మంగళ సూత్రధారణ వెనుక ఉన్న మహోత్తర ఉద్దేశ్యం....

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు ఉన్నాయి. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు ఉన్నాయి. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపి కూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మాంగల్యం అంటే మంచిది అని, ధారణ అనగ ధరించడం అని. పెళ్లి కూతురి మెడలో రెండు మాంగల్యాలు పెళ్లి కొడుకు కడతాడు. ఒకటి పెళ్లి కూతురు తరుపునుండి, మరొకటి పెళ్లి కొడుకు తరపు నుండి, మాంగల్యంకి రెండు బిళ్ళలు వేలాడుతూంటాయి. ఈ మాంగల్యం రక్షణ, నమ్మకానికి, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడునీడగా ఉంటానని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అందరి ముందు ప్రమాణం చేస్తున్నాడనటానికి ప్రతీక. మూడూ ముళ్లు వేస్తాడు. అవి స్తూల శరీర(భౌతిక శరీరం), సూక్ష్మ శరీర(పరబ్రహ్మ), కారణ శరీర(ఆత్మ) కి ప్రతిరూపాలు. మనస, వాచ, కర్మణ (నమ్మడం,చెప్పడం,చేయడం) కి ప్రత్రిరూపాలు కూడా. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!!
(నా జీవన హేతువైన ఈ మాంగల్యమును నీ మెడలో కట్టుచున్నాను.నీవు నూరేళ్ళు జీవించుము )

మంగళ సూత్రము భార్యా భర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు. అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం. శక్తి స్వరూపిణి అయిన స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువులు నమ్ముతారు. ఆందుకే స్త్రీలు మాత్రమే మంగళ సూత్రాన్ని ధరిస్తారు.


Comments

Popular Posts