వాలి సుగ్రీవుల పోరాటం అనంతరం, వాలి మరణించబోయే ముందు శ్రీ రాముని కోరిన చివరి కోరికలు


వాలి సుగ్రీవుల పోరాటంలో శ్రీ రాముడు తనని దొంగచాటుగా చెట్టు చాటు నుంచి బాణంతో కొట్టడం గురించి వాలి మొదట శ్రీ రాముని నిందిస్తాడు.ఆ తరువాత శ్రీ రాముడు చెప్పిన కారణాలకు కనువిప్పు కలిగి మన్నించమని వేడుకుంటూ శ్రీ రామునితో తన చివరి కోరికలు ఇలా విన్నవించుకున్నాడు.

రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.

తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.
పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివి కావు అని చెప్పి అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచే  మరణించాడు.

అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.

 

Comments

Popular Posts