గుడిలో శఠారి(శఠగోపం) పెట్టించుకోవడం తప్పనిసరా?


గుడిలోని దేవుడు లేదా దేవత విగ్రహానికి ప్రతీక-శఠారి. గుడికి వెళ్లిన భక్తులకు దేవతలను తాకేందుకు వీలుండదు కాబట్టి తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయపూజారి శఠారిని తీసుకొచ్చి భక్తుల తలకు తగిలించడం ఆచారంగా వస్తోంది. శఠులు అంటే మోసగాళ్లు అని అర్థం. అరి అంటే శత్రువు. శఠారి అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం.ఆలయ పూజారి శఠారిని తీసుకు వచ్చి భక్తుల తలకు తాకించడం ద్వారా వారిలోని చెడు తలంపులు, ద్రోహబుద్ధులు నశించి సత్ప్రవర్తన అలవడుతుందనేది ఈ సంప్రదాయం వెనుక అంతరార్థం.
      మనం ఏ దేవాలయానికి వెళ్ళినా దైవ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వున్న పూజారిగారు మన శిరస్సు మీద భగవంతుడి పాదముద్రలు వున్న శఠగోపాన్ని వుంచుతారు. అలా మన శిరస్సు మీద ఆ శఠగోపాన్ని వుంచిన ఆ క్షణంలో మనం సర్వ అహంకారాలను పరిత్యజించి వినయంగా తల వంచుతాం. ఒక విధంగా చెప్పాలంటే ఆ చర్య మనలో అసంకల్పితంగానే జరుగుతుంది. మనం దైవ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత ఒక్కోసారి పూజారి గారు వేరే పనిలో వుంటే ఆయనని అడిగి మరీ మనం శఠగోపం శిరస్సు మీద వుంచుకుంటాం.దైవ దర్శనం అయిన తర్వాత శిరస్సు మీద శఠగోపం ధరించడం తప్పనిసరి.. శిరస్సు మీద శఠగోపం ధరించడం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుడి పాదాలను మన శిరస్సు మీద ధరించడం తప్ప మరొకటి కాదు.ఎందుకంటే వాటిపైన విష్ణుపాదాలు ఉంటాయి. అంతటి భాగ్యాన్ని కాదనుకుని మనం దేవాలయం నుంచి బయటకు రావడం ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోవడమే.ఎందరో దేవతలు పూజించిన పాదాలను మన శిరస్సు మీద ధరించడం కంటే భాగ్యం మరొకటి వుంటుందా? మన శత్రువులు ఎవరైనా మన పాదాలు పట్టుకుంటే మనం వాళ్లని క్షమిస్తాం. అవసరమైతే వాళ్ళకి సహాయం చేస్తాం. మరి భగవంతుడిని ఎంతో ఆరాధించే మనం ఆయన పాదముద్రలను కూడా మన శిరస్సు మీద ధరిస్తే ఆయన మనమీద ఎంత వాత్సల్యం చూపిస్తాడో కదా!


      దేవాలయానికి వెళ్ళినప్పుడు తీర్థ ప్రసాదాలతోపాటు శఠగోపం కూడా తప్పకుండా తీసుకోవాలి. కొంతమందికి శఠగోపాన్ని తీసుకోవాలని వున్నా, పూజారి గారికి దక్షిణ ఇవ్వకపోతే బాగోదన్న ఉద్దేశంతో శఠగోపం తీసుకోకుండానే వచ్చేస్తుంటారు.శఠగోపం తీసుకోవడం ఆధ్యాత్మికపరంగా మాత్రమే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి విషయం. శఠగోపంని రాగి, కంచు, వెండితో తయారుచేస్తారు. శఠగోపాన్ని శిరస్సు మీద వుంచుకున్నప్పుడు మన శరీరంలో అధికంగా వున్న ఉన్న విద్యుత్‌ శఠగోపంలోని లోహంలోంచి బయటకి వెళ్ళిపోతుంది. అందువల్ల మనలో వున్న అధికంగా వున్న ఆవేశం, ఆందోళన తగ్గుతాయి. అందువల్ల ఈసారి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా శఠగోపాన్ని శిరోధార్యంగా స్వీకరించాలి.

Comments

Popular Posts