'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమి?

 
 
దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్యభాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక *రాక్షసముఖం* కనబడుతుంది. దానికే   'మకరతోరణం' అని పేరు. ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చటానికి గల కారణము గురించి *స్కందమహాపురాణం* లో ఒక కథ వుంది....

·      పూర్వం *"కీర్తిముఖుడు"* అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేకవరములను పొంది తద్వారా వచ్చిన బలపరాక్రమాలతో సమస్త భువనములలోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన *'జగన్మాతను'* కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని అతిభీకరమైన *అగ్నిని* సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరమసాగింది.
·      మరణంలేకుండా వరం పొందినా, శివుని ఆఙ్ఞమేరకు ఆబడబాగ్ని తనను ఎక్కడ దహించివేస్తుందో అని భయంతో పరుగులు తీస్తూ అన్నిలోకాలూ తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు వేడేడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటంకోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట *మూడవ కన్ను* గా ధరించాడు.
·      ఆ తరువాత *కీర్తిముఖుడు* తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదనీ, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని మహాదేవుని కోరాడు. యుక్తిగా శివుడు *"నిన్ను నువ్వే తిను"* అని చెప్పాడు. శివుని ఆనతి మేరకు *కీర్తిముఖుడు* *మొసలి రూపం* ధరించి తనను తాను ముందుగా తోకభాగంనుంచి మొదలుపెట్టి కంఠం వరకూ తిన్నాడు. తన తలను తానే ఎలాతినాలో అతనికి తెలియలేదు. అతని ఆకలి ఇంకా తీరలేదు. శివుని ప్రార్థించాడు.
·      ఆప్రార్ధన ఆలకించిన పరమశివుడు, ఈనాటినుంచి అన్ని దేవతాలయాలలో దెవతా మూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురఃహంకారాన్ని, ఆశను, తింటూ ఉండు. నీవు అందరికీ పూజనీయుడవు అవుతావు అని వరమిచ్చాడు.
·      ఆనాటినుంచి *కీర్తిముఖుడు* దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక వున్న తోరణామధ్యభాగాన్ని తన రాక్షస మకరముఖంతో అధిష్ఠించి భక్తులలో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని,, దురాశను కబళిస్తున్నాడు . ఈకారణంగానే దేవతా మూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణానికే *'మకరతోరణం'* అని పేరు వచ్చింది.
 
 

Comments

Popular Posts