శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగ మాత్రమే కాదు.సర్వవిద్యలూ, సర్వ సంపదలు ప్రసాదించే మరొక విశేషమైన రోజు కూడా.

శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి రోజు అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకోవడం అందరికీ తెలిసిందే. ఇది బాగా ప్రాచుర్యం పొందింది కూడా.
అయితే ఈ రోజుకి మరొక మహా విశిష్టత ఉంది. అదే హయగ్రీవ జయంతి.శ్రీ మహావిష్ణువు దేవతలను అష్టకష్టాలు పెట్టిన ఒక రాక్షసుని సంహరించడానికి హయగ్రీవ స్వామి అవతారం గా అవతరించినది శ్రావణ పౌర్ణమి నాడే.  అలాగే హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం అని వేదం పండితులు చెబుతున్నారు. 

హయగ్రీవావతారం:

శ్రీ మహావిష్ణువు విజయగాధాపరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు.

 • పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు తన ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం(గుర్రం తల ) అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆయన దేవతలకు అభయం ఇచ్చి హయగ్రీవుని హతమార్చాడు.అయితే ఆయన ఆ సమయంలో ఎంతో ఉగ్రత్వంతో ఉండగా, ఆయనను శాంతింపజేయడానికి పార్వతీదేవి వచ్చింది. ఆమె "హయగ్రీవా! నిన్ను ఆరాధించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకం కాగలవు." అని ఆయనకు ఓదివ్యశక్తిని ప్రసాదించింది. దాంతో ఆయన ఆగ్రహంనుండి పూర్తిగా ఉపశమనం పొందాడు. పిల్లలు మారాం చేస్తుంటే వారికి ఏదోలా నచ్చజెప్పినట్లే స్వామివారి ఆగ్రహాన్ని ఉపశమింపజేయడానికి సాక్షాత్తూ ఆ ఆదిపరాశక్తి రూపాంశయైన పార్వతీదేవి ఈ విద్యాశక్తి స్వామివారికి అందించిందన్నమాట.
     

 • మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే...ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు. హయగ్రీవుని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం. 
  విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
  దయానిధిం దేవభృతాం శరణ్యం! దేవం హయగ్రీవమహం ప్రపద్యే!!

 • హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవత. ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామి తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.

  జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
  ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

   అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ సన్నిదిలో, సత్యనారాయణ వ్రత   కథ చెప్పె పండితులు పై మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు..

  హయగ్రీవ స్తోత్రము:

  హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం  |
  నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||1||

  హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
  తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||2||

  హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
  వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||3||
  ఫలశ్రుతి:
  శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
  వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||4||

  హయగ్రీవ స్వామి అలయాలు:

  హయగ్రీవ స్వామి అలయాలు భారతదేశమంతటా అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉంది.
  

 


 


 


 


 


 

 Comments

Popular Posts