్ణ అనే పర్వతం కనపడుతుంది. ఆ పర్వతాల మీద ఏనుగులు, పందులు, పులులు, సింహాలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి. అదికూడా దాటిపోతే మేఘనం అనే పర్వతం కనపడుతుంది, ఈ పర్వతం మీదనే ఇంద్రుడు పాకశాసనుడు అనే రాక్షసుడిని సంహరించి దేవతల చేత అభిషిక్తుడయ్యాడు. ఆ తరువాత 60,000 బంగారు పర్వతాలు కనపడతాయి, వాటి మధ్యలో మేరు పర్వతం ఉంటుంది. ఆ పర్వత శిఖరం మీద ఉన్న ఏ వస్తువైనా బంగారంలా మెరిసిపోతుంది. ఈ మేరు పర్వతం నుండి అస్తమయ పర్వతం 10,000 యోజనాల దూరంలో ఉంది, ఇంత దూరాన్ని సూర్య భగవానుడు అర ముహూర్తంలో దాటి వెళ్ళిపోతాడు. అక్కడే విశ్వకర్మ చేత నిర్మింపబడ్డ భవనంలో పాశము పట్టుకొని ఉన్న వరుణుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడినుంచి ముందుకి వెళ్ళాక బ్రహ్మగారితో సమానమైన మేరు సావర్ణి అనే మహర్షి కనపడతారు, ఆయనకి నమస్కారం చేసి సీతమ్మ ఎక్కడుంది అని అడగండి. ఇక అక్కడినుండి ముందుకి వెళ్ళడం కష్టం. కావున మీరందరూ అక్కడిదాకా వెతికి రండి ” అన్నాడు.
 
తరువాత ఆయన శతబలి అనే వానరుడిని పిలిచి  “శతబలి! నువ్వు లక్ష వానరములతో కలిసి ఉత్తర దిక్కుకి వెళ్ళు. నువ్వు మ్లేచ్ఛ, పులింద, శూరసేన, ప్రస్థల, భరత, కురు, మద్రక, కాంభోజ, యవన, శక, కౌరవ మొదలైన ప్రాంతములలో వెతకండి. ఆ తరువాత సుదర్శన పర్వతాన్ని, దేవసఖ పర్వతాన్ని వెతకండి. ఆ తరువాత 100 యోగానాల నిర్జనమైన ప్రదేశం ఉంటుంది. ఆ తరువాత విశ్వకర్మ నిర్మితమైన తెల్లటి భవనంలో యక్షులకు రాజైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. అక్కడున్న క్రౌంచ పర్వతానికి ఒక కన్నం ఉంటుంది, అందులోనుండి దూరి అవతలివైపుకి వెళ్ళండి. అప్పుడు మీకు మైనాక పర్వతం కనపడుతుంది, అక్కడ కింపురుష స్త్రీలు నివాసం చేస్తుంటారు, మయుడు అక్కడే నివాసం ఉంటాడు. అక్కడే మీకు సిద్ధుల, వైఖానసుల, వాలఖిల్యుల ఆశ్రమాలు కనపడతాయి. అది కూడా దాటితే వైఖానస సరస్సు కనపడుతుంది, అందులో కుబేరుడి వాహనమైన సార్వభౌమము అనే ఏనుగు ఆడ ఏనుగులతో కలిసి స్నానం చేస్తుంది. ఆ తరువాత ఆకాశం ఒక్కటే ఉంటుంది. భయపడకుండా అది కూడా దాటితే శైలోదం అనే నది వస్తుంది. ఆ నదికి అటూ ఇటూ కీచకములు అనే వెదుళ్ళు ఉంటాయి, ఆ వెదుళ్ళ మీద ఋషులు అటూ ఇటూ దాటుతుంటారు. అక్కడినుండి ముందుకి వెళితే సిధ్దపురుషుడు కనపడతాడు. అది కూడా దాటితే పుణ్యాత్ములకు నివాసమైన ఉత్తరకురు దేశం కనపడుతుంది. అక్కడ ఎన్నో వేల నదులు ప్రవహిస్తుంటాయి, అన్ని నదులలోను వెండి పద్మాలు ఉంటాయి. వాటినుండి రజస్సు నీళ్ళల్లో పడుతూ ఉంటుంది, అందువలన ఆ నీరు సువాసనలు వెదజల్లుతుంటుంది. అక్కడ చిత్రవిచిత్రమైన చెట్లుంటాయి, ఆ చెట్ల కింద నిలుచుని ఒక కోరిక కోరితే, ఆ కోరికలకి సంబంధించినది ఆ చెట్టుకి వస్తుంది. అక్కడినుంచి ముందుకి వెళితే మీకు సంగీత ధ్వనులు వినపడతాయి, అక్కడ ఎందరో సంతోషంగా తపస్సు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక మీకు దుఃఖం అన్నది ఉండదు. అది దాటిపోతే ఉత్తర సముద్రం కనపడుతుంది, ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనే పర్వతం ఉంటుంది. సూర్యుడు లేకపోయినా ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అదికూడా దాటి వెళ్ళిపోతే ఒక పర్వతం మీద బ్రహ్మాండమైన, రమ్యమైన మందిరం కనపడుతుంది.
భగవాన్ తత్ర విశ్వాత్మా శంభుః ఏకాదశ ఆత్మకః |
బ్రహ్మా వసతి దేవేశో బ్రహ్మ ఋషి పరివారితః ||
అక్కడ శంకరుడు 11 రుద్రులుగా వచ్చి కూర్చుంటాడు. ఆ పక్కనే బ్రహ్మగారు వేదాన్ని బ్రహ్మర్షులకి చెప్తుంటాడు. ఇక అది దాటి ఏ ప్రాణి వెళ్ళలేదు. మీరు అక్కడిదాకా వెళ్ళి సీతమ్మని వెతకండి. ఒక నెల సమయంలో సీతమ్మ జాడ కనిపెట్టండి ” అని చెప్పాడు.
 
