జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు.

 • జీవితం ఎప్పుడూ సాఫీగా సాగదు. అలా నిరంతరం సుఖంగా ఉండాలని ఆశించడమూ పొరపాటే.
 • శాస్త్రాలలో ఈ లోకాన్నే ’మిశ్రలోకం’ అన్నారు. సుఖదుఃఖాల సమ్మేళనం ఈ లోకం. పాపపుణ్యాల మిశ్రమమిది.
 • అయితే సుఖదుఃఖాలు వస్తూపోతూ వున్నా, మన వ్యక్తిత్వాన్ని చెక్కు చెదరకుండా కాపాడుకోవడమే మన కర్తవ్యం.
 • ఎలాంటి వ్యక్తికైనా ప్రతికూల కాలమంటూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒక విషయంలో నిరాటంకంగా అవరోధాల్ని అధిగమించి విజయం సాధిస్తే, అదే విషయంలో మరోవ్యక్తి విఫలుడౌతాడు. అప్పుడు విజయం పొందిన వాడిని చూసి నైరాశ్యానికి గురికానక్కరలేదు. తనకంటే వైఫల్యాలు ఎదుర్కొనే వారు కూడా చాలామంది ఉండవచ్చు.
 • దుఃఖం మనం కోరితే రాలేదు. అలాగే సుఖం కూడా మనం కోరకుండానే రావచ్చు. దుఃఖాలకి కృంగిపోయేవారు క్రమంగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి, ధర్మాన్నీ, దైవాన్నీ కూడా నిందిస్తారు. సుఖాలకి పొంగి గర్వించేవాడు కూడా బుద్ధి సమతుల్యాన్ని పోగొట్టుకొని, ధర్మాన్నీ, దైవాన్నీ విస్మరిస్తాడు. రెండూ వ్యక్తిత్వానికి ప్రమాదకారులే.
 • సుఖదుఃఖాల గురించి కాకుండా ధర్మబద్ధమైన కర్తవ్యంపైనే దృష్టిని నిలిపిన వారు ధన్యజీవుడౌతాడని మన శాస్త్రాలు ప్రబోధిస్తున్నాయి.
 • అనుభవాలు ఎలా ఉన్నా, ఆచరణలో మాత్రం మనం పొరపాటున సంయమనాన్ని కోల్పోరాదు.
 • శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేక సంరంభం నుంచి దైవవశాత్తూ తొలగినా, వనవాసాల పాలైనా తన ధర్మం నుంచి, ఆత్మస్థితి నుంచి చ్యుతుడు కాలేదు.
 • ఓటమిపాలై, సంపదలనీ, రాజ్యాన్నీ కోల్పోయినా, అడవులలో మ్రగ్గినా మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా, తపస్సుతో కాలం గడుపుతూ, సరైన సమయం వచ్చేవరకు సంయమనాన్ని పాటించిన యుధిష్ఠిరుని నిష్ఠను సైతం మనం గమనించాలి.
 • కాలం కలిసిరని స్థితిలో పదవీచ్యుతుడైన నలుడు – అతని భార్య దమయంతి తమ ధర్మమూలాలను వదలకుండా, చాలా సమన్వయాన్ని పాటిస్తూ తిరిగి సుస్థిరులయ్యారు.
 • సాఫల్య వైఫల్యాలు, భోగాలు, విషాదాలు …ఏవి ఎలా ఉన్నా, ధర్మాచరణ ఇచ్చే తృప్తి చాలా గొప్పది. నీతికి నిబద్ధమై జీవించేటప్పుడు చేదు అనుభవాలు తారసపడినా, ఆ ధర్మబద్ధతే ఎంతో తీయని తృప్తినిస్తుంది.
 • పవిత్రంగా, నిష్కపటంగా బ్రతకడంలో ఉన్న తృప్తి కోట్లకు పడగెత్తిన వారికి సైతం లభించడం కష్మే. ఊహించని విధంగా మలుపు తిరిగి వేదనాభరితమైన సంఘటనలు జరిగితే మనోనిబ్బరాన్ని కోల్పోవడం సహజమే. వెంటనే “దేవుళ్ళు కూడా నన్ను మోసగించారు. ధర్మంగా బ్రతికే రోజులు కావు” ఇలాంటి మాటలు దొర్లుతాయి.
