‘‘ నా పేరు అజాద్’’

                                   
 మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన చంద్రశేఖర్ సీతారాం తివారీ అనే ఈ అబ్బాయిని, కాశీలో చదివించి, సంస్కృతంలో పెద్దపండితుణ్ణి చేయాలని ఆశించారు అతని తల్లిదండ్రులు.కాని ఇతనికి చదువు అబ్బలేదు.చదువుకోమని ఇంట్లో చేసిన ఒత్తిడిని భరించలేక తన 13వ ఏట ఇల్లొదిలి ముంబయి పారిపోయాడు. రెండేళ్ళపాటు అనేక కష్టాలు పడుతూ ముంబయిలో ఒక మురికివాడలో నివసించాడు. బ్రతకడానికి కూలి పనిచేశాడు. అయినా ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఈ కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించి 1921 లో కాశీకి వెళ్ళిపోయి అక్కడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు. 
                                     అదే సమయంలో భారత స్వాతంత్ర్యం కొరకు మహాత్మా గాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తు అట్టుడుకుతోంది. అప్పుడు ఈ కుర్రవాడు తాను కూడా భారత స్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడతని వయస్సు పదిహేనేళ్ళు.తాను చదువుతున్న సంస్కృత పాఠశాల ముందే ధర్నా చేశాడు.పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు.అతనిని విచారించిన బ్రిటిష్ న్యాయాధికారికి ఆ బాలుడిచ్చిన సమాధానంతో మతిపోయింది: ‘‘నీ పేరేమిటి?’’- ‘‘ నా పేరు అజాద్’’, ‘‘ తండ్రి పేరు’’-‘ ‘‘స్వాతంత్ర్యం’’, ‘‘నీ ఇల్లెక్కడ’’ - ‘‘కారాగృహం.’’ అంటూ ధైర్యంగా సమాధానం చెప్పాడు.కోర్టులో సందర్శకులనుంచి భారత్ మాతాకీ జైనినాదం పిక్కటిల్లింది. మతిపోయిన ఆ న్యాయాధికారి చిదిమితే పాలుగారే ముఖవర్చస్సుకల ఆ బాలుడికి ‘16 కొరడాల దెబ్బలు’ అంటూ శిక్ష ప్రకటించాడు.నరరూప రాక్షసులు కొరడా ఝళిపిస్తూ ఒక్కొక్క దెబ్బ కొడుతున్నప్పుడు .. శరీరమంతా రక్తసిక్తమైపోతున్నా ఆ బాలుడు దెబ్బ పడినపుడల్లా వందేమాతరం, భారత్‌మాతాకీ జైఅన్నాడు.అప్పట్లో శిక్షానంతరం, సేద తీర్చుకోమని మూడు అణాలు ఇవ్వడం రివాజు... ఆ మూడు అణాలు విసిరి వారి ముఖాన కొట్టాడు ఆ పిల్లవాడు.అప్పటినుంచి కాశీ ప్రజలంతా అతనిని ఆజాద్అని పిలవడం మొదలు పెట్టారు...ఈయనే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల సహచరుడు, దేశం గర్వించదగ్గ మహావీరుడు, భారతదేశ విప్లవ చరిత్రకే వన్నె తెచ్చిన మహోజ్వల శక్తి, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చంద్ర శేఖర్ ఆజాద్”.

Comments

Popular Posts