వివాహ మహోత్సవంలో ఇదొక అద్భుత ఘట్టం-సప్తపది/ఏడడుగులు గురించి వివరణ

సప్తపది :

మాంగల్యధారణ జరిగిన తర్వాత, అగ్నిసాక్షిగా ఆ నూతన వధూవరులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఏడడుగులు కలిసి నడుస్తారు. ఇదే 'సప్తపది'. వాస్తవానికి ఈ సమయంలో వధువు నడుముపై వరుడు చెయ్యి వేసి, దగ్గరగా తీసుకుని, అగ్నిహోత్రానికి దక్షిణవైపున నిలబడి ఏడడుగులు నడవాలి. ఒక్కో అడుగుకు ఒక్కొక్క మంత్రాన్ని పురోహితులు చెప్తారు. 

ఏడు అడుగులు
మంత్రం
అర్ధం
మొదటి అడుగు
ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు
ఈ తొలి అడుగుతో విష్ణువు మనలను ఒక్కటి చేయుగాక!
రెండో అడుగు
ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు
ఈ రెండవ అడుగుతో విష్ణువు మనకు శక్తిని కలుగజేయుగాక!
మూడవ అడుగు
త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు
ఈ మూడవ అడుగుతో వివాహవ్రత సిద్ధికి విష్ణువు మనలను కరుణించుగాక!
నాలుగో అడుగు
చత్వారి మయోభవాయ విష్ణుః  త్వా అన్వేతు
ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందం కలుగజేయుగాక
ఐదవ అడుగు
పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు
ఈ ఐదవ అడుగుతో మనకు పశుసంపదను విష్ణువు కలిగించుగాక!
ఆరవ అడుగు
షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు
ఈ ఆరవ అడుగుతో మనకు ఆరు ఋతువులూ సుఖమునే కలిగించుగాక!
ఏడవ అడుగు
సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు
ఈ ఏడవ అడుగుతో గృహస్థాశ్రమ ధర్మనిర్వహణను మనకు విష్ణువు అనుగ్రహించుగాక

అదే సమయంలో వరుడు 'సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదాబభూవ! సఖ్యం తే గమేయగ్‌ం సఖ్యాత్‌! తేమాయోషం సఖ్యాన్మే మాయోష్ఠాగ్‌ం సమాయవః సంప్రియౌ రోచిష్ణూ సుమన స్యమానౌ, ఇష మూర్జమభినంవసానౌ నం నౌమనాగ్‌ంసి సంవ్రతా సమచిత్తన్యాకరమ్‌' అంటాడు. అంటే, 'ఏడడుగులతో నాకు మిత్రమైన ఓ సఖీ! నీవు నా స్నేహాన్ని వీడకు, మంచి ప్రేమగలవారమై, మంచి మనసుతో కలిసి జీవిద్దాం, సమాలోచనలతో ఒకే అభిప్రాయంతో కలిసి ఉందాం!' అంటాడు. 

దానికి జవాబుగా ఆ వధువు 
'పాత్వమసి అమూహం! అమూహమస్మి! సా త్వం ద్వౌ, అహం పృథివీ! త్వం రేతో అహం రేతోభృత్‌! త్వం మనో అహమస్మి వాక్‌! సామాహమస్మి, ఋక్తం సా మాం అనువ్రతాభవ!' 
అంటుంది. అంటే 'ఓ మిత్రమా! నీవు ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండు. నేను కూడా ఏ తప్పులూ చేయను! నీవు ఆకాశమైతే నేను భూమిలా కలిసి ఉందాం. నీవు శుక్రమైతే నేను శ్రోణితాన్ని! నీవు మనసైతే నేను వాక్కును! నేను సామ(వేదగాన)మైతే నీవు ఋక్కువై కలిసి ఉందాం!!' అని అర్థం. అర్థం తెలియాలేగానీ, ఎంత గొప్పభావనలు ఇవి!! 

అప్పుడు వరుడు, వధువును ఇలా వేడుకుంటాడు: 
'పుంసే త్రాయ వేత్తవేశ్రియై ఉత్తరయ వేత్తావయేహి సూనృతే!' అంటాడు. అంటే 'మన వంశాభివృద్ధి కోసం, ఉత్తరకాలంలో ఉత్తమ లోకాల ప్రాప్తి కోసం, ధైర్యవంతుడైన, సత్యవాక్‌ పరిపాలకుడైన వంశాభివృద్ధి చేయగల పుత్రులను నాకు ప్రసాదించు!' అని అర్థం. 
(ఇది ప్రాచీన కాలానికి అనుసరించి చెప్పబడినది.ఇప్పటి పరిస్థితులు,సంసృతి ప్రకారం పుత్రులు,పుత్రికలు అని అర్ధం చేసుకోవాలి)

వివాహ మహోత్సవంలో ఇదొక అద్భుత ఘట్టం. ఈ ఘట్టంతో వధువు గోత్రం మారుతుంది. ఆమె వరుని సతీమణి అయి, అతని గోత్రవతి అవుతుంది. 


Comments

Popular Posts