పెళ్ళిలో జీల కర్రబెల్లం ఎందుకు పెడతారు?

మన సంప్రదాయాలు, ఆచారాలు అనేక సూక్ష్మ అంశాలతో ముడిపడి ఉంటాయి. అందులో వైజ్ఞానిక, ఆరోగ్య,  యోగసూత్రాలకు భాష్యాలు,పరమార్ధాలు దాగి ఉన్నాయి. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క అంతర్యాన్ని తెలియజేస్తాయి. జీలకర్రను సంస్కృతంలో జీర దండం అంటారు. జీర శబ్దానికి అర్థం బతుకు, జీవనం. దండం బతుకునకు ఆధారం అని సామాన్యార్థం. ఇక బెల్లాన్ని గుడం అంటారు. గుడం అంటే నిద్ర, మత్తు. దీనినే పరవశంఅంటారు. ఇలా జీలకర్ర, బెల్లం అంటే జీవనాధార గుణం అని అర్థం. జీవించటానికి కావాల్సింది ప్రేమ, స్నేహము, మైత్రి, ఆపేక్ష, ఎదుటివారిని ప్రేమించటమే నిజమైన జీవనధార దండం. తాను వివాహం చేసుకుంటున్న భార్యను ప్రేమించటం, భార్య భర్తను ప్రేమించటం.. ఇద్దరిలో అన్యోన్యానురాగం మాత్రమే. వారి మధ్య ప్రేమ ఒక మత్తులా, ఒక నిద్రలా ఉండాలి. మరేది తెలియకూడదు. దీనినే ఒకరికొకరు, ఒకరిలో ఒకరు అని జీవించటమే వివాహ పరమార్థం.

ఒకసారి కలిసిన దంపతులు ఇక విడిపోరాదు. జీలకర్ర, బెల్లాన్ని నూరి కలిపితే మళ్లీ మనమే విడదీయలేం. ఆ
 కలిపిన దాంట్లో ఒక బెల్లమే కనిపిస్తుంది. కానీ జీలకర్ర కనిపించదు. అంటే భార్య భర్తల జీవనంలో ఎదుటివారికి వారి పరవశం, జీవన మాధుర్యం, ఆ మత్తే కనిపిస్తుంది. దాని వెనక ప్రేమ, స్నేహం, అనురాగం, మైత్రి అంతర్లీనంగా ఉంటాయి. భార్యాభర్తలు కలిసిమెలిసి బతుకుతూ, నవ సమాజాన్ని నిర్మించండి అనే పరమార్థాన్ని జీలకర్ర, బెల్లం తెలియజేస్తుంది.

శాస్త్రరీత్యా ఈ ''గుడజీరక'' మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అలా జీలకర్ర, బెల్లం కలిపి నూరిన ముద్దని తలలమీద పెట్టుకునే సమయంలో ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకోవాలి. అలా చూసుకున్న సమయంలో వధూవరులిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఆకర్షణ కలిగి, జీవితాంతం అన్యోన్యంగా కలసిమెలసి ఉంటారన్నది దీని ఆచారం. జీలకర్ర, బెల్లం వలన ఏర్పడి రసాయనక చర్య వల్ల మానసిక బంధం బలపడుతుందని మన పూర్వీకుల అభిప్రాయంగా ఉంది. 

Comments

Popular Posts