ఈ పద్యాన్ని మననం చేసుకుంటూ ఉంటే పాముల భయం ఉండదని పెద్దలు చెప్పారు


ఉదంకుడు పైల మహర్షి శిష్యుడు. గురువుగారి వద్ద విద్యాసముపార్జన పూర్తి చేసాడు. గురుదక్షిణ సమర్పించదలచాడు. పౌష్య మహారాజుగారి పత్నియొక్క కుండలాలు గురుదక్షిణగా కావాలని పైలుడు కోరాడు. ఆ కుండలాలను సంపాదించి వస్తున్న ఉదంకుడి నుండి తక్షకుడనే నాగరాజు వాటిని అపహరించాడు. వాటి నిమిత్తం ఉదంకుడు నాగలోకానికి వెళ్ళాడు. నాగరాజులను ప్రసన్నం చేసుకోవడానికి చేసిన నాగాస్తుతి ఇది. ఇవి నన్నయ్యగారి అమోఘమైన పద్యాలలో అనవద్యమైనవి. ఈ పద్యాలను మననం చేసుకుంటూ ఉంటే సర్పభాయాలు ఉండవని పెద్దలు చెప్పిన మాట.
బహువన పాదపాబ్ధికులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీధర మజస్ర సహస్ర ఫణాళి దాల్చిదు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికి బాయక శయ్యయైన య
య్యహిపతి దుష్రుజలతాంతకుడనంతుడు మాకు బ్రసన్నుడయ్యెడున్


అనంతుడు అహిపతి. అంటే నాగరాజు. ఆయన మన పాపాలను పోగొట్టే మహితాత్ముడు. కనుక దుష్క్రుతాంతకుడు. ఆయన జలధిశాయికి శయ్య అంటే సముద్రంపై శయనించిన శ్రీమహావిష్ణువు పాన్పు విష్ణుమూర్తి అంటే విశ్వరూపుడు. కనుక విష్ణువు దుస్సహమూర్తి. అంటే భరించరానంత మూర్తి. ఆయనను మోస్తున్నవాడు అసామాన్యుడైన అహిపతి అనంతుడు. ఎట్లా మోయగలుగుతున్నాడంటే ఆయన బలం అంతాయింత కాదు. ఆయన ఈ భూమండలాన్ని తన పడగల మీద మోస్తున్నాడు. అవి అజస్ర సహస్ర ఫణములు. అంటే అంతులేని వేయి పడగలు. అటువంటి పడగలపై అనేక వనాలు, సముద్రాలు, కుల పర్వతాలు, మహానదీ నదాలతో కూడిన మహా మహీమండలాన్ని మోస్తున్నవాడు. అటువంటి మహానుభావుడైన అనంతుడు ప్రసన్నుడు కావాలని ఉదంకుడు స్తుతించాడు.


విశాలమైన భూమండలం అని చెప్పే సమాసం – “బహువన….మహా మహీధరం”. ఆ సమాసంలోనే రెండవ ప్రయోజనం సాధించాడు మహాకవి నన్నయ్యగారు. అంత విశాలమైన తన పడగలమీద మోస్తున్నాడు అనంతుడు. ఇటు పడగల వైశాల్యాన్ని కూడా ఈ సమాసంలోనే సూచించారు. అనంతుడు అఖండ బలపరాక్రమాలను సూచించారు మరొకవైపు. అందుకే ఆయన తెలుగున గురు పద్య విద్యకు ఆద్యుడు. శబ్దశాసనుడు. హ, స – వర్ణాలను పునః పునః ప్రయోగించి నాగజాతి బుసకొట్టే లక్షణాన్ని శిల్ప సమన్వితంగా ప్రదర్శించాడు మహాకవి.

Source

Comments

Popular Posts