పూజలు, అర్చనలు, విగ్రహాలని పూజించడం కరెక్టేనా? వాటిలోదేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు ?


·       నాకు కూడా చిన్నప్పటి నుండి ఎంతోమంది లాగ ఎన్నో సందేహాలు ఉండేవి.దేవుడు ఉన్నాడా లేడా అనీ.

·       ప్రతిరోజూ ఇదే నా మనసులో వేదన.అసలు ఇలాగ ఎందుకు పిచ్చి పూజలు అర్చనలు ప్రాణం లేని రాళ్ల విగ్రహాలని పూజించడం.ఇలా ఎన్నో.చిన్నప్పుడే ఎంతోమందిని ప్రశ్నించేవాడిని.పెద్ద వాళ్ళని అడిగేవాడిని.ఎవరూ నాకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు.

·       ఏదో ఒక బాధ మనసులో అసలు జీవితం అంటే ఏమిటి?ఇలా పుట్టడం దేనికి?తిరిగి చావడం.

·       ఈ మధ్యలో ఈ బంధాలు అనుబంధాలు.అమ్మ నాన్న అన్న అక్క పెళ్ళాం పిల్లలు ఇలా అందరితో కలిసి బ్రతుకుతాం.ఎప్పుడో తెలియకుండానే తిరిగి చచ్చిపోతాము.ఎంత బాధ ఉంటుంది కదా.

·       ఒక తల్లి తండ్రులకి ఒకే బిడ్డ ఉంటాడు.అకారణంగానే ప్రేమో లేక ప్రమాదమో లేక రోగమో వచ్చి ఆ ఒక్క బిడ్డ చనిపోతే ఆ కన్న తల్లి కడుపు బాధ ఎంత ఘోరంగా ఉంటుంది.

·       అదే నేను చచ్చిపోతే ఇంకెలా. లేదా మన అమ్మో నాన్నో చనిపోతే ఇంకేమైనా ఉందా అని పసి వయసులో నా మనసుకి తీరని బాధ ఉండేది.

·       మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఇక మనం కూడా బ్రతకలేము.మనకి దిక్కు తెలియని తట్టుకోలేనంత బాధ.అలా అదొక సందేహం.

·       మళ్లీ ఈ దేవుడు అనే సందేహం.జీవితం అనేది ఎందుకు వచ్చింది అనే ఇంకో సందేహం ఇలా నా మనస్సు ఆవేదనల్లో సతమతం అయిపోయ్యేది.

·       అలా ఉండగా నా ప్రాణ స్నేహితుడు ఒకడు ఒక అనారోగ్య సమస్యతో చనిపోయాడు.

·      మరుసటి వారానికంతా ఇంకొకతను మాకన్న పెద్ద వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.అతను మా కన్నా ఎక్కువగా చదువుకుని సైన్స్ డిగ్రీ చేశాడు.

·       ఇంకొక వారానికే ఇంకోతన్ని మా ఊర్లోనే ఎవరో నరికి చంపేశారు.అతనికి పెళ్లి కూడా అయ్యింది.పిల్లలు పెళ్ళాం కూడా ఉన్నారు.తక్కువ వయసే ముగ్గురికీ.

·       కానీ ఎందుకు ఇలా జరిగింది.ఇది నాకు ఇంకా మెంటల్ ఎక్కి పిచ్చి పట్టినంత పని అయ్యింది.తట్టుకోలేని ఆలోచనలతో నా మెదడు తల తిరిగిపోయి నాకు స్పృహ తప్పి పడిపోయాను.స్కూల్లోనే నన్ను మా స్కూల్లో మా మేడం గారు హాస్పిటల్లో చేర్పించారు.

·       మా అమ్మానాన్నలు తర్వాత వచ్చారు.       ఒక సంవత్సరం హాస్పిటల్లో ఉన్నాను.ఎక్కువగా ఆలోచించడం వల్ల ఈ విధంగా మెదడు తీవ్రమైన ఆందోళనకి బాధకి గురై ఇలా జరిగింది.అనీ నాకు ట్రీట్మెంట్ చేశారు.

·     తర్వాత అంతా తగ్గిపోయింది.ఇంటికి వచ్చేశాము.మళ్లీ నా సందేహాలకు జవాబులు వెతకడం స్టార్ట్ చేశాను.ఎంతోమందిని అడిగేవాడిని. మాకు స్కూల్లో ఒక సైన్స్ టీచర్ ఒక సారు ఉండేవాడు.ఆయన నాకు ఆదర్శం.దేవుడు లేదు అనే వాదము ఆయన ద్వారానే నాకు కూడా వచ్చింది.

·       తర్వాత చనిపోయిన నా స్నేహితుల అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళేవాడిని వాళ్ళు నన్ను చూసి వెంటనే ఎంతో దుఖంతో ఏడ్చేసే వారు.

·       నాయనా మా కొడుకు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండు.అనీ నన్ను పట్టుకుని చాలా బాధపడే వారు.అపుడు నాకు అనిపించేది.ఇదేమి బాధ ఇలా ఎందుకు జరగాలి చనిపోవడం పుట్టడం ఇలా ఎందుకు అనీ.కానీ వారి బాధని ఎలా తగ్గించాలి.

