అవధూత, భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి సూక్తులు

1) ఆకలై కొంగు పట్టేవారికి అన్నం పెట్టాలయ్యా.
2) వాళ్ళుండే దాన్నిబట్టి గదయ్యా మనముండేది.
3) అన్ని జీవులలో వెంకయ్య ఉన్నాడని రాసుకో.
4) అందరికీ పంట పండించాను. దాన్ని దొంగలుపడి దోచుకోకుండా చూసుకోండయ్యా.
5) ఒకరిని పొమ్మనేదాన్ని కంటే మనమే పోవటం మంచిదయ్యా.
6) సన్యాసులుగా ధర్మంగా ఉండటంలో గొప్పేముందయ్యా. సంసారంలో ధర్మంగా ఉండటమే గొప్ప.
7) వెయ్యి గొర్రెలలో ఉన్నా, మన గొర్రెను కాలు పట్టి లాక్కు రావచ్చు.
8) మంత్ర మెక్కడుంది? తంత్రమెక్కడుంది? చూచుకొంటూ పొయ్యేదే గదయ్యా.
9) సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడ కొచ్చి ఏదనుకొంటే అదయ్యేదే గదయ్యా.
10) నీవు నన్ను విడిచినా, నేను నిన్ను విడువను.
11) మహారాజుని చూస్తే ఏమొస్తుంది? నీ కేముందో అదే నీకు మిగులు కదయ్యా.
12) అందరినీ సమానంగా చూడగలిగినప్పుడు, నీవు దేవుడిని చూడగలవు కదయ్యా.
13) నా ఎడల నీ విశ్వాసమే నన్ను కదిలిస్తుంది కదయ్యా.
14) కూలివానికి, అతని చెమటారకముందే, కూలి ఇవ్వటం మంచిది కదయ్యా.
15) ఇతరులకు డబ్బు వడ్డీకి ఇచ్చే సమయంలో కూడా ధర్మాన్ని వీడరాదయ్యా.
16) పావలా దొంగిలిస్తే, పదిరూకల నష్టం వస్తుంది గదయ్యా.
17) లాభం కోసం కక్కుర్తి పడితే, ఆ పాపంలో భాగం పంచుకోవాలి గదయ్యా.
18) దారం తెగకుండా చూసుకో. ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను గదయ్యా.
19) అత్యాశ వదులుకుంటే, అన్నీ వదులుకున్నట్లే.
20) మర్యాదలు పాటిస్తూ, సాధారణ జీవితం గడుపుతూ, సద్గురులకు సేవ చెయ్యటం నేర్చుకోవటం మంచిది గదయ్యా.
----భగవాన్ శ్రీశ్రీశ్రీ వెంకయ్యస్వామి వారి ఆశ్రమం, గొలగమూడి, నెల్లూరు జిల్లా

Comments

Popular Posts