శనిదేవుడిని 'శనీశ్వరుడు' అని ఎందుకు పిలుస్తారు?

శనీశ్వరుని తల్లిదండ్రులు సూర్యుడు, ఛాయాదేవి. అందుకే ఆయనకు ఛాయాపుత్రుడనే పేరు కూడా వుంది. అలాంటి శనిదేవుడు ఈశ్వరుని పేరుతో అంటే శనీశ్వరుడు అని ఎందుకు పిలవబడటానికి సంభందించిన  వృత్తాంతం ఇది.

కృతయుగంలో ఒకసారి పరమేశ్వరుడి దర్శనార్థం కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్పుకొచ్చాడు. నారదుడు అలా శనిదేవుడిని ప్రశంసించడం పరమేశ్వరునికి కొంత అతిశయముగా అనిపించింది.. అలా అయితే శనిదేవుడు అంత శక్తివంతుడైతే తన ప్రభావాన్ని తనపై చూపించి.. తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిందిగా చెబుతాడు పరమేశ్వరుడు. ఈ విషయం తెలుసుకున్న శనిగ్రహం.. శివుడిని పట్టేందుకు బయలుదేరుతాడు. శివపరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని తెలుపమని నారదునితో తిరుగు వర్తమానం పంపుతాడు శనిదేవుడు. 

శనిదేవుడు ఇచ్చిన హెచ్చరికతో శివుడిని నారదుడు జాగ్రత్తగా ఉండమంటాడు. దీంతో శని పని పట్టాలని శివుడు కైలాసం నుంచి మాయమై ఒక దండకారణ్యం బాట పట్టాడు. శని సహా ఎవరి దృష్టి కనిపించని చోటు కోసం అన్వేషించి.. ఆ అడవిలోని (తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం) ఒక పెద్ద రావిచెట్టు తొర్రలో ఈశ్వరుడు దాక్కుని తపస్సు చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. 

మరుసటి రోజు ఈశ్వరుడు కళ్లు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడిని నమస్కరిస్తా డు. అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైంది.. అని ప్రశ్నిస్తాడు. ముక్కంటి, పరమాత్మ , చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవమైన పరమశివుడు కైలాసం నుంచి పారిపోయి, దండకారణ్యంలో ఇలా  చెట్టు తొర్రలో దాచుకోవడం శని పట్టినట్లు కాదా ఈశ్వరా? అని ప్రశ్నించాడు. దీంతో తనను పట్టిపీడించడంలో విజయం సాధించి ... తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని మానవులు తనను శనీశ్వరా అని పూజిస్తే.. శని తరపున తానే ఆశీస్సులు ఇస్తానని వరం ఇచ్చాడు పరమశివుడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. 


అందుకే శనిదేవుడిని 'శని' అని పిలవకుండా (పొరబాటున కూడా నిందించకుండా) 'శనీశ్వరా' అని పిలవడం ద్వారా ఆయన అనుగ్రహం పొందగలమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.. శనివారం పూట శనీశ్వరుడిని పూజిస్తే ఏలినాటి, అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.  శనివారం పూట శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వుల నూనె, నల్లటి నువ్వులు, నీలపు శంఖు పుష్పాలు, నల్లని వస్త్రంతో పూజిస్తే.. వారికి మృత్యుభయం, అనారోగ్యం కలుగవు. ఈతిబాధలు తొలగుతాయి. సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, సకలసౌభాగ్యాలు,  చేకూరుతాయి. ఇంకా శనివారం, శనిత్రయోదశి నాడు శనీశ్వరునికి  నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేస్తే .. ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Comments

Popular Posts