వాలి సుగ్రీవులు పోరాడుతున్నప్పుడు శ్రీ రాముడు వాలిని చెట్టు చాటు నుండి తన బాణం తో కొట్టాడు.ఇది ధర్మమేనా? ధర్మ నిరతికి , సత్ శీలతకు మారుపేరైన శ్రీ రాముడు వాలిని దొంగచాటుగా సంహరించడం సమంజసమేనా?


వాలి సుగ్రీవులు భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు.  

 
మరణానికి చేరువవవుతున్న వాలి శ్రీరాముని నిందించుట:
వాలి నీరసంగా రాముని చూచి ఇలా నిందించాడు.--
“రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా న్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.
నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవినబెట్టాను.
నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.
నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను.”– అని వాలి అన్నాడు.
రాముని సమాధానం: 
వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.
నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.
ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.
నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.” అని శ్రీరాముడు ఉపదేశం ఇచ్చాడు.

 
                           వాలి మరణ సమయంలో రాముని ఉపదేశం - సుమారు 1595 నాటి చిత్రం
                           Los Angeles County Museum of Art (LACMA)

Comments

Popular Posts