అన్నం పరబ్రహ్మ స్వరూపం!

ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా.

ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటిని అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరికి కడుపు పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట.

ఆయన సమకూర్చిన ఆన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.

ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయు: క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.

Comments

Popular Posts