షోడశోపచారములు అనగా ఏవి?

భగవంతుడిని మన ఇంటికి ఆహ్వానించి సేవించడమే పూజ. అనగా భగవంతుడిని ఒక విశిష్ట అతిథిలా భావించి సేవ చేయడం లాంటిది అని అర్ధం.మనకు బాగా కావలసిన అతిథి మన ఇంటికి వచ్చినప్పుడు (పూర్వకాలం లో) ఎలాంటి సత్కారాలు చేస్తామో అదే విధంగా దేవుణ్ణీ సేవించడమే షోడశోపచారాల తో కూడిన పూజావిధానం అని పిలుస్తారు.
ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనం , స్నానం, వస్త్రం, యజ్ఞొపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం అనే పదహారు  సేవలనే     షోడశోపచారాలు అంటారు.
ఇంట్లోకి అతిథి వస్తున్నప్పుడు ఎదురెళ్లి లోపలికి తీసుకురావడం-ఆవాహనం.
1.       అతిథి ఇంట్లోకి వచ్చాక కుర్చీ వేయడం-ఆసనం,.
2.      కాళ్లు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వడం-పాద్యం,
3.      చేతులు కడుక్కునే నీళ్లు-అర్ఘ్యం,
4.      దాహం తీర్చునేందుకు ఇచ్చే నీరు-ఆచమనం,
5.      ప్రయాణ బడలిక తీర్చుకునేందుకు -స్నానం,  
6.      కట్టుకునేందుకు- వస్త్రం,
7.      యజ్ఞొపవీతం (యజ్ఞ = యజ్ఞార్థము- అనగా ఉత్తమ కర్మలాచరించుటకు చిహ్నంగా ధరింపబడు, ఉపవీతం = దారం.)
8.      బొట్టు పెట్టి, చల్లటి గంధం రాయడం,
9.      పూలతో అలంకారం చేయడం,
10.  వాతావరణాన్ని హాయిగా చేసేలా పరిమళం వెదజల్లే ధూపం వేయడం,
11.   కాంతిమంతంగా అనిపించేందుకు-దీపాన్ని చూపించడం,  
12.  పూజను బట్టి, ముందుగా అవసరార్థ నివేదనమని ఏ బెల్లపు ముక్కో, అరటి పండో పెట్టడం లేదా మహానైవేద్యం సమర్పించడం,
13.  తర్వాత చక్కటి సుగంధ ద్రవ్యాలతో నిండిన తాంబూలాన్ని అందించడం,
14.  చివరిగా హారతిచ్చి, మనల్ని మనమే ఆయనకు అర్పించుకునే క్రతువుగా మంత్రపుష్పాన్ని సమర్పించి పూజను ముగించడం
ఇలా మనింటికి వచ్చిన మహా అతిథిని మనకున్నంతలో గౌరవంగా చూసుకోవడమే ఈ షోడశోపచారాల వెనుక ఉన్న పరమార్థం.


Comments

Popular Posts