శివ పంచాక్షరీ స్తోత్రము

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై “న” కారాయ నమశ్శివాయ ||

మందాకినీ సలిత చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై “మ” కారాయ నమశ్శివాయ ||

శివాయ గౌరీవదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ |
శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ
తస్మై “శి” కారాయ నమశ్శివాయ ||


వసిష్ఠకుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ |
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై “వ” కారాయ నమశ్శివాయ ||

యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ |
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మై “య” కారాయ నమశ్శివాయ ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ||

 
తాత్పర్యము: 
నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, ‘న’కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.
మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి,  గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన ‘మ’కార రూపుడైన శివునికి నా నమస్కారములు.
సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, ‘శి’కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.
వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, ‘వ’కార రూపుడైన శివునికి నా నమస్కారములు.
యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, ‘య’కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.

Comments

Popular Posts