తరువాత సుగ్రీవుడు హనుమంతుడితో “హనుమా! నీకున్న పరాక్రమము, నీకున్న తేజస్సు, నీకున్న వేగము, నీకున్న బుద్ధి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీ తండ్రి వాయుదేవుడికి ఎటువంటి గమన శక్తి ఉందో నీకు అటువంటి గమన శక్తి ఉంది. అందుకని నేను నీమీదే ఆశ పెట్టుకుంటున్నాను, ఎలాగైనా సీతమ్మ జాడ నువ్వు కనిపెట్టాలి ” అన్నాడు.
ఇన్ని కోట్ల వానరాలు ఉండగా సుగ్రీవుడు కేవలం హనుమంతుడితో ఇలా చెప్పడం వల్ల రాముడికి హనుమంతుడి మీద నమ్మకం ఏర్పడింది. అప్పుడాయన హనుంతుడితో ” నాయనా! నువ్వు సీత దెగ్గరికి వెళ్ళగానే వానర రూపంలో ఉన్న నిన్ను చూసి రాక్షసుడు అనుకొని బెంగపెట్టుకుంటుందేమో. అందుకని నీకు ఈ ఉంగరం ఇస్తున్నాను, ఈ ఉంగరాన్ని సీతకి చూపిస్తే ఆమె సమాస్వాసం పొందుతుంది ” అని హనుమంతుడికి రాముడు తన ఉంగరాన్ని ఇచ్చాడు.
అప్పుడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని తన తల మీద పెట్టుకొని, రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి బయలుదేరడానికి సిధ్దపడ్డాడు. సుగ్రీవుడు వానరులందరినీ ” బయలుదేరండి ” అని ఆదేశించాడు.
అప్పుడు ఆ వానరాలు చాలా సంతోషంగా కేకలు వేశారు. వాళ్ళల్లో ఒకడు ‘ఒరేయ్! మీరందరూ ఎందుకురా నేనొక్కడినే సీతమ్మ జాడ కనిపెట్టేస్తాను ‘ అని అంటున్నాడు. మరొకడు ‘ నేను భూమిని చీల్చేస్తానురా ‘ అని అంటున్నాడు. ఇంకొకడు ‘ నేను సముద్రాల్ని కలిపెస్తాను ‘ అని, మరొకడు ‘ నేను పర్వతాలని కుదిపెస్తాను ‘ అని అంటున్నాడు. ‘ నేను వెళ్ళిన త్రోవలో ఇక చెట్లు ఉండవు, నా తొడల వేగానికి విరిచేస్తాను రా ‘ అని ఒకడు అంటున్నాడు. ‘ మీరందరూ విశ్రాంతి తీసుకొండిరా, ఆ పదితలల పురుగుని తీసుకొచ్చి రాముడి పాదాల దెగ్గర పడేస్తాను ‘ అని ఒకడు అంటున్నాడు. అలా అందరూ తొడలు కొట్టుకుంటూ, తోకలకి ముద్దులు పెట్టుకుంటూ, పైకి కిందకి ఎగురుతూ సంతోషపడిపోతున్నారు. అలా అందరూ సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం నాలు దిక్కులకి వెళ్ళిపోయారు.
అప్పుడు రాముడు సుగ్రీవుడితో “ఇన్ని దిక్కులలో ఉన్న విశేషాలు నీకు ఎలా తెలుసయ్య సుగ్రీవా? ” అన్నాడు.
సుగ్రీవుడు అన్నాడు “నన్ను చంపుతానని వాలి వెంటపడితే ఈ భూమి చుట్టూ తిరిగాను, ఇవన్నీ అప్పుడు చూశాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాలి నావెంట పడ్డాడు. ఆఖరికి హనుమంతుడు వాలికి ఉన్న శాపం గురించి చెబితే అప్పుడు ఋష్యమూక పర్వతం మీద కూర్చున్నాను” అన్నాడు.
అలా వానరాలన్నీ నాలుగు దిక్కులకి వెళ్ళడం వల్ల రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు సంతోషించారు.


 

Comments

Popular Posts