అన్నదమ్ములైన వానర వీరులు 'వాలి','సుగ్రీవు'ల మధ్య వైరం ఎందుకు వచ్చింది?వాలి సుగ్రీవుల పోరాటం ఎలా జరిగింది?రావణుడే భయపడే మహాబలశాలి వాలి ఎలా మరణించాడు?

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. హనుమంతుని  విద్య  ముగిసిన  తరువాత గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు కొలువులో చేరాడు. 
వాలి మహాబలసంపన్నుడు. రావణాసురుడంతటి వాడే అతని శక్తి ముందు తలవంచి స్నేహితుడిగా మారిపోయాడు. ఒక సారి మాయావి అనే రాక్షసుడు వాలితో యుద్ధం చేయడానికి కిష్కింధవచ్చి గొడవ చేశాడు. అప్పుడు. వాలి సుగ్రీవులు అతని ముందుకొచ్చారు. వారిని చూడగానే మాయవికి పై ప్రాణాలు పైకే పోయాయి. భయపడి పారిపోయాడు. వాలి అతన్ని వదలక అనుసరించాడు. మాయావి ఒక బిలంలోకి దూరి మాయమయ్యాడు. వాలి సుగ్రీవునితో "నువ్వు ఇక్కడే నాకోసం వేచు ఉండు. వాడెక్కడున్నా సరే. వాడిని చంపి గాని తిరిగిరాను." అని బిలంలోకి దూరాడు. ఏడాది పాటు ఆ బిలం దగ్గరే గడిపాడు. ఇంతలో రాక్షసుల ఆర్తనాదాలు, ఏరులై పారుతూ రక్తం బిలం నుంచి బయటకు వచ్చింది. కొంతకాలానికి పెడ బొబ్బలు ఆగిపోయాయి.రాక్షసుల చేతిలో చని పోయాడని భావించి వాలినే జయించిన రాక్షసుడు తిరిగి బయటకు వస్తే తమ జాతి మనుగడకే ప్రమాదమని భావించి సుగ్రీవుడు బిలాన్ని ఒక పెద్ద రాతితో మూసి విచారిస్తూ కిష్కింధకు పోయి జరిగిన సంగతి చెప్పి వాలికి అంత్యక్రియలు చేసాడు. వానర పెద్దలు సుగ్రీవుడిని రాజు చేసారు. కొన్నాళ్ళకు బిలం ముందు ఉన్నరాయిని కాలితో తన్ని కిష్కింధకు వస్తాడు వాలి. అతనికి జరిగిన సంగతి సుగ్రీవుడు చెప్పబోగా వినక తన్ని చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక అక్కడ ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు. అతనికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు.
నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తూన్న సుగ్రీవుడితో ఒక రోజు ఇలా అన్నాడు "మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తూన్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతనికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని హనుమంతుడు సుుగ్రీవునికి చెప్పెను.ఆ సలహా సుుగ్రీవునికి నచ్చి హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.
 
శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి:
సీతాన్వేషణలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఋష్యశృంగ పర్వత ప్రాంతానికి వచ్చారు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు.
హనుమంతుడు తన మృదువైన మాటలతో వారిని గురించి తెలిసికొన్నాడు. లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.
 
రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.
వాలి సుగ్రీవుల పోరాటం:
రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.
 
                                                                       Image
అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.
అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు. కొంత సమయానికి మోక్షం చేరాడు.
 

Comments

Popular Posts