 • కానీ ఆ సమయంలోనే ’నిబ్బరం’ అనే మాటను మరువరాదు. ధైర్యం, నిగ్రహం వంటి విషయాలు కాని కాలంలోనే అవసరమయ్యే అంశాలు. ఆ సమయంలో మనల్ని మనం నియంత్రించుకొని, మరింతగా ధర్మబద్ధతని పాటించాలి.
 • ఉత్తమ సంస్కారం కలవాడు ప్రతికూల పరిస్థితుల్ని కూడా పరీక్షా సమయాలుగా తీసుకొని, అధిగమించే అంతర్గత శక్తిని అభివృద్ధి పరచడానికి అదో అవకాశంగా భావిస్తాడు.
 • అసలు ప్రతికూలతల్లో కూడా అనుకూలతను వెదకి అనుకూలంగా మలచుకొనే యుక్తిని సాధించగలగాలి.
 • పాండవులు అడవులపాలైనా, ఆ ఏకాంత సమయాన్ని సాధనగా మలచుకున్నారు. ఎందరో మహాత్ములతో శాస్త్ర, ధర్మచర్చలు, తత్త్వచిమ్తన వంటి జ్ఞాన సముపార్జనతో కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాజ్యాధికారం, పాలన లేని కాలాన్ని తపస్సమయంగా, విజ్ఞాన సంపాదనకు అనువైన ’తీరిక’గా భావించారు.
 • అర్జునుడు ఆ సమయంలోనే తపస్సునాచరిమ్చి రుద్ర ఇంద్రాది దేవతల అనుగ్రహాన్ని సంపాదించి, తద్వారా అస్త్ర విద్యల్ని సంపాదించుకున్నాడు. తన ధనుర్విద్యా కౌశలానిి మెరుగులు తీర్చాడు. ధర్మజుడు యజ్ఞయాగాదులతో, నిరంతర విచారనతో దైవబలాన్నీ, తత్త్వచింతననీ పెంపొందించుకున్నాడు.
 • శ్రీరాముడు వనవాస కాలంలో ఋషుల రక్షణ, దనుజుల శిక్షణ చేసి, సుగ్రీవాది వానరుల రాజ్యవ్యస్థను స్థిరపరచాడు. శబరి వంటి వారిని అనుగ్రహించాడు.
 • ఎంతటి కలిసిరాని కాలంలోనైనా బ్రతుకుకి పనికొచ్చే అంశాలుంటాయి. వాటిని గమనించి పురోగమించిన వాడే మహాపురుషుడు.
 • సార్వభౌమత్వం చేజారి, రాజ్యం అన్యాక్రాంతమై, భార్య దూరమై అవమాన భారంతో ఉన్న నలుడు అంతటి దుర్భర పరిస్థితుల్లో కూడా తన ధర్మబుద్ధిని విడనాడకుండా తనకున్న పాకకౌశలాన్నీ, సారథ్య నైపుణ్యాన్ని ప్రదర్శించి సానుకూల పరిస్థితుల దిశగా ప్రయాణించాడు.
 • మనం కోల్పోయినవి ఏమిటో ఆలోచించకుండా, మనకు మిగిలిన ఉపయోగకర అంశాలేమిటో పరిశీలించి, వాటిద్వారా పైకి ఎదగగలగాలి. ఈ మానసి స్థైర్యానికి ఆలంబనగా నిలిచే అంశాలు -ధార్మిక ప్రవర్తన, భగవద్విశ్వాసం
దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః!
వీతరాగ భయక్రోధః స్థితధీరుమునిరుచ్యతే!!


 • దుఃఖాలలో ఉద్విగ్నుడు (దిగులు పడేవాడు) కానివాడు, సుఖాలకు చలించని వాడు, రాగం భయం క్రోధం లేని వాడు – స్థితప్రజ్ఞుడు” అని గీతాచార్యుని మాట.
 • "ఆ స్థిత ప్రజ్ఞత ఎవరో యోగులకే తప్ప మనకెక్కడ సాధ్యమౌతుంది?" అని మాట్లాడడం కూడా సరికాదు.ఆ యోగులు కూడా సాధన ద్వారానే ఆ స్థితికి చేరుకున్నారు. సార్థకమైన జీవితానికి స్థితప్రజ్ఞత అవసరం.”ధీరుడు బంతివలె నేలమీద పడినా పైకి ఎగరగలదు. మూర్ఖుడు మట్టిముద్దవలె, పడినచోటే చతికిలబడతాడు” అన్న సుభాషితకారుని వచనాన్ని కూడా మనం స్ఫూర్తిగా తీసుకోగలగాలి

Comments

Popular Posts