అది నీ చేతుల్లోనే ఉంది ....


మంచి ఎండలో ఒక మహిళ నీటిని చాలా దూరం నుండి కష్టపడుతూ తెస్తోంది. రెండు బిందెలను ఇంటిముందు పెట్టి, చిన్న బిందెతో నీటిని తెస్తూ అందులో పోస్తోంది.
ఇంతలో ఆమె భర్త ఆకలితో ఎండలో చెమటలు కక్కుతూ లోనికి వచ్చాడు.ఇంటి ముందు ఉన్న బిందెలను గమనించకుండా వాటిని కాలితో తన్నాడు.బిందెలలో నీళ్ళన్నీ క్రింద ఒలికిపోయాయి.కోపంతో రగిలిపోయిన అతను తన భార్య కోసం బయటనే నిలబడ్డాడు.ఆమె రానే వచ్చింది. ఆమెను చూసి కోపంతో ఇలా అన్నాడు భర్త. " అసలు నీకు బుద్ధుందా? నీళ్ళ బిందెలను వాకిలికి అడ్డంపెట్టి  ఎలా వెళ్ళావు. ఆకలితో ఇంటికి వచ్చిన నాకు ఆ బిందెలను తన్నడం వలన కాలికి దెబ్బ తగిలింది. నిన్ను మీ అమ్మ ఎలా కన్నదో! ఎలా పెంచారో!తెలివితేటలు లేనిదాన్ని నాకు కట్టబెట్టారు."అన్నాడు."ఇక మాటలు చాలించండి.....ఇప్పుడుకూడా నేను నీటి బిందెను తెస్తుంటే  కనీసం అందుకో్కుండా తెచ్చి్పోసిన నీటిని కూడా క్రింద పడేశారు.భార్య ఎంతకష్టపడి నీళ్ళు తెస్తుందో అని ఆలో్చన కూడా లేదు మీకు.పైగా మా పుట్టింటివారిని గురించి అంటారా? ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. మా పుట్టింటికే వెళ్ళిపోతాను." అంటూ ఏడుస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది భార్య.

ఈ సంఘటనే ...కాస్త సహనం తో మెలిగితే ఎలా ఉంటుందో చూద్ద్దాము:

నీళ్ళ బిందెలను చూడకుండా తన్నేసిన భర్త ఇలా అనుకున్నాడు. " అయ్యో! ఎంత కష్టపడి ఈ నీటిని తెచ్చిందో పాపం. నేనే కాస్త చూసి నడిచి ఉంటే బాగుండేది. ఇంటి పనితో సతమతమౌతూ నాకు ఇబ్బంది కలుగకుండా నీళ్ళను కూడా తనే తెస్తుంది.మళ్ళీ నీళ్ళు తేవడానికి వెళ్ళిందేమో ఎదురెళ్ళి నీళ్ళ బిందెను అందుకుందాం"
భార్యకు ఎదురెళ్ళి నీటి బిందెను అందుకుని ఇలా అన్నాడు. "పొరపాటున నీటిబిందెలను కాలితో తన్నేశాను. నువ్వేమీ కంగారు పడకు. నీవు ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకో!నేను వెళ్ళి నీళ్ళు తెస్తాను"
" అయ్యో! ఎండన పడి వచ్చారు. నేను దారికి అడ్డంగా పెట్టడమే తప్పండి. నీళ్ళే కదా పోతే పోనీయండి. భోజనం వడ్డిస్తాను, కాళ్ళు కడుక్కుని రండి. సరేలెండి......బిందె తగులుకుని కాలికి దెబ్బేమీ తగల్లేదు కదా! " అంది భార్య.

భార్యభర్తల్లో ఎవరూ కావాలని్ తప్పు చేయరు. తెలిసో తెలియకో చేసిన తప్పులను ఒకరికొకరు అర్థం చేసుకుని పిల్లలకు ఆదర్శంగా జీవించగలిగితేనే జీవితానికి అర్థం పరమార్థం.కాస్త సహనంతోనే జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్ధుకోవచ్చు


Source

Comments

Popular Posts