‘భరతమాత’ ఎవరు? ఏ మతానికి, ఏ కులానికి, ఏ ప్రాంతానికి చెందినది?

‘భరతమాత’ - భారతదేశం యొక్క జాతీయ మానవీకరణ రూపాన్ని కలిగినటువంటి దేవమాత. ఈమె సాధారణ మహిళవలె కుంకుమరంగు చీరను ధరించి జాతీయజెండాను పట్టుకొని ఉంటుంది. కొన్నిసార్లు సింహంతో పాటు ఉంటుంది.
· భరతమాత యొక్క చిత్రం 19వ శతాబ్దంలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఏర్పాటుచేయబడింది. ‘కిరణ్ చంద్ర బెనర్జీ’చే రూపొందిన ఒక నాటకంలో 1873లో మొదటిసారి భరతమాత ప్రదర్శింపబడింది.
·  లాల్,బాల్,పాల్ లో ఒకరైన బిపిన్ చంద్రపాల్ తన ఆధునిక ఆధ్యాత్మికత ప్రసంగాలలో భరతమాత గొప్పదనాన్ని కొనియాడేవారు.
·    1936 లో ‘శివ్ ప్రసాద్ గుప్త్’  వారణాసిలో తను నిర్మించిన ‘భరతమాత’ గుడిని గాంధి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
·       అబనీంద్ర టాగోర్ అనే ప్రముఖ చిత్రకారుడు  ‘చతుర్భుజ’  భారత మాతను  చిత్రించాడు.ఈ భారతమాత ఒక చేతిలో  జపమాల, ఇంకో చేతితో వరికంకులు, మిగిలిన రెండు చేతులతో శ్వేతవస్త్రం, తాళపత్రాలు పట్టుకుని ఉంటుంది.
·  వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ,’సిస్టర్ నివేదిత’ చతుర్భుజ  భారత మాతను  కొనియాడుతూ ఆ నాలుగు చేతులు ‘శిక్ష, దీక్ష, అన్న, వస్త్రాల’కు సూచికలని పేర్కొన్నారు.
·  సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ సుబ్రహ్మణ్య భారతి ‘భరతమాత ను గంగాదేవి, పరశక్తిలతో పోల్చారు. తను గురువుగా భావించిన  సిస్టర్ నివేదిత తనకు భారతమాత స్వరూపాన్ని చూపించారని భారతి పేర్కొన్నారు.
(భారతమాత కు వారణాసి, హరిద్వార్, కలకత్తా లలో ‘మందిరాలు నిర్మించారు.)
ఈ విధంగా ‘భారతమాత’  ఈ దేశసంక్షేమాన్ని కాంక్షించే చల్లనితల్లిగా , సౌభ్రాతృత్వాన్ని సూచించే మాతృమూర్తిగా, తన బిడ్డల దీక్ష,పట్టుదల,ధైర్యసాహసాలను చాటిచెప్పే వీరనారిగా  దేశవిదేశీయులచే కొనియాడబడినది.
కానీ,కొందరు  తమ స్వప్రయోజనాల కోసం ‘భారతమాత’ తమ మతానికే చెందుతుందని, మరికొందరు ఈమె హిందువులకి మాత్రమే చెందిన దేవతని, తమ మతానికి చెందదు అనే దుష్ప్రచారాలు చేయడం వలన ‘ఈ తల్లి’ కొన్ని వర్గాల ‘తన బిడ్డలకు’ దూరమవుతోంది.ఇకనైనా ఈ అభిప్రాయాల మారాలి, అపోహలు తొలగి పోవాలి.
భారత్ మాతా కి జై!

జైహింద్!!                                                                                      -సాహస్

Comments

Popular Posts