పిల్లలు మానసికంగా,సామాజికంగా పరిణితి సాధించాలంటే ....

·    చిన్నపిల్లల లేత మనసులో ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి. ఆ సందేహనివృత్తి కోసం వారు పెద్దల వద్దకు పరిగెత్తుకొచ్చి, తమ సందేహాన్ని చెప్పి, జవాబు కోసం ఎదురుచూస్తారు. పిల్లల సందేహాలను వారికి అర్ధమయ్యే భాషలో విశదంగా చెప్పి, వారి అనుమానాలను తీర్చి, వారిని సంతృప్తిపరచాలి. అలాకాకుండా  వారి మీద విసుక్కుని వారిని అవతలకు పంపిస్తే ఏ విషయాన్నైనా తెలుసుకోవాలన్న పిల్లల ఆలోచనను, ఆసక్తిని, జిజ్ఞాసను అణగద్రోక్కినవారిమి అవుతాము. పిల్లలు ఆ విధంగా అనుమానాలను వెల్లడించడం అంటే, వారిలోని ఆలోచనలను వెల్లడించడమే. వారిలో ఆలోచనాధోరణి, మానసిక ఎదుగుదల ఆరంభమైందని తెలుసుకోవాలి. పిల్లల ప్రశ్నలకు పెద్దలు జవాబివ్వాలి. పెద్దల సమాధానాలు వారికి సంతృప్తిని, నూతన విషయాన్ని తెలుసుకున్నామన్న ఆనందం కలిగిస్తాయి. పిల్లల్లో జనరల్ నాలెడ్జిని పెంపొందించాలి. ఏ విషయానైన పిల్లలకు అర్ధమయ్యేటట్లుగా బోధించడంవల్ల, పిల్లలు చురుకుగా కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి, ఆలోచనాశక్తి, మేధస్సు, మానసిక ఎదుగుదల పెరుగుతాయి.

·       మంచి పాఠశాలలో పిల్లలను చేర్పించగానే తల్లిదండ్రుల బాధ్యత తీరిపోదు. పిల్లల చదువు ఏ విధంగా సాగుతున్నది, పిల్లలు తరగతిలో ఏ విధంగా ప్రవరిస్తున్నది, ఏ సబ్జెక్టులో వెనుకపడుతున్నది టీచర్లను అడిగితెలుసుకుంటు ఉండాలి. పిల్లలు ఆ సబ్జెక్టులో వెనుకబడటానికి గల కారణాలేమిటన్నది అవగాహన చేసుకొని, పిల్లలకు ఇంట్లో ఆ సబ్జెక్టును బోధిస్తూ, ఆ సబ్జెక్టులో ఇష్టాన్ని పెంచుకునేలా, రాణించేలా పెద్దలు పిల్లలకు శిక్షణనివ్వాలి. పిల్లలు చదువుతో ఒత్తిడి, ఆందోళనకు గురవ్వకుండ చూడాలి.ర్యాంకులు కోసం, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని వారిని నిర్భందించకూడదు పిల్లలు చదువులో రాణించేలా పెద్దలు తమ తోడ్పాటును అందించాలేకానీ, వారి మీద ఒత్తిడి తేకూడదు. తోటిపిల్లలు లేదా తోబుట్టువుల తెలివితేటలతో పోలుస్తూ, వారిని కించపరచకూడదు. పెద్దలు ఆ పొరపాటువల్ల పిల్లలలో ఆత్మనూన్యత భావం లేదా తోటిపిల్లల మీద అసూయా, ద్వేషం ఏర్పడుతాయి. పిల్లల మానసిక ఎదుగుదల, ఐక్యూ కుంటుపడుతుంది.

·  పిల్లలు మానసికంగా, వారి వయస్సు కు తగినట్లుగా ఎదిగేందుకు పెద్దలు సరైన శిక్షణనివ్వాలి. వారాంతంలో గానీ, ప్రత్యేకమైన సెలవురోజుల్లో కానీ పిల్లలను బయటకు తీసుకెళ్ళాలి. తోటిపిల్లలతో ఆడుకోమని పంపించాలి. కులం తేడాలు, బీద గొప్ప భేదభావాలు పిల్లల ఎదురుగా ప్రస్తావించకూడదు.తమ స్థాయివారి తోనే పిల్లలు స్నేహం చేయ్యాలని,బీద పిల్లలను దగ్గరకు చేరనివ్వకూడదనిపెద్దలు బోధించకూడదు. బాల్యం నుంచే, పిల్లల మనసులో అందరిని సమాన దృష్టితో చూసే మనస్తత్వాన్ని, సంస్కారాన్ని నేర్పడం పెద్దల పెంపకంలోని బాధ్యత. చిన్నప్పటి నుంచీ చివారి వయస్సుకు తగిన పనులను వారిచేత చేయించాలి.

Comments

Popular Posts