మొట్టమొదట ‘భరత మాత’ రూపం.....

భారత్‌మాతా కీ జై’... తనువు, మనసు పులకిస్తుండగా స్వర పేటికను చీల్చుకుని పెల్లుబికే నినాదమిది! దేశమంతా ప్రతిధ్వనించే నినాదమిది! ఒక దేశాన్ని మాతృమూర్తిగా భావిస్తూ, ఆమెకు ఒక రూపం ఇవ్వడం ఒక అపూరూపం! భారత స్వాతంత్ర్యోద్యమ రూపాల్లో సాహిత్య పోరాటంకూడా ఒకటి! ఈ సాహిత్య మధురిమల నుంచే భరత మాతభావన ఆవిష్కృతమైంది.
మొట్టమొదటిసారిగా అవనీంద్రనాథ్‌ టాగోర్‌ అనే ప్రఖ్యాత చిత్రకారుడు భరత మాతచిత్రాన్ని గీశారు. దేశాన్ని ఆయన దేవతగానే చూపించారు. కాషాయ రంగు చీర, నాలుగు చేతులు... ఒక చేతిలో తాళపత్రాలు (వేదాలు), మరో చేతిలో వరి కంకులు, మరో చేతిలో జపమాల, ఇంకో చేతిలో ధవళ వస్త్రం! పాదాల ముందు తెల్ల కలువలు! ఇదీ... అవనీంద్ర రాయ్‌ చిత్రించిన భారత మాత రూపం. ఈ చిత్రం సిస్టర్‌ నివేదితను ఎంతగానో ఆకట్టుకుంది. తన పిల్లలకు శిక్ష (విద్య), దీక్ష, అన్నం, వస్త్రం అందించే దేవతగా ఆమె భరత మాతను అభివర్ణించారు. కాల క్రమంలో అవనీంద్ర రాయ్‌ చిత్రించిన భరత మాతరూపంలోనూ మార్పుచేర్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు... భారత దేశ చిత్రం ముందు, తలపై కిరీటం, ఒక చేతిలో త్రివర్ణ పతాకం బూనిన మహిళనే భరత మాతగా ముద్రిస్తున్నారు. కొందరు దుర్గా దేవిని తలపింపచేసేలా సింహాన్ని కూడా జత చేస్తున్నారు. అయితే... భరతమాతరూపాన్ని ప్రభుత్వాలు అధికారికంగా గుర్తించలేదు.

Comments

Popular Posts