ఆంజనేయుడికి సింధూరంఎందుకు అంత ప్రియం?

ఒకసారి ఆంజనేయుడు నిత్యకృత్త్యాలైన పనులతో అలసిపోయి, బాగా ఆకలిగా ఉండటం వల్ల తన స్వామి శ్రీరామచంద్రుల వారి అర్థాంగియైన సీతమ్మ తల్లిని భోజనము వడ్డించమని అడిగాడు. అప్పుడే స్నానాధికాలు ముగించుకొన్న జానకీదేవీ హనుమా! కొద్దిసేపు ఆగు. మొదట పాపిటలో సిందూరము ఉంచుకుని తరువాత వడ్డిస్తానుఅని అన్నది. 
అప్పుడు హనుమంతుడు అమ్మా ! పాపిటలో సిందూరం ఎందుకు ధరిస్తారమ్మా? అని ప్రశ్నించాడు. దీనిని నేను నీ ప్రభువు కళ్యాణ నిమిత్తమై(క్షేమం కోసం) పాపిట పెట్టుకొంటున్నాను సింధూరము సౌభాగ్య వృద్ధిని కలిగిస్తుంది. దీనిని ధరించిన వారి భర్తలు చిరాయువులై వర్థిల్లుతారుఅని సీతమ్మ జవాబు చెప్పింది. ఈ మాటవిన్న హనుమంతుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొద్దిసేపు తర్వాత తిరిగి వచ్చాడు ఆయన నఖశిఖ పర్యంతము సింధూరము పూసుకొని ఉన్నాడు. 
సీతమ్మ ఆశ్చర్యపడి హనుమా ! శరీరమంతా సింధూరం ఎలా పూసుకొన్నావు ?’ అని అడిగింది. అంత మారుతి వినమ్రుడై సిందూరము ధరిస్తే స్వామికి కళ్యాణ ప్రదమై ఉంటుందని నీవే అన్నావుగదా అమ్మా! నా ప్రభువు ఎల్లప్పుడు కళ్యాణప్రదంగా ఉండాలని నేను సిందూరము పూసుకొన్నాననిసమాధానం ఇచ్చాడు. హనుమంతుని సమాధానం విన్న సీత ఆనందపరవశ నేత్రాలతో, అతని ప్రభు భక్తికి సంతోషంతో హృదయ పూర్వకంగా ఆశీర్వదించింది. ఆంజనేయుని ప్రభుభక్తి పరాయణతకు ఇది నిలువెత్తు నిదర్శనము.


Comments

Popular Posts