·       ఎందరినో అడుగుతూ ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండేవాడిని.కానీ గుడులకి వెళ్లి దేవుడి దగ్గర కూడా మనస్సులో సందేహాలని అడిగేవాడిని మన సినిమాల్లో లాగ.కానీ ఏ దేవుడూ పలుకడు మాట్లాడడు.ఇదే నిజం.అయినా ఏదో సందేహం. 

·       ఏదో ఉంది.ఇందుకు అన్నింటికీ ఒక మార్గం ఉంది.సమస్య ఉంటే పరిష్కారం కూడా దొరుకుతుంది.అనే ఆశతో నా శోధన ని ఆపలేదు.

·       నీటిని గాలిని భూమిని సూర్యుడిని ప్రకృతిని ఎవరు చేశారు.ఎలా ఏర్పడ్డాయి.వీటన్నింటికీ మూలం ఏది.శూన్యంలో ఎలా ఏర్పడ్డాయి.

·       జీవిత సమస్యల్లో కొట్టుకుంటున్న మనిషికి చావు అనే భయంకరమైన శిక్ష ఇంకొకటి.

·       ఇలా ఉంటే మా ఇంట్లో నేను తిడుతున్న కూడా నా మాట ఎవ్వరూ వినేవారు కాదు.వారి పూజలు వారి గొడవలు వారిదే. అమ్మ నాన్నలు పూజలు, పునస్కారాలు, గుడులు, గోపురాలు ఇలా తిరగడం ఇదే వారి తంతు.నాకు పరమ చిరాకు వేసేది.ఎవరో గురువులు అని కూడా చెప్పుకుంటూ మా ఊరికి వచ్చేవారు.వారికి అందరూ మొక్కేవారు.

·       ఇవన్నీ పిచ్చి పనులుగా అనిపించేది.

·      మా నాన్న గారు కూలి పని చేసేవారు.తినడానికి తిండికే గతిలేదు మీకు ఇలా పూజలకి గురువులకు దండగ ఖర్చులు పెడుతున్నారు అని తిట్టేవాడిని.ఆయన నా మాటలు పట్టించుకునే వారు కాదు.ఇలా....  జరుగుతూ ఉండేది.మా ఇంట్లో నెల నెలా పౌర్ణమి పూజలు, గ్రంథ పఠనలు. సరే ఒక నిర్ణయానికి వచ్చాను

·       ఏమైనా కానీ ఈ పిచ్చి పుస్తకాల్లో, గ్రంధాల్లో ఏముందో చదువుదాం అనీ నిర్ణయించుకుని కూర్చున్నాను,చదివాను.రామాయణ, మహాభారత, భాగవత పుస్తకాలు, భగవద్గీత, బైబిల్ ఖురాన్ అన్నీ చదివాను.

·      ఏ ఒక్క పుస్తకంలోనూ నాకు దేవుడు కనిపించలేదు.కానీ అన్ని పుస్తకాల సారాంశం ఒక్కటే.అనీ అర్థం చేసుకున్నాను.అదే మానవత్వం.ఒక మనసుకి బాధ తీరని దుఃఖం కలిగితే ఒక దిక్కు తెలియని వాని ఏడుపుకి ఒక గొప్ప ఆనందమే భగవంతుని మార్గం.అనీ కన్నతల్లి చనిపోయిన బిడ్డకోసం ఏడ్చే ఏడుపుకు ఒక జవాబు ఈ భక్తి మార్గంలో దొరుకుతుంది.అనీ గ్రహించాను మన శాస్త్ర గ్రంధాల ద్వారా. 

·       నిజంగా ఆనందం కావాలంటే ఎందులోనూ దొరకదు.డబ్బులు, విలాసం, సుఖం, స్త్రీ పురుషుల కలయిక, గొప్ప పేరు ప్రతిష్టలు ఎందులోనూ ఆనందం లేదు.ఉన్నా అవన్నీ కొంత సమయం మాత్రమే.తర్వాత అంతా మామూలే అనీ.కానీ నిజమైన ఆనందం ఒక ప్రేమించే మనిషి చనిపోయిన కూడా ఆయొక్క అంత బాధని తగ్గించగల శక్తి ఈ దైవానికి మాత్రమే ఉంది అని.

·      నిన్ను పూజలు చెయ్యమని, నమాజ్ లు చెయ్యాలని, చర్చ్ లో ప్రార్థించమనీ ఎవ్వరూ దేవుళ్ళు చెప్పలేదు.

·      కానీ నీకు బాధ కలిగినపుడు నీ సందేహాలని నివృత్తి చేసుకోవాలనుకునే సమయం వచ్చినపుడు నీకు దిక్కు తెలియని ఆవేదన వచ్చినపుడు నేనున్నాను అంటుంది దైవత్వం.

·       అదే ప్రతి గ్రందంలోనూ చెప్పారు మన పెద్దలు.సరే ఈ ఆ సందేహాలు అన్నీ నివృత్తి అయ్యాయి.కానీ ఇన్ని చెప్పిన ఆ శాస్త్రాలు గ్రంధాలు దేవుడు ఎలా ఉంటాడో చెప్పలేదా అనుకోవచ్చు.

·       నిజమే చెప్పారు.అందుకు కూడా మార్గాలున్నాయి.అవి అన్నీ సాధన ద్వారా తెలుసుకోవాలి.

·      అదేంటి మళ్లీ సాధన అంటున్నారు అనవచ్చు.కానీ జీవితం అనే ఈ సందేహ,కష్టాల సమరంలో ఒక్క పూట భోజనం కావాలంటేనే ఎంత కష్ట పడుతున్నాం.ఒక గమ్యాన్ని చేరుకోవాలంటే ఎంతదూరం ఎన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం.అలాంటిది ఒక తత్వం గురించి దైవం గురించి తెలుసుకోవాలంటే ఇంకెంత సాధన చెయ్యాలి ఆలోచించండి.

·       మనిషిని మనిషిగా బ్రతకమని నీలోనే సర్వము ఉన్నదని నువ్వే గొప్ప దేవునివి అనీ నీకు నిజంగా దైవాన్ని చూడాలంటే నీలోనే నువ్వు దేవుణ్ణి చూడవచ్చు అనీ సాధన ద్వారా అన్నీ సాధించవచ్చు అని నువ్వే నిజమైన దేవుడిగా నిన్ను నువ్వు మొదట గ్రహించమనీ చెప్పింది మన దైవ శాస్త్రం. 

·       విమర్శలు ముఖ్యం కాదు ,సందేహ నివృత్తి ముఖ్యం.

·       వాదన ముఖ్యం కాదు, వివేకంతో ఎరుగడం ముఖ్యం.

·       దేవుడిని చూడాలి అనేది ముఖ్యమే దానికి నువ్వు సాధన చెయ్యడానికి సిద్ధమేనా నీకు సమయం ఉందా అని ప్రశ్నించుకో...అదే ముఖ్యం.

·       నువ్వే అంతా నీదే అంతా నీలోనే అంతా కళ్ళు తెరిచి చూస్తే కనిపిస్తుంది.నిజంగా నిద్రపోకుండా నీ బుద్ధిని పైకి లేపి చూడు.స్పష్టంగా కనిపిస్తుంది దైవం అనే మానవత్వం నీలోనే దాగి ఉంది.

·       సందేహాలతో సతమతం అవడం ఎందరి జీవితాల్లోనో జరిగింది.అలా జరిగితేనే వారు సందేహాలు తీర్చుకుని గొప్పవారు అయ్యారు.

·       వివేకానందుడు సత్యమైన బోధనలు చెయ్యకపోతే అతన్ని విదేశాల్లో పర్యటింపజేసేవారా.?

·      వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన వివరణలు నచ్చకపోతే నవాబులు ఆయన్ని అంగీకరించేవారా?

·      బుద్ధుడు జీవిత సందేహాలతో సతమతమై నిజంకోసం ప్రాకులాడి వైరాగ్యము ద్వారా కోరికలని త్యజించి సన్యాసం అనే సనాతన మార్గాన్ని దైవ మార్గాన్ని అనుసరించేవాడా?

·       ఇవన్నీ కాదు స్నేహితులారా మీరు నిజంగా నమ్మితే ఒక్కటి నిజం.

·       మనిషికి నిజ ఆనందం భక్తిలో మాత్రమే ఉంది.

·       భక్తి అంటే పూజలు కాదు మొక్కడం కాదు.దాసోహం కాదు.

·      భక్తి అంటే నిజంగా బ్రతకడం.నిన్ను తెలుసుకుని బ్రతకడం.దుష్ట తత్వాన్ని వదిలి జీవించడం.విమర్శలను నిలిపి నీ ఆత్మ విమర్శలో నడవడం.అదే నిజమైన భక్తి. 

·      మనుషులు అందరూ తప్పులు చేస్తారు.అన్ని కాలాల్లోనూ తప్పులు జరిగి ఉంటాయి.సందర్భాలను బట్టి మనం వాటిని అర్థం చేసుకోవాలి.
ఆఖరుగా- నా నిజమయిన సమాధానము.

·       మనిషి జీవితం అంటే ఏమిటి?అనే ప్రశ్నకు జవాబు ఒక దైవత్వం లోనే ఉంది.
·       నువ్వు చనిపోతే ఎలాగ అనే బాధని తగ్గించే మందు దేవుడు మాత్రమే.

·       నీకు కావలసిన గొప్ప మార్గం నిన్ను నువ్వు తెలుసుకోవడమే...

·       నేను తెలుసుకున్న అనుభవించిన నా ప్రస్తుత జీవన నిజాలు ఇవే.ఇంకా నాకు సాధన ద్వారా ఎన్నో సత్యాలు తెలియాల్సిఉంది.

·       ఏమైనా దోషాలు ఉంటే పెద్ద మనస్సుతో మన్నించడి.ఉపయోగము అయితే నలుగురికీ చెప్పండి.

సర్వే జనాస్సుఖినో భవంతు.

-Thought by లక్ష్మీపతి మాచెర్ల.

Comments

Popular Posts