ఏ రోజు ఏ దైవాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది?

కొంతమంది భక్తులు ఏ రోజు ఏ దైవానికి పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిస్తే కచ్చితంగా అదే చేసి త్వరగా ఫలితాన్ని పొందాలని అనుకుంటారు. అటువంటి వారికోసమే శివ మహాపురణంలో పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబందించిన విషయాలు తెలుపబడ్డాయి. దేవతల ప్రీతీ మరియు అనుగ్రహం కోసం ఐదు రకాలైన పూజ పద్ధతులు చెప్పబడ్డాయి. మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధన అనేవే ఆ అయిదు విధాలు. పూజలు మనకున్న ఏడు వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కో దేవతకు చేయవచ్చు.
ఆదివారం :- ఆదివారం ఆదిత్యుడిని(సూర్యభగవానుడు), ఇతర దేవతలను పూజించాలి. ఆదిత్యపూజ ద్వారా నేత్ర రోగం, శిరో రోగం, కుష్ఠు రోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒకరోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేదా మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతను అనుసరించి పూజించాలి. దీని వలన సుర్యానుగ్రహప్రాప్తి కలిగి రోగవిముక్తి చెందుతారు.
సోమవారం :-  సంపద కోరుకునేవారు సోమవారం రోజు లక్ష్మిదేవిని ఆరాధించాలి. ఆరోజున పూజ తర్వాత వేదపండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.
మంగళవారం :- రోగాలు తగ్గటం కోసం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్ధాలతో వేదపండితులకు భోజనం పెట్టాలి.
బుధవారం :- పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
గురువారం :- గురువారం ఆయుష్షుని, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్ధాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం ఉత్తమం.
శుక్రవారం :- శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆరోజున పూజానంతరం వేదపండితుల తృప్తికోసం షడ్రుచులకోసం కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల తృప్తి కోసం మంచి మంచి వస్త్రాలని బహుకరించాలి.
శనివారం :- శనివారం రుద్రాది దేవతలా ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలని అనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయడం వలన పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.
ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషించి అనుగ్రహించేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. 

Comments

Popular